Ashwin Records: అశ్విన్ రికార్డుల పరంపర.. అయినా ఆస్ట్రేలియాదే పైచేయి-ashwin records in ahmedabad test with 6 wickets but australia is ahead in the test ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ashwin Records: అశ్విన్ రికార్డుల పరంపర.. అయినా ఆస్ట్రేలియాదే పైచేయి

Ashwin Records: అశ్విన్ రికార్డుల పరంపర.. అయినా ఆస్ట్రేలియాదే పైచేయి

Hari Prasad S HT Telugu
Mar 10, 2023 05:41 PM IST

Ashwin Records: అశ్విన్ రికార్డుల పరంపర కొనసాగుతోంది. అయినా అహ్మదాబాద్ టెస్టులో మాత్రం ఆస్ట్రేలియానే పైచేయి సాధించింది. నాలుగో టెస్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ టీమ్ మంచి పొజిషన్ లో ఉంది.

మరో కుంబ్లే రికార్డును బ్రేక్ చేసిన అశ్విన్
మరో కుంబ్లే రికార్డును బ్రేక్ చేసిన అశ్విన్ (BCCI)

Ashwin Records: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులోనూ టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రికార్డుల పరంపర కొనసాగింది. బ్యాటింగ్ కు అనుకూలిస్తున్న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ పై ఆస్ట్రేలియా బ్యాటర్లు చెలరేగగా.. అశ్విన్ ఒక్కడే ఆరు వికెట్లతో రాణించాడు. ఈ ఆరు వికెట్ల ఇన్నింగ్స్ తో అశ్విన్ కొన్ని రికార్డులను తన పేరిట రాసుకున్నాడు.

రెండో రోజు రెండో సెషన్ లో వరుసగా కామెరాన్ గ్రీన్, అలెక్స్ కేరీ, మిచెల్ స్టార్క్ ల వికెట్లు తీసిన అశ్విన్.. టీ తర్వాత టాడ్ మర్ఫీని ఔట్ చేయడం ద్వారా టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్ లో 32వసారి ఐదు వికెట్లు తీసిన ఘనతను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం నంబర్ వన్ ర్యాంక్ బౌలర్ గా ఉన్న అశ్విన్.. ఈ క్రమంలో లెజెండీ బౌలర్ అనిల కుంబ్లే రికార్డును బ్రేక్ చేశాడు.

స్వదేశంలో అత్యధికసార్లు ఐదు వికెట్లు తీసిన ఇండియన్ బౌలర్ గా కుంబ్లే (25) పేరిట ఉన్న రికార్డును చెరిపేశాడు. ఇండియాలో అశ్విన్ ఒక ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీయడం ఇది 26వసారి. కుంబ్లే ఇండియాలో 63 టెస్టుల్లో 25సార్లు ఒక ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీయగా.. అశ్విన్ మాత్రం 55వ టెస్టులోనే 26సార్లు ఆ ఘనత అందుకున్నాడు.

ఈ సిరీస్ తొలి టెస్టులోనూ అశ్విన్ ఒక ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసుకున్నాడు. ముత్తయ్య మురళీధరన్ (45) తర్వాత స్వదేశంలో అత్యధికసార్లు ఐదు వికెట్లు తీసుకున్న బౌలర్ గా కూడా అశ్విన్ నిలిచాడు. ఈ విషయంలో మరో లంక స్పిన్నర్ రంగన హెరాత్ (26)తో కలిసి రెండోస్థానంలో ఉన్నాడు. ఇక టెస్టు ర్యాంకింగ్స్ లో నంబర్ వన్ కోసం తీవ్రంగా పోటీ పడుతున్న ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ కూడా టెస్టుల్లో మొత్తం 32సార్లు ఐదు వికెట్లు తీసుకున్నాడు. అశ్విన్ ఇప్పుడతన్ని సమం చేశాడు.

అశ్విన్ ఆరు వికెట్లు తీయడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 480 పరుగులకు ఆలౌటైంది. ఖవాజా 180, గ్రీన్ 114 పరుగులు చేశారు. తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 36 రన్స్ చేసింది. రోహిత్ (17), గిల్ (18) క్రీజులో ఉన్నారు. ఇండియా ఇంకా 454 పరుగులు వెనుకబడి ఉంది.

పిచ్ ప్రస్తుతానికి బ్యాటింగ్ కు అనుకూలిస్తున్నా.. మూడో రోజు నుంచి మారే అవకాశం ఉండటంతో ఇండియన్ బ్యాటర్లు ఏం చేస్తారో చూడాలి. తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు చేయడం ద్వారా ఈ మ్యాచ్ లో ఓటమి అవకాశాల నుంచి దాదాపు ఆస్ట్రేలియా బయటపడినట్లే.

Whats_app_banner

సంబంధిత కథనం