Kartika Pournami 2023: కార్తీక పౌర్ణమి విశిష్టత తెలిస్తే మీరూ దీపం వెలిగిస్తారు-kartika pournami a time to light lamps and celebrate ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Kartika Pournami A Time To Light Lamps And Celebrate

Kartika Pournami 2023: కార్తీక పౌర్ణమి విశిష్టత తెలిస్తే మీరూ దీపం వెలిగిస్తారు

HT Telugu Desk HT Telugu
Nov 21, 2023 11:25 AM IST

Kartika Pournami 2023: కార్తీక పౌర్ణమి విశిష్టత, పురాణ ప్రాశస్త్యాన్ని పంచాంగకర్త, జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

కార్తీక పౌర్ణమి: కార్తీక పౌర్ణమి రోజు దీపారాధన ఎందుకు చేయాలి?
కార్తీక పౌర్ణమి: కార్తీక పౌర్ణమి రోజు దీపారాధన ఎందుకు చేయాలి? (pixabay)

కార్తీక మాసం అంతా స్నాన, దాన, జప, ఉపవాసాలు చేస్తే మంచిదని ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. అలా చేయడం కుదరని వారు ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి రోజుల్లో ఈ నాలుగింటిలో ఏదో ఒకదాన్ని ఆచరించినా సరిపోతుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

అందుకు కూడా శక్తిలేని వారు పౌర్ణమి నాడు శివాలయంలో దీపం వెలిగించినా పౌండరీక యజ్ఞం చేసినంత ఫలం లభిస్తుందని ప్రతీతి. అదే కార్తీక పౌర్ణమి ప్రాశస్త్యం. కార్తీక పౌర్ణమి నాడు వేకువజామునే లేచి శివనామస్మరణతో తలారా స్నానం చేసి భక్తిశ్రద్ధలతో దీపారాధన చేసి వాటిని అరటి దొప్పల్లో పెట్టి చెరువులు, నదుల్లో వదులుతుంటారు.

మహిళలు, పెళ్ళికాని అమ్మాయిలు కార్తీక దీపాలను నదుల్లో వదిలి రాత్రికి తులసికోటలో ఉసిరికొమ్మ (కాయలతో) పెట్టి తులసి పక్మన రాధాకృష్ణుల విగ్రహాన్ని ఉంచి పూజిస్తే కోరుకున్న వ్యక్తి భర్తగా వస్తాడని విశ్వసిస్తారని చిలకమర్తి తెలిపారు.

ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున ముత్తైదువలు రెండు రకాల నోములు నోచుకుంటారు. ఒకటి కార్తీక చలిమిళ్ళ నోము. ఈ నోము కోసం కార్తీక పౌర్ణమినాడు చలిమిడి చేసి మొదటి సంవత్సరం ఐదుగురు ముత్తైదువులకు, ఆపై సంవత్సరం పదిమందికి, మూడో ఏడాది పదిహేనుమందికి చొప్పున వాయనాలు ఇస్తారు.

రెండోది కార్తీక దీపాల నోము. ఆరోజు రాత్రికి శివాలయంలో 120 దీపాలను వెలిగిస్తారు. తరువాతి సంవత్సరం 240 దీపాలు, అపై సంవత్సరం 360 దీపాలు శివాలయంలో వెలిగిస్తారు. ఈ నోములు నోచుకుంటే శివసాన్నిద్ధ్యం లభిస్తుందని పురాణ కథనం.

ఇంకా... కార్తీక పౌర్ణమి నాడు నమకచమక మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే శివుడు ప్రసన్నుడౌతాడని పురాణాలు చెబుతున్నాయి. అరోజున ఉసిరికాయ దానం చేస్తే దారిద్య్రం తొలగిపోతుందట. లలితా సహస్రనామం భక్తిగా పఠిస్తే ఆ దేవి సకల ఐశ్వర్యాలను అందిస్తుందని ప్రముఖ అధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

దీపం అంటే అగ్ని జ్ఞానానికీ, ఆనందానికీ, సిరిసంపదలకూ ప్రతీక. దీపకాంతిలో ఉండే ఎరుపు, పసుపు, నీలి కాంతులు ముగురమ్మలకూ సంకేతం అని నమ్మిక. దీపారాధన వల్ల శివుని అనుగ్రహం కలుగుతుందని పురాణ ప్రతీతి. దీపాన్ని వెలిగించేవారికి సహాయకులుగా ఉన్నా కొడిగట్టబోతున్న దీపానికి నూనె పోసినా కూడా ఆ పుణ్యఫలం దక్కుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే ఈ రోజున కంచుపాత్రలో ఆవునెయ్యి పోసి దీపం వెలిగిస్తే పూర్వజన్మలో చేసిన పాపాలు నశిస్తాయని కార్తీక పురాణం చెబుతోందని చిలకమర్తి తెలియజేశారు.

కార్తీక పౌర్ణమి పురాణ కథ

కార్తీక పౌర్ణమినే త్రిపురి పూర్ణిమ అనీ దేవదీపావళి అని కూడా వ్యవహరిస్తారు. పూర్వం త్రిపురాసురుడనే రాక్షసుడు అంతరిక్షంలో మూడు పురాలను నిర్మించుకొని సర్వసుఖాలు అనుభవించేవాడట. బలగర్వంతో దేవతలనందరినీ హింసించే వాడట. అప్పుడు శివుడు త్రిపురాసురునితో మూడు రోజుల పాటు యుద్ధం చేసి అతణ్ణి సంహరించాడట. అసుర వధ జరిగిన అనందంలో దేవతలంతా దీపాలు వెలిగించి పండుగ జరుపుకున్నారట. అందుకే దీన్ని “'దేవదీపావళి” అని కూడా అంటారు.

ఇంకా విష్ణుమూర్తి మత్స్యావతారంలో పుట్టినదీ ఈరోజే. బృందా దేవి తులసిమొక్కగా అవతరించిందీ, కార్తికేయుడు పుట్టిందీ, దత్తాత్రేయుడి జన్మదినమూ, రాధాకృష్ణులకెంతో ఇష్టమైనది... ఈరోజే.

అలనాడు ద్వాపరయుగంలో రాసలీలా మహోత్సవంలో గోపికాలను ఆ నల్లనయ్య అనుగ్రహించినదీ ఈరోజేనని నమ్మిక. క్షీరసాగరమధనంలో వెలువడిన హాలాహలాన్ని తన గళాన దాచుకున్న శివుడి చుట్టూ పార్వతీదేవి ప్రదక్షిణ చేసిన ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజున శివాలయాల్లో ఒక ఉత్సవాన్ని నిర్వహిస్తారు.

ఎండుగడ్డిని తాడుగా పేని తోరణంగా కట్టి దానిని వెలిగించి భగభగమండే అ తోరణం చుట్టూ పార్వతీదేవి విగ్రహాన్ని ముమ్మారు తిప్పుతారు. దీనికే “'జ్వాలాతోరణోత్సవం” అని పేరు.

ఇలా ఎన్నో రకాలుగా పౌరాణిక ప్రాశస్త్యం ఉంది కాబట్టే కార్తీక పౌర్ణమి నాడు శివాలయాల్లో రాత్రంతా దీపాలు వెలిగిస్తారు. వాటినే దీపమాలలుగా పిలుస్తారు. గుడి ప్రాంగణాల్లో మెట్లన్నీ దీపాల అమరికతో శోభాయమానంగా కనిపిస్తాయి.

ఇక... ఇలపై శివుని ఆవాసంగా భావించే మహాపుణ్యక్షేత్రం వారణాసిలో గంగా నదీ తీరంలోని ఘాట్‌లన్నీ కార్తీక పున్నమి నాడు దీపకాంతులతో ప్రకాశిస్తాయి. ఇవి ఆ రాత్రంతా వెలుగుతూనే ఉంటాయి. ఆ రోజు గంగానదిలో స్నానం చేస్తే ముక్తిని పొందుతారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

WhatsApp channel