India vs West Indies: వెస్టిండీస్‍పై టీమిండియా సునాయాస విజయం.. మెరిసిన స్పిన్నర్లు.. రాణించిన ఇషాన్-cricket latest news ind vs wi team india beat west indies in first odi by 5 wickets ishan kishan hits half century ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  India Vs West Indies: వెస్టిండీస్‍పై టీమిండియా సునాయాస విజయం.. మెరిసిన స్పిన్నర్లు.. రాణించిన ఇషాన్

India vs West Indies: వెస్టిండీస్‍పై టీమిండియా సునాయాస విజయం.. మెరిసిన స్పిన్నర్లు.. రాణించిన ఇషాన్

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 27, 2023 11:51 PM IST

IND vs WI 1st ODI: తొలి వన్డేలో వెస్టిండీస్‍ను టీమిండియా చిత్తుగా ఓడించింది. భారత స్పిన్నర్లు ఈ మ్యాచ్‍లో విజృంభించి.. విండీస్‍ను కుప్పకూల్చారు. ఇషాన్ కిషన్ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు.

IND vs WI 1st ODI: వెస్టిండీస్‍పై టీమిండియా సునాయాస విజయం.. మెరిసిన స్పిన్నర్లు, ఇషాన్
IND vs WI 1st ODI: వెస్టిండీస్‍పై టీమిండియా సునాయాస విజయం.. మెరిసిన స్పిన్నర్లు, ఇషాన్ (AFP)

IND vs WI 1st ODI: వెస్టిండీస్‍ గడ్డపై వన్డే సిరీస్‍లో టీమిండియా శుభారంభం చేసింది. మూడు వన్డే సిరీస్‍లో తొలి మ్యాచ్‍లో విండీస్‍పై భారత జట్టు సునాయాసంగా గెలిచింది. బార్బడోస్ వేదికగా నేడు (జూలై 27) జరిగిన తొలి వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్‍పై గెలిచింది. లక్ష్యఛేదనలో 163 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. భారత స్పిన్నర్లు కుల్‍దీప్ యాదవ్ (4/6) నాలుగు, రవీంద్ర జడేజా (3/37) మూడు వికెట్లతో చెలరేగటంతో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ విలవిల్లాడింది. 23 ఓవర్లలోనే 114 పరుగులకే కుప్పకూలింది. విండీస్ కెప్టెన్ షాయ్ హోప్ (43) ఒక్కడే రాణించాడు. మిగిలిన బ్యాటర్ల విఫలమయ్యారు. హార్దిక్ పాండ్యా, ముకేశ్ కుమార్, శార్దూర్ ఠాకూర్‌కు చెరో వికెట్ దక్కింది. స్వల్ప లక్ష్య ఛేదనలో టీమిండియా కాస్త తడబడినా చివరికి సునాయాస విజయాన్ని దక్కించుకుంది. భారత ఓపెనర్ ఇషాన్ కిషన్ (46 బంతుల్లో 52 పరుగులు; 7 ఫోర్లు, ఓ సిక్స్) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 22.5 ఓవర్లలో 5 వికెట్లకు 118 పరుగులు చేసి, గెలిచింది టీమిండియా. వెస్టిండీస్ బౌలర్లలో గుడకేశ్ మోతీ రెండు, సీల్స్, కారియా చెరో వికెట్ దక్కించుకున్నారు. మ్యాచ్ ఎలా సాగిందంటే.. 

yearly horoscope entry point

టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ ఎంపిక చేసుకోవడంతో విండీస్ బ్యాటింగ్‍కు బరిలోకి దిగింది. వెస్టిండీస్ ఓపెనర్ కైల్ మేయర్స్‌(2)ను టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా మూడో ఓవర్లోనే ఔట్ చేశాడు. ఆ తర్వాత కాసేపు నిలకడగా ఆడిన బ్రెండన్ కింగ్ (17)ను శార్దూల్ ఠాకూర్, అలిక్ అథనాజే (22)ను డెబ్యూంట్ ముకేశ్ కుమార్ పెవిలియన్‍కు పంపారు.

అనంతరం, భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్‍దీప్ యాదవ్ రాకతో వెస్టిండీస్ మరింత వేగంగా పతనమైంది. షిమ్రన్ హిట్మైర్ (11)ను 16వ ఓవర్లో బౌల్డ్ చేసిన జడేజా.. రవ్‍మన్ పావెల్ (4), రొమారియో షెఫర్డ్ (0)ను 18వ ఓవర్లో పెవిలియన్‍కు పంపాడు. దీంతో 96 పరుగలకే వెస్టిండీస్ ఆరు వికెట్లను నష్టపోయింది. మరో ఎండ్‍లో వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ నిలకడగా ఆడాడు. అనంతరం భారత మణికట్టు స్పిన్నర్ కుల్‍దీప్ రెచ్చిపోయాడు. డొమెనిక్ డ్రేక్స్ (3), యానిక్ కారియా (3)తో పాటు హోప్‍ను కూడా ఎల్‍బీడబ్ల్యూ చేశాడు. అనంతరం జేడన్ సీల్స్‌(0)ను కూడా ఔట్ చేశాడు. దీంతో వెస్టిండీస్ 23 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది. వెస్టిండీస్ బ్యాటింగ్ లైనప్‍లో ఏడుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‍కే పరిమితమయ్యారు. షాయ్ హోప్, అథనాజే మినహా మరెవరూ ఇరవై పరుగుల మార్క్ దాటలేదు.

స్వల్ప లక్ష్యమే కావడంతో ఓపెనింగ్‍లో టీమిండియా ప్రయోగం చేసింది. రోహిత్ శర్మ రాకుండా ఓపెనింగ్‍కు శుభ్‍మన్ గిల్ (7), ఇషాన్ కిషన్ వచ్చారు. అయితే, గిల్ నాలుగో ఓవర్లోనే సీల్స్ బౌలింగ్‍లో ఔటయ్యాడు. అనంతరం ఇషాన్, సూర్య కుమార్ యాదవ్ (19) నిలకడగా ఆడారు. క్రమంగా పరుగులు రాబట్టారు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. అయితే ఈ క్రమంలో 11వ ఓవర్లో సూర్య.. ఎల్‍బీడబ్ల్యూ అయ్యాడు. కాసేపటికే హార్దిక్ పాండ్యా (5) రనౌట్ అవటంతో కాస్త టెన్షన్ ఏర్పడింది. అయితే, మరో ఎండ్‍లో ధీటుగా ఆడిన ఇషాన్ కిషన్ 44 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత ఎక్కువ సేపు నిలువలేకపోయాడు. మోతీ బౌలింగ్‍లో పోవెల్‍కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. శార్దూల్ ఠాకూర్‌ (1)ను బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపగా అతడు కూడా కారియా బౌలింగ్‍లో త్వరగానే ఔటయ్యాడు.

అయితే, రవీంద్ర జడేజా (16 నాటౌట్), కెప్టెన్ రోహిత్ శర్మ (12 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. జట్టును విజయ తీరాలకు చేర్చారు. భారత స్పిన్నర్ కుల్‍దీప్ యాదవ్‍కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Whats_app_banner