Ayyappa mala: అయ్యప్ప దీక్ష చేపట్టే వాళ్ళు మెడలో ఎలాంటి మాల ధరించాలి? వాటి విశిష్టత ఏంటి?
Ayyappa mala: మరికొద్ది రోజుల్లో కార్తీకమాసం ప్రారంభం కాబోతుంది. ఈ మాసంలో అయ్యప్ప దీక్షలు చేపడతారు. ఈ సమయంలో స్వాములు మెడలో ఎలాంటి మాల ధరిస్తారు? మాల విశిష్టత ఏంటి? మాల ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
కార్తీకమాసం ప్రారంభం కాగానే చాలా మంది అయ్యప్ప దీక్షలు చేపడతారు. 41 రోజుల పాటు కఠినమైన నియమాలు అనుసరిస్తూ దీక్ష చేస్తారు. అనంతరం శబరిమల వెళ్ళి అయ్యప్పను దర్శించుకుని మాల విరమిస్తారు.
అయ్యప్ప స్వాములు అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది నల్లని వస్త్ర ధారణ, మెడలో మాల. అయ్యప్ప మాల వెనుక ప్రతి ఒక్కదానికి ప్రత్యేక విశిష్టత ఉంటుంది. నలుపు రంగు దుస్తుల దగ్గర నుంచి మెడలో వాళ్ళు ధరించే మాల వరకు అన్నింటికీ ప్రాధాన్యత ఉంటుంది. నలుపు రంగు దుస్తులు ధరించడం వెనుక ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. ఇది శరీరానికి వేడిని ఇస్తుంది. అలాగే శనీశ్వరుడికి ఇష్టమైన రంగు నలుపు. అందుకే ఈ రంగు దుస్తులు ధరించిన వారి మీద శని ప్రభావం ఉండదు.
మాల విశిష్టత
ఇక అయ్యప్ప స్వాములు మెడలో ఎలాంటి మాల ధరిస్తారని తెలుసు కానీ దాని వల్ల కలిగే ప్రయోజనాలు చాలా తక్కువ మందికే తెలుసు. పూజలు, జపం చేసుకునేటప్పుడు చేతిలో రుద్రాక్ష, తులసి మాల వంటివి పట్టుకుంటారు. అలాగే వీటిని కొందరు మెడలో కూడా ధరిస్తారు. అయ్యప్ప దీక్ష ధరించే వాళ్ళు కంఠాభరణాలుగా రుద్రాక్ష, తులసి, చందనం, స్పటికం, పగదాలు, తామర పూసల మాలలు శ్రేష్టమైనవిగా భావిస్తారు. ఇవి ధరించడం వల్ల శారీరకంగా, మానసికంగా మనిషిని ఆధ్యాత్మికత వైపు నడిపిస్తాయి. అందుకే వీటిని అత్యంత పవిత్రమైనగా భావిస్తారు. మాల ధరించే ముందు వాటిని గుడిలో అభిషేకం చేయిస్తారు. అనంతరం మంత్రోచ్చారణ చేసి అయ్యప్ప స్వామిని ఆవహింప చేస్తారు. తర్వాత స్వామి మెడలో దాన్ని వేస్తారు.
మాల వేసిన దగ్గర నుంచి దీక్ష విరమించే వరకు దాన్ని తొలగించరాదు. స్నానం చేసేటప్పుడు మాల తీసి కింద పెట్టడం వంటి పనులు చేయకూడదు. నిద్రించే సమయంలో మాల నేల తాకరాదు. అయ్యప్ప స్వాములు రుద్రాక్ష మాల ధరించడం చాలా శ్రేష్టమైనది. పీడకలలు, భూత ప్రేత పిశాచాల బాధ తొలగిపోతుంది. రుద్రాక్ష శివుడి కన్నీటి నుంచి ఉద్భవించిందని నమ్ముతారు. అందుకే ఇది ధరించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ మాల వేసుకుంటే కోపం అదుపులో ఉంటుంది. ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
రుద్రాక్ష కాకుండా మరికొందరు తులసి మాల కూడా ధరిస్తారు. ఇది విష్ణుమూర్తికి ప్రీతికరమైనది. ఇది ధరిస్తే శరీరంలోని వేడి తగ్గుతుంది. చందనం మాల శరీరానికి చలువ చేస్తుంది. పగడం మాల ధరిస్తే శరీరంలోని అన్ని అవయవాలకు రక్తప్రసరణ బాగా జరిగేలా చూస్తుంది. ఇలా ఒక్కొక్క మాలకు ఒక్కో విశిష్టత, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ఒక వ్యక్తి జీవితాన్ని పూర్తిగా మార్చేసే దీక్ష అయ్యప్ప దీక్ష. అప్పటి వరకు ఉన్న ఆహార అలవాట్లు, శారీరక సౌకర్యాలు, జీవనశైలి మొత్తం పూర్తిగా మారిపోతాయి. ఒక మనిషిగా కాకుండా దేవుడి భక్తుడిగా దైవానికి ప్రతిరూపంగా మారిపోతాడు. అందుకే అయ్యప్ప దీక్ష చేపట్టిన వారిని స్వామి అని పిలుస్తారు.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.