Maha shivaratri 2024: శివరాత్రికి సందర్శించుకోవాల్సిన పంచభూత శివలింగాలు.. ఇవి ఎక్కడ ఉన్నాయంటే?-maha shivaratri 2024 where is pancha bhoota shiva linga temples in india ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Maha Shivaratri 2024: శివరాత్రికి సందర్శించుకోవాల్సిన పంచభూత శివలింగాలు.. ఇవి ఎక్కడ ఉన్నాయంటే?

Maha shivaratri 2024: శివరాత్రికి సందర్శించుకోవాల్సిన పంచభూత శివలింగాలు.. ఇవి ఎక్కడ ఉన్నాయంటే?

Gunti Soundarya HT Telugu
Feb 03, 2024 07:00 AM IST

Maha shivaratri 2024: మహా శివరాత్రి సందర్భంగా ప్రముఖ శివక్షేత్రాలు దర్శించుకోవాలని అనుకుంటున్నారా? అయితే పంచభూత శివలింగాలు దర్శించుకోండి. వీటిలో ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ఉంటే మరో నాలుగు తమిళనాడుకి దగ్గరలో ఉన్నాయి.

వంచభూత శివలింగాలు ఎక్కడ ఉన్నాయి?
వంచభూత శివలింగాలు ఎక్కడ ఉన్నాయి? (pixabay)

Maha shivaratri 2024: సమస్త జీవకోటికి పంచభూతాలే ఆధారం. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా ఏ ప్రాణి జీవించలేదు. పృధ్వీ, జలం, తేజస్సు, వాయువు, ఆకాశం అనేవి పంచభూతాలు. ఈ ఐదింటి సృష్టికర్తని తానే అంటాడు పరమేశ్వరుడు. అందుకే పంచభూతాలు అంటే శివుడే అంటారు. పంచభూతాలకి ప్రతిరూపంగా పరమశివుడు కొలువైన ఉన్నవే పంచభూత క్షేత్రాలు.

శివుడు పంచభూతాల స్వరూపాలైన లింగ రూపాలతో ఐదు క్షేత్రాలు వెలిశాయి. ఈ మహా శివరాత్రి నాడు పంచభూత లింగాల క్షేత్రాలు దర్శించుకోవాలని అనుకుంటున్నారా? అయితే అవి ఎక్కడ ఉన్నాయో తెలుసా? వీటిలో నాలుగు ఆలయాలు తమిళనాడు రాష్ట్రంలో ఉంటే మరొకటి ఆంధ్రప్రదేశ్ లో ఉంది.

పృధ్వీ లింగం

తమిళనాడులోని కంచి ప్రదేశంలో శివుడి పృధ్వీ లింగం కొలువై ఉంది. ఏకాంబరేశ్వరుదు పృధ్వీలింగమై కొలువు దీరాడు. ఇక్కడ మామిడి చెట్టు కింద లింగం వెలిసిందని నమ్ముతారు. అందుకే శివుడికి ఏకాంబరేశ్వరుడు అని పేరు వచ్చింది. భారతదేశంలోని అతి పెద్ద గోపురాలలో ఇది ఒకటిగా నిలిచింది. ఏకాంబరేశ్వరుడు భూమిని సూచిస్తాడు. అందుకే పృధ్వీ లింగంగా పిలుస్తారు. కంచి ఏడు ముక్తి దాయక క్షేత్రాలలో ఒకటిగా నిలిచింది. ఇది మాత్రమే కాదు రామేశ్వరంలో ఉన్న సైకత లింగం కూడా పృధ్వీ లింగం కింద పిలుస్తారు.

జల లింగం

ఇది తమిళనాడులోని జంబుకేశ్వర క్షేత్రంలో ఉంది. ఇక్కడ జల లింగం ఎప్పుడు నీటిలోనే ఉంటుంది. శివుడు అభిషేక్ ప్రియుడు. కొద్ది నీళ్ళతో అభిషేకం చేసినా పులకించిపోతాడు. దక్ష హింస వల్ల కలిగిన పాపాన్ని తొలగించుకోవడానికి శివుడు జంబుకేశ్వరంలో తపస్సు చేశాడని స్థల పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్రమైన క్షేత్రం తమిళనాడులోని తిరుచానపల్లి దగ్గర ఉంది. ఇక్కడ పార్వతీ దేవి అఖిలాండేశ్వరిగా జన్మించింది. ఓ వైపు కావేరీ నది మరోవైపు కొలరున్ నదుల మధ్య ఏర్పడిన ద్వీపంలో ఈ పుణ్యక్షేత్రం ఉంది.

తేజో లింగం

తేజో లింగాన్ని అగ్ని లింగం అంటారు. అరుణాచలం పుణ్యక్షేత్రంలో ఉంది. ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వల్ల దీని చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు శివుని చుట్టూ తిరిగిన పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ క్షేత్రంలో రమణ మహర్షి నిష్టగా భక్తిశ్రద్ధలతో తపస్సు చేసి జ్ఞాన మార్గోపదేశం పొంది ప్రసిద్ధి చెందారు. ఇక్కడ పరమేశ్వరుడిని అన్నామలై అని పోలుస్తారు. కొండనే దేవుడిగా పూజిస్తారు. అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ. అంటే ఇక్కడ కొండ అగ్ని రంగుని సూచిస్తూ ఎర్రటి కొండ ఉంటుంది.

వాయు లింగం

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఈ మహా పుణ్యక్షేత్రం ఉంది. పంచభూతాల్లో ఒకటైన వాయు లింగం శ్రీకాళహస్తిలో వెలిసింది. దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రాముఖ్య శైవ క్షేత్రాలలో ఇదీ ఒకటి. తిరుపతికి 36 కిమీ దూరంలో ఉంది. శ్రీకాళహస్తిని దక్షిణ కైలాసం అంటారు. వాయు లింగం ఇక్కడ ప్రతిష్టితమైంది. సాలెపురుగు, పాము, ఏనుగు, వేటగాడు ఇక్కడ శివలింగాన్ని సేవించి ముక్తి పొందాయని శివ పురాణం చెబుతోంది. అందుకే శ్రీకాళహస్తిగా ఈ క్షేత్రం ప్రసిద్ది చెందింది.

ఆకాశ లింగం

పంచభూతాల్లో ఒకటైన ఆకాశ లింగం తమిళనాడులోని చిదంబరంలో ఉంది. ఇక్కడ లింగానికి ప్రత్యేకమైన విశేషం ఉంది. ఎందుకంటే ఇక్కడ లింగాకారము కనిపించదు. నిరాకార అంతరాలమే కనిపిస్తుంది. రూప రహిత లింగం. అందుకే ఆకాశ లింగంగా చెప్తారు. ఇక్కడ నటరాజ స్వామి ప్రతిమ కనిపిస్తుంది. పరమ శివుని ఆనంద తాండవ భంగిమ నటరాజ స్వామి రూపంలో కొలువై ఉన్నాడు. ఈ పంచభూత క్షేత్రాలు జగమంతా లయకారుడి స్వరూపమని చెబుతున్నాయి.

Whats_app_banner