Om shaped temple: “ఓం” ఆకారంలోని ఏకైక శివాలయం.. ఒకేసారి 12 జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం-worlds first om shaped temple has so many specialties ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Om Shaped Temple: “ఓం” ఆకారంలోని ఏకైక శివాలయం.. ఒకేసారి 12 జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం

Om shaped temple: “ఓం” ఆకారంలోని ఏకైక శివాలయం.. ఒకేసారి 12 జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం

Gunti Soundarya HT Telugu
Feb 20, 2024 12:38 PM IST

Om shaped temple: మహా శివరాత్రికి ఒకేసారి 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ ఓం ఆకారంలోని శివాలయానికి వెళ్ళండి. ప్రపంచంలోనే ఓం ఆకారంలో ఉన్న ఏకైక శివాలయం ఇది. ఎక్కడో కాదు భారత్ లోనే ఉంది.

ఓం ఆకారంలోని శివాలయం
ఓం ఆకారంలోని శివాలయం (x)

భారతదేశంలో ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఆశ్చర్యకలిగించేవి ఉంటే మరికొన్ని అంతుచిక్కని రహస్యాలు కలిగినవి ఉన్నాయి. అటువంటి ఆలయం ఇది. ఎన్నో ప్రత్యేకతలతో ఇటీవల అయోధ్య రామ మందిరం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు రాజస్థాన్ లో కూడా అటువంటి ఆలయం ఒకటి నిర్మితమైంది.

ఈ ఆలయం విశిష్టత ఏంటంటే ఇది ఓం ఆకారంలో ఉంటుంది. అయోధ్య మందిరం మాదిరిగానే నాగర నిర్మాణ శైలిలో దీన్ని నిర్మించారు. ప్రపంచంలోనే ఓం ఆకారంలో ఉన్న మొట్ట మొదటి శివాలయం. రాజస్థాన్ లోని పాలి జిల్లాలో జదమ్ గ్రామంలో ఈ ఆలయం ఉంది. పచ్చని ప్రకృతి అందాల నడుమ ఈ ప్రత్యేకమైన ఆలయాన్ని నిర్మించారు. ఇటీవలే ఈ ఆలయం ప్రారంభించి పూజ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

శివాలయం చరిత్ర

అత్యంత శక్తివంతమైన మంత్రాలలో ఓం అనేది ఒకటి. విశ్వంలో ఓంకారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కులమతాలకి అతీతంగా ప్రతీ ఒక్కరి నోటి నుంచి ఓంకారం వస్తుంది. ధ్యానం, ఆధ్యాత్మికత, శివుడికి చిహ్నంగా భావిస్తారు. అనేక మంత్రాలు కూడా ఓం తోనే ప్రారంభమవుతాయి. అటువంటి ఓం ప్రాముఖ్యతని దృష్టిలో ఉంచుకుని ఈ శివాలయాన్ని నిర్మించారు. సుమారు 270 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ ఆలయ నిర్మాణానికి 1995 లో శంకుస్థాపన జరిగింది. సుమారు 27 సంవత్సరాల పాటు నిర్మించిన ఈ ఆలయం ఇప్పుడు ప్రారంభించారు.

వెయ్యి విగ్రహాలు.. 12 జ్యోతిర్లింగాలు

ప్రముఖ శైవ క్షేత్రాలుగా పరిగణించే జ్యోతిర్లింగాలు పన్నెండు ఒక్కొక్కటి ఒక్కో ప్రదేశంలో ఉన్నాయి. కానీ వాటన్నింటినీ ఒకేసారి సందర్శించుకోవాలని అనుకుంటే మాత్రం ఈ ఆలయాన్ని వెళ్ళాల్సిందే. ఇక్కడ 1008 శివుడు విగ్రహాలు, 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఆలయం పై భాగంలో ధోల్ పూర్ నుంచి తెచ్చిన రాయితో చేసిన శివలింగం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

ఈ లయం నాలుగు విభాగాలుగా నిర్మించారు. ఒక భాగం మొత్తం భూగర్భంలో ఉంటుంది. మిగిలిన మూడు భాగాలు భూమి మీద ఉంటాయి. ఆలయం మధ్యలో స్వామి మాధవానంద సమాధి ఉంది. నేలమాళిగలో సమాధి చుట్టూ ఏడుగురు మహర్షుల విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆలయం ఆవరణలో 108 గదులు ఉన్నాయి. 2000 స్తంభాలు ఉన్నాయి. ఆలయ శిఖరం 135 అడుగులు. నాలుగు అంతస్తుల ఈ ఆలయంలో పాఠశాల, కాలేజీ కూడా ఉంది.

విశ్వదీప్ గురుకుల్ ట్రస్ట్ ఈ ఆలయాన్ని నిర్మించారు. విశేషమేమిటంటే ధోల్ పూర్ లోని బంషి పర్వత రాయిని ఆశ్రమ నిర్మాణం కోసం ఉపయోగించారు. ఆలయం అడుగు భాగాన రెండు లక్షల టన్నుల సామర్థ్యంతో వాటర్ ట్యాంక్ నిర్మించారు. ఈ ఆలయం గొప్ప ఆధ్యాత్మిక, మతపరమైన ప్రాముఖ్యతని కలిగి ఉంది. నాగర నిర్మాణ శైలిలోనే దీన్ని రూపొందించారు. 28 ఏళ్ల పాటు నిర్విరామంగా శ్రమించి ఆలయం పూర్తి చేశారు. భారతీయుల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ ఆలయాన్ని మహా శివరాత్రి నాడు దర్శించుకోండి. 12 జ్యోతిర్లింగాలు ఒకేసారి దర్శించుకున్న తృప్తి పొందుతారు.

WhatsApp channel