Dasara 2024: విజయ దశమిని మనదేశంలో అత్యంత వైభవంగా జరిపే నగరాలివే, ఈ వేడుకలు చూసి తీరాల్సిందే-vijaya dashami is celebrated in the most magnificent cities in india ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Dasara 2024: విజయ దశమిని మనదేశంలో అత్యంత వైభవంగా జరిపే నగరాలివే, ఈ వేడుకలు చూసి తీరాల్సిందే

Dasara 2024: విజయ దశమిని మనదేశంలో అత్యంత వైభవంగా జరిపే నగరాలివే, ఈ వేడుకలు చూసి తీరాల్సిందే

Gunti Soundarya HT Telugu
Oct 10, 2024 02:23 PM IST

Dasara 2024: మరో రెండు రోజుల్లో దసరా పండుగ రాబోతుంది. వేడుకల కోసం దేశం మొత్తం ముస్తాబైంది. దసరా రోజు అనేక ప్రాంతాల్లో రావణ దహనం వేడుక నిర్వహిస్తారు. అయితే మన దేశంలో విజయ దశమి వేడుకలు చూడాలంటే ఈ ప్రాంతాలకు వెళ్ళాల్సిందే.

దసరా వేడుకలు
దసరా వేడుకలు (PTI)

భారతీయులు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి దసరా. దేశవ్యాప్తంగా దసరా సంబరాలు జరుగుతాయి. ఈ పండుగ పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చేది కోల్ కతా, పశ్చిమ బెంగాల్, మైసూర్, ఢిల్లీ వేడుకలు. దసరా పండుగ రారాజు అంటే మైసూర్ అనే చెప్పుకోవాలి.

మైసూర్

ఇక్కడ జరిగే దసరా వేడుకలు చూసేందుకు అనేక ప్రాంతాల నుంచి పర్యాటకులు, ఔత్సాహికులు వస్తారు. మైసూర్ దసరా వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది గజరాజులతో పాటు మైసూర్ ప్యాలెస్ ఒకటి. పది రోజుల పాటు సాగే ఈ ఉత్సవాల సందర్భంగా ప్యాలెస్ ని రంగు రంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరిస్తారు. నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజు జరిగే జంబో సవారి భారీ ఊరేగింపు జరుగుతుంది. సాంస్కృతిక ప్రదర్శనలు, సంప్రదాయ సంగీతం, జానపద నృత్యాలతో సాగే ఈ ఊరేగింపు చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు. దసరా సమయంలో తప్పక సందర్శించాల్సిన ప్రదేశాలలో మైసూర్ మొదటి స్థానంలో ఉంటుంది.

కులు

హిమాచల్ ప్రదేశ్ లో ప్రకృతి అందాలతో నిండిపోయే ప్రదేశం కులు. ఇక్కడ జరిగే దసరా వేడుకలు వేరే లెవల్ లో ఉంటాయి. దేశమంతా పది రోజుల పాటు దసరా ఉత్సవాలు జరుపుకుంటారు. అయితే ఇక్కడ మాత్రమే మాత్రం దసరా పదవ రోజు నుంచి ఒక వారం పాటు జరుపుకుంటారు. దసరా వేడుకలు అత్యంత వైభవంగా జరిగే ప్రదేశం ఇది. దసరా రోజు రావణ దహనం చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం దేవతలను వారం రోజుల పాటు ఊరేగిస్తారు. ఆటపాటలతో సంబరాలు మారుమోగిపోతాయి. ఈ వేడుకలు తిలకించేందుకు చుట్టుపక్కల నుంచి ఎంతో మంది తరలివస్తారు.

బస్తర్

ఛత్తీస్ ఘడ్ లోని గిరిజన ప్రదేశమైన బస్తర్ లో దసరా వేడుకలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. దేశమంతా పది రోజులు వేడుకలు జరుపుకుంటే ఇక్కడ మాత్రం 45 రోజుల పాటు వేడుకలు జరుగుతాయి. అయితే ఇక్కడ రావణాసురిడిని శ్రీరాముడు ఓడించిన సందర్భంగా ఈ వేడుకలు జరుపుకోరు. ధంతేశ్వరి అమ్మవారికి అంకితం చేస్తూ ఇక్కడ పండుగ జరుపుకుంటారు. ఇందులో అనేక గిరిజన తెగలు పాల్గొని సంప్రదాయ నృత్యాలలో పాల్గొంటారు. ఇక్కడ జరిగే రథయాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

ఢిల్లీ

దసరా వేడుకలు అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఢిల్లీ రామ్ లీలా మైదానం. ఎర్రకోటలో జరిగే రామ్ లీలా నాటక ప్రదర్శనలు. పది రోజుల పాటు ఈ నాటకాలను ప్రదర్శిస్తారు. చివరి రోజు రావణ దహనం నిర్వహిస్తారు. ఈ ప్రదర్శన తిలకించేందుకు ప్రముఖులతో సహా స్థానికులు ఉంటారు. దసరా వేడుకలో పెద్ద సంఖ్యలో ఇక్కడ ప్రజలు పాల్గొంటారు.

వారణాసి

అత్యంత పవిత్రమైన, ఆధ్యాత్మిక ప్రదేశాలలో ఒకటి వారణాసి. ఇక్కడ కాశీ విశ్వనాథ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. సుమారు రెండు వందలకు పైగా సంవత్సరాల పాటు ఇక్కడ దసరా వేడుకల్లో భాగంగా రామ్ లీలా ప్రదర్శనలు జరుగుతున్నాయి. రాముడి జననంతో మొదలై రాక్షస రాజు రావణుడి మరణంతో ముగుస్తుంది.

కోట

దసరా సంప్రదాయ జాతర కోటాలో చాలా అందంగా ఉంటాయి. హస్త కళాకారులు, సాంస్కృతిక కళాకారులతో ప్రత్యేక ఫెయిర్ నిర్వహిస్తారు. నగరం చుట్టుపక్కల నుంచి గ్రామస్తులు సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొంటారు. రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయడంతో వేడుక ముగుస్తుంది. దీంతో పాటు చంబల్ నదిపై జరిగే అడ్వెంచర్ ఫెస్టివల్ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ.

Whats_app_banner