Ravana: రావణుడు లంకలో కాదు భారత్ లోనే పుట్టాడట.. అందుకే అక్కడ దసరా జరుపుకోరు
Ravana: రావణుడు లంకలో జన్మించాడని అందరూ నమ్ముతారు. కానీ నోయిడాలోని ఓ గ్రామ ప్రజలు మాత్రం రావణుడు తమ ఊరిలోనే జన్మించాడని చెబుతారు. అంతే కాదు ఇక్కడ రావణుడిని పూజిస్తారు.
Ravana: పది తలల రావణాసురుడు అని చెప్పగానే అందరూ రాక్షసుడిగా భావిస్తారు. లంకకు అధిపతిగా చెబుతారు. కొందరు రావణుడిని దేవుడిగా పూజిస్తారు. మరి కొందరు రాక్షస రాజు అని ద్వేషిస్తారు. అందుకే ఏటా దసరా సమయంలో రావణుడి బొమ్మను తయారు చేసి దహనం చేస్తారు.
సాధారణంగా రావణుడు లంకలో జన్మించాడని చెబుతారు. కానీ కొందరు మాత్రం రావణుడు లంకలో కాకుండా భారత్ లోనే పుట్టాడని చెబుతారు. రామాయణం ప్రకారం రావణుడు తండ్రి విశ్రవుడు గొప్ప రుషి. అతని తల్లికి కైకేసి రాక్షస యువరాణి. లంకలో రావణుడి జననం గురించి అనేక గ్రంథాలలో పేర్కొన్నారు. అయితే దీనికి విరుద్ధంగా కొందరు మాత్రం గ్రేటర్ నోయిడా లోని బిశ్రఖ్ అనే గ్రామ ప్రజలు రావణుడు ఎక్కడ జన్మించాడనే చెబుతారు.
బిశ్రఖ్ అనే పేరు రావణుడి తండ్రి విశ్రవుడి పేరు నుంచి వచ్చిందని నమ్ముతారు. గ్రామస్తులు చెప్పేదాన్ని ప్రకారం విశ్రవుడికి ఈ ప్రాంతంలో ఒక ఆశ్రమం ఉంది. అక్కడే రావణాసురుడు జన్మించాడు. అతని ప్రారంభ జీవితం ఇక్కడే గడిచిందని అంటారు. వాస్తవానికి ప్రజలు రావణుడిని రాక్షసుడిగా కాకుండా గొప్ప పండితుడిగా, శివ భక్తుడిగా, బిశ్రఖ్ ప్రాంతం కుమారుడిగా గౌరవిస్తారు. చెడుపై సాధించిన విజయానికి ప్రత్యేకగా రావణుడి దిష్టిబొమ్మలను దహనం చేసే దసరా పండుగ ఇక్కడ విభిన్నంగా జరుపుకుంటారు.
దసరా రోజు పది తలల రావణాసురుడి ప్రతిమను తయారు చేసి దహనం చేస్తారు. కానీ బిశ్రఖ్ ప్రజలు మాత్రం రావణుడి జ్ఞానం, భక్తిని గుర్తుంచుకుంటారు. ఇక్కడ జాతరలాగా జరుపుకుంటారు. రావణుడి గురించి ఇలా నమ్మడం వెనుక ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది.
దీని వెనుక ఉన్న స్థల పురాణం
రావణుడి జన్మస్థలం బిశ్రఖ్ అని చెప్పడం వెనక పురాతన సంప్రదాయాలు, తరతరాలుగా వస్తున్న జానపద కథలు ఉన్నాయి. ఈ కథనాల ప్రకారం విశ్రవ రుషి తన ఆశ్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. రావణుడు బ్రాహ్మణుడు రాక్షస పుత్రుడు. ఆధ్యాత్మికతతో పాటు రాక్షస గుణాలతో ఇక్కడే జన్మించారు. ఈ గ్రామంలోనే రావణుడు అతని తండ్రి శివుడిని పూజించి శివలింగాన్ని కూడా ప్రతిష్టించాడని చెబుతారు. ఈ ఆలయంలో వాళ్ళు పూజలు కూడా చేశారని అంటారు. అందువల్ల రావణుడిని చెడుకు చిహ్నంగా చూసే దేశంలో బిశ్రఖ్ ప్రజలు మాత్రం అతన్ని తమ కొడుకుగా చూస్తారు. గొప్ప జ్ఞానం ఉన్న వ్యక్తిగా రాజుగా భావిస్తారు.
దసరా పండుగ సమయంలో బిశ్రఖ్ ప్రజలు రావణాసురుడి దిష్టిబొమ్మల దహనం చేయడం చేయరు. దిష్టిబొమ్మ దహనానికి బదులుగా ఒక యజ్ఞం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. దేశం మొత్తం రావణుడి ప్రతిమను దహనం చేస్తే బిశ్రఖ్ లో కూడా అలా చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఒకసారి ఇక్కడ రామ్ లీలాకు ఆతిథ్యం ఇవ్వడానికి రావణుడి దిష్టిబొమ్మల దహనం చేయడానికి ప్రయత్నించినప్పుడు భయంకరమైన పరిణామాలు ఎదుర్కొన్నారట. దానివల్ల మరణం కూడా సంభవించిందని అనేక మీడియా నివేదికలు చెబుతున్నాయి. అందువల్ల ఇక్కడ రావణుడి దిష్టిబొమ్మ దహన కార్యక్రమం నిర్వహించరు.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం వివిధ సామాజిక మాధ్యమాల నుంచి తీసుకున్నది. దీనికి HT Telugu ఎటువంటి బాధ్యత వహించదు.