Ravana dahan: ఇక్కడ రావణ దహనం చేయరు- అలా చేస్తే శివుడి ఆగ్రహానికి గురవుతారట-in this places ravana dahan not doing in dasara time ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Ravana Dahan: ఇక్కడ రావణ దహనం చేయరు- అలా చేస్తే శివుడి ఆగ్రహానికి గురవుతారట

Ravana dahan: ఇక్కడ రావణ దహనం చేయరు- అలా చేస్తే శివుడి ఆగ్రహానికి గురవుతారట

Gunti Soundarya HT Telugu
Oct 11, 2024 10:31 AM IST

Ravana dahan: దసరా వేళ దేశవ్యాప్తంగా రావణ దహనం వేడుకలు జరుగుతాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం అలా చేయరు. ఎందుకంటే ఇక్కడ రావణుడిని పూజిస్తారు. రావణ దిష్టిబొమ్మను దహనం చేస్తే పరమేశ్వరుడి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని ప్రజలు విశ్వసిస్తారు.

ఇక్కడ రావణ దహనం చేయరు
ఇక్కడ రావణ దహనం చేయరు

భారతీయులు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి దసరా. పది రోజుల పాటు దుర్గాదేవికి పూజలు చేసి చివరి రోజు రావణ దహన వేడుక నిర్వహిస్తారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఇలా రావణ దహనం నిర్వహిస్తారు.

పరమేశ్వరుడికి ఆగ్రహం వస్తుందట

దేశంలోని పలు ప్రాంతాల్లో రావణ దహన వేడుకను ఘనంగా నిర్వహిస్తారు. ఎత్తైన బొమ్మలు తయారు చేసి సాయంత్రం వేళ రామ్ లీలా నాటకం ప్రదర్శిస్తారు. అనంతరం రావణ దహనం చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం రావణ దహనం పొరపాటున కూడా చేయరు. అలా చేస్తే పరమేశ్వరుడికి కోపం వస్తుందని ఇక్కడి ప్రజల నమ్మకం. అది ఎక్కడో కాదు హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లాలోని బైజ్ నాథ్ పట్టణ ప్రజలు రావణుడి దిష్టిబొమ్మలను దహనం చేయరు.

బైజ్ నాథ్ లోని ఆలయం శివుడికి అంకితం చేసిన ఒక మతపరమైన ప్రదేశం. రావణుడు శివుడికి పరమ భక్తుడు. శివుని అనుగ్రహం కోసం తపస్సు చేసి అనుగ్రహం పొందాడు. అటువంటి రావణుడి దిష్టిబొమ్మను దహనం చేస్తే శివునికి కోపం వస్తుందని నమ్మకం. దసరా పండుగ జరుపుకుంటే శివుడికి ఆగ్రహం వస్తుందని నమ్ముతారు. రావణుడి మాత్రమే కాదు అతని సోదరుడు కుంభ కర్ణుడు, కుమారుడు మేఘనాథుడు దిష్టి బొమ్మలు కూడా దహనం చేయరు. అలా చేయడం వల్ల వారికి కొన్ని నమ్మకాలు కూడా ఉన్నాయి.

కొన్ని సంవత్సరాల క్రితం అక్కడ దసరా పండుగ జరుపుకోవడానికి ప్రయత్నించారట. మరుసటి దసరా సమయానికి మరణించారు. ఇక అప్పటి నుంచి అక్కడి ప్రజలు ఎవరూ ఈ పండుగను జరుపుకోలేదు. బైజ్ నాథ్ ఒక చిన్న పట్టణం. శివుడికి చెందిన ప్రసిద్ధ ఆలయం ఇక్కడ ఉంది. ఈ ఆలయంలోని శివుడిని పూజయించేందుకు దేశం నలుమూలల నుంచి ప్రజలు వస్తారు. ఈ ఆలయమ 13వ శతాబ్ధంలో నిర్మించారని నమ్ముతారు. కట్యూరి రాజవంశం పాలకులు దీన్ని నిర్మించారని చెబుతారు. కాంగ్రా లోయలోని అత్యంత ముఖ్యమైన ఆలయాలలో ఇదీ ఒకటి. అయితే ఇదే రాష్ట్రంలోకి కులు ప్రాంతంలో దసరా వేడుకలు అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఇక్కడ వేడుకలు చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో సందర్శకులు వస్తారు.

ఇక్కడ కూడ రావణ దహనం ఉండదు

దేశమంతా రావణుడు రాక్షసుడు అంటే మరికొన్ని ప్రాంతాల వాళ్ళు మాత్రం దేవుడిగా కొలుస్తారు. మధ్యప్రదేశ్ లోని మందసౌర్, ఉత్తరప్రదేశ్ లోని బిస్రాఖ్ ప్రజలు కూడా రావణ దహనం నిర్వహించరు. మందసౌర్ ప్రదేశం రావణుడి భార్య మండోదరి పుట్టినిల్లు. అంటే ఇక్కడి వారికి రావణుడి అల్లుడు. అందుకే ఇక్కడ రావణుడిని చాలా గౌరవిస్తారు. అది మాత్రమే కాదు ఇక్కడ రావణుడి ఎత్తైన విగ్రహానికి పూజలు కూడా చేస్తారు.

ఇక రావణుడు లంకలో కాదని బిస్రాఖ్ లో పుట్టాడని ఇక్కడి ప్రజల నమ్మకం. అందుకే ఇక్కడ కూడా రావణుడిని కుమారుడిగా భావించి గ్రామస్తులు దసరా వేడుకలు నిర్వహించుకోరు. ఇది వారికి సంతాపదినంగా ఉంటుంది.

Whats_app_banner