కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణమి కలసిరావడం అదృష్టమా!
Kartika Pournami: కార్తీక పౌర్ణమి తేదీ నవంబరు 27, 2023 సోమవారం రానుంది. కార్తీక మాసంలో సోమవారం పౌర్ణమి తిథి రావడంపై పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించిన వివరాలు ఇవీ.
27 నవంబర్ 2023 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం కార్తీక మాసం సోమవారం విశేషించి కార్తీక మాస శుక్లపక్ష పౌర్ణమి తిథి మధ్యాహ్నం 2.46 గంటల వరకు చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఉన్నదని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
పౌర్ణమి రోజు చంద్రుడు కృత్తికా నక్షత్రానికి దగ్గరగా ఉండడం చేత ఈ మాసానికి కార్తీక పూర్ణిమ అని పేరు వచ్చిందని చిలకమర్తి తెలిపారు. కార్తీక పౌర్టమి కేదారేశ్వర వ్రతం వంటివి ఆచరించాలని, చంద్రునికి చాలా ప్రీతికరమైన రోజు కార్తీక పౌర్ణమి రోజు అని విశేషించి, ఈ సంవత్సరం కార్తీకపౌర్ణమి సోమవారం కలసిరావడం అత్యంత పుణ్యఫలమని చిలకమర్తి తెలిపారు.
పురాణాల ప్రకారం త్రిపురాసుర అనే రాక్షసుడి సంహారాన్ని కార్తీక పౌర్ణమి రోజు శివుడు చేశాడని ఈరోజు శివారాధన చేయడం వలన, జ్వాలాతోరణం వంటివి దర్శించుకోవడం వలన శివుని యొక్క అనుగ్రహంచేత శివసాన్నిధ్యం కలుగుతుందని చిలకమర్తి తెలిపారు.
కార్తీక పౌర్ణమి రోజు మహావిష్ణువు మత్స్యావతారం దాల్బెనని మత్స్యపురాణం చెప్పిందని చిలకమర్తి తెలిపారు. దత్తాత్రేయుని యొక్క జననం జరిగిన రోజు కార్తీక పౌర్ణమిగా, అలాగే కార్తీకేయుడు జననం జరిగిన రోజు కార్తీక పౌర్ణమిగా చెప్పబడ్డాయి.
ఇలా శివుడికి ప్రీతికరమైనటువంటి కార్తీక మాసంలో అలాగే శివప్రీతికరమైనటువంటి సోమవారం రోజు 27 నవంబర్ 2023న కార్తీక పౌర్టమి మరియు కార్తీక సోమవారం కలసిరావడం శివానుగ్రహం పొందడానికి పుణ్యార్చన కలగడానికి అత్యంత విశేషమైనటువంటి రోజుగా చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
కార్తీక పౌర్ణమిరోజు ఆచరించవలసిన విషయాలు
- ఈరోజు పుణ్యనదులు అయినటువంటి గంగ యమున కృష్ణా గోదావరి వంటి నదులలో కావచ్చు లేదా సముద్రము నందు కావచ్చు లేదా స్వగృహములోనైనా భక్తిశ్రద్ధలతో సంకల్ప సహితంగా కార్తీక స్నానాన్ని ఆచరించాలి.
- ఈరోజు శివాలయాల్లో లేదా గోశాల లేదా నదీపరివాహక ప్రాంతాలలో లేదా స్వగ్భృహమునందు శివారాధన, శివునికి అభిషేకం వంటివి ఆచరించాలి.
- కేదారేశ్వర వ్రతం వంటి వ్రతాలను కార్తీక పౌర్ణమిరోజు ఆచరించాలి.
- ఆలయాలలో లేదా స్వగృహమునందు తులసిచెట్టు వద్ద ఆవునేతితో కాని నువ్వుల నూనెతో కాని దీపాలను వెలిగించాలి.
- ఉపవాసము లేదా నక్తము ఆచరించుట మంచిది.
- జ్వాలాతోరణము వంటివి జరపడం దర్శించుకోవడం చాలా విశేషం.
ఈరకంగా కార్తీక పౌర్ణమిరోజు ఎవరైతే ఆచరిస్తారో అటువంటి వారికి శివానుగ్రహం వలన అభీష్టసిద్ధి కలుగుతుందని పుణ్యము, జ్ఞానము, వాటి ద్వారా మోక్షము కలుగుతాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.