కార్తీక పౌర్ణమి రోజు అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తే పుణ్యమంతా మీకే
కార్తీక పౌర్ణమి రోజున అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తే కోర్కెలు నెరవేరుతాయని పెద్దలు చెబుతారు.
దక్షిణభారతంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అరుణాచలం ఒకటి. దీనిన్ని తమిళనాడులో అన్నామలై అని పిలుస్తారు. ఇది ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఇక్కడ ఉన్న పెద్ద కొండని సాక్షాత్తూ శివలింగంగా భావిస్తారు భక్తులు. అందుకే ఆ కొండ చుట్టు ప్రదక్షిణ చేస్తారు. దీన్నే గిరి ప్రదక్షిణ అంటారు. ఆశ్వయుజ, కార్తీక మాసాల్లోని పౌర్ణమి రోజుల్లో ఈ గిరి ప్రదక్షిణ చేస్తే కోర్కెలు నెరవేరుతాయని అంటారు. ఆ రోజు చంద్రుడు పదహారు కళలతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ వెలుగులో గిరి ప్రదక్షిణ చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.
శివనామస్మమరణ చేస్తూ పున్నమి వెలుగులో గిరి ప్రదక్షిణ చాలా అద్భుత అనుభవాలను మిగుల్చుతుంది. గిరి ప్రదక్షిణ చేశాక కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన భక్తులు ఎంతో మంది ఉన్నారు. గిరి ప్రదరక్షిణ మొదలుపెట్టినప్పటి నుంచి దారిలో ఎన్నో ప్రదేశాలు చూసేందుకు ఉంటాయి.
ఈ గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్ల పాటు సాగుతుంది. చెప్పులు వేసుకోకుండానే నడవాలి. ప్రదక్షిణ చేస్తున్నప్పుడు వీలైతే కొంతమందికి అన్నదానం చేయడం చాలా మంచిది. సంతానం లేని వారు, వివాహం కానివారు గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మధ్యలో దుర్వాస మహర్షి దేవాలయం దగ్గర ఉన్న చెట్టుకు తాడు కడితే మంచిది.
ఓం అరుణాచలం శివ
గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ‘ఓం అరుణాచలం శివ’ అని స్మరిస్తూ వెళ్లాలి. గిరి ప్రదక్షిణలో భాగంగా దారిలో వచ్చే గణేశ ఆలయం, ద్రౌపది గుడి, రామలింగేశ్వర ఆలయం, హనుమాన్ గుడి, ప్రతిధ్వని మండపం, గౌతమాశ్రమం, వాయులింగం, అక్షర మండపం, మామిడి తోట, అరుణాచలేశ్వరాలయం వంటివి తప్పకుండా చూడాలి. దేవతలు కార్తీక మాసంలో గిరి ప్రదక్షిణకు వస్తారని అంటారు. కాబట్టి దారికి ఎడమ వైపుగా మానవులు నడవాలి. కుడివైపు దేవతలు నడుస్తూ ఉంటారు. కార్తీక పౌర్ణమి రోజు అరుణాచలేశ్వరుని ఆలయంలో వెలిగించే మహా దీపాన్ని దర్శించుకుంటే వారికి మరు జన్మ ఉండదని, మోక్షం సిద్ధిస్తుందని నమ్మకం.
కార్తీక పౌర్ణమి రోజు అరుణాచలేశ్వర ఆలయంలో దీపాన్ని దర్శించుకోని వారు ఇలా చేయాలి. ఇంట్లోని పూజాగదిని శుభ్రం చేసుకోవాలి. సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో నేతితో దీపాలు వెలిగించాలి. ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని అంటారు. ఇంటి ముందు ముగ్గులు కూడా వేయాలి. ఇలా చేస్తే ఆ ఇంటి యజమాని ఆయుష్షు పెరుగుతుంది.
చెన్నై నుంచి 185 కిలోమీటర్ల దూరంలో ఉంది అరుణాచలం. చెన్నై నుంచి బస్సులో నాలుగైదు గంటలు పట్టవచ్చు. చెన్నై నుంచి రైలు సౌకర్యం కూడా ఉంది.