Ramadan 2024: ఈ ఏడాది రంజాన్ ఎప్పుడు వచ్చింది? రంజాన్ తేదీ ప్రతి ఏటా ఎందుకు మారుతుంది?
Ramadan 2024: రంజాన్ పండుగ తేదీ ఏటా మారుతూ వస్తుంది. అందుకు కారణం చంద్రవంక దర్శనమే. దీని ప్రకారమే రంజాన్ ఉపవాస దీక్షలు చేయడం, పండుగ జరుపుకోవడం చేస్తారు. ఈ ఏడాది రంజాన్ పండుగ ఎప్పుడు జరుపుకొనున్నారంటే..
Ramadan 2024: రంజాన్ ఉపవాస దీక్షలు ముగియబోతున్నాయి. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం రంజాన్ మాసం ముగిసిన తర్వాత షెహ్వాల్ మాసం ప్రారంభం అవుతుంది. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం రంజాన్ తొమ్మిదో నెల.
ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు జరుపుకునే ప్రధాన పండుగ ఈద్ ఉల్ ఫితర్. నెల రోజుల పాటు సాగిన ఉపవాస దీక్షలు ముగించి రంజాన్ పండుగ జరుపుకోవడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. రంజాన్ అనేది అరబిక్ పదం నుంచి వచ్చింది. ఇస్లాంలోనే ఐదు ముఖ్యమైన భాగాలు ఉన్నాయి. వాటిలో రంజాన్ ఒకటి. షహదా అంటే దేవుడిని నమ్మటం, సలాత్ అంటే ప్రార్థించడం, జకాత్ దానం ఇవ్వడం, సామ్ రంజాన్ సమయంలో ఉపవాసం పాటించడం, హజ్ మక్కాకు తీర్థయాత్రకు వెళ్ళడం అనేవి ఐదు ముఖ్యమైన భాగాలుగా పరిగణిస్తారు.
రంజాన్ ముగింపులో ఖద్ర్ అని పిలిచే ఒక ప్రత్యేకమైన రాత్రి జరుపుకుంటారు. ఇది సంవత్సరంలో అత్యంత పవిత్రమైన రాత్రిగా పరిగణిస్తారు. ఆయురారోగ్యాలు, దీవెనలు కలగాలని కోరుకుంటూ మనస్పూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తారు. ఈ ఏడాది రంజాన్ పండుగ బుధవారం, ఏప్రిల్ 10వ తేదీ జరుపుకొనున్నట్టు సౌదీ మత పెద్దలు ఇప్పటికే ప్రకటించారు. భారతదేశంలో ఏప్రిల్ 9, మంగళవారం నెలవంక కనిపిస్తే 10వ తేదీ పండుగ చేసుకుంటారు. ఒకవేళ బుధవారం నెలవంక కనిపిస్తే గురువారం, ఏప్రిల్ 11వ తేదీ రంజాన్ జరుపుకుంటారు. ముస్లిం సోదరులు అందరూ నమాజ్ చేసుకుని ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ ఈద్ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. నమాజ్ చేసిన తర్వాత ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఆలింగనం చేసుకోవడాన్ని అలయ్ బలయ్ అంటారు.
రంజాన్ తేదీ ఎందుకు మారుతుంది?
ఏటా రంజాన్ మాసం తేదీ మారుతూ ఉంటుంది. రెగ్యులర్ క్యాలెండర్ ప్రకారం వేరు వేరు తేదీల్లో రంజాన్ జరుపుకుంటారు. ముస్లింలు చాంద్రమాన ఇస్లామిక్ క్యాలెండర్ ను అనుసరించి పండుగలు జరుపుకుంటారు. వారికి చంద్రవంకను చూసినప్పుడు నెల ప్రారంభమవుతుంది. భారతదేశంలో మార్చి 12 నుంచి రంజాన్ మాసం ఉపవాస దీక్షలు చేపట్టారు.
లూనార్ ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం ముస్లింలు ఈ పండుగను జరుపుకుంటారు. అందుకే నెలవంక కనిపించే సమయాన్ని బట్టి ఏటా 10-11 రోజుల ముందుగానే రంజాన్ పండుగ జరుపుకుంటారు. చాంద్రమాన నెలలు సౌరనెలల కంటే తక్కువగా ఉంటాయి. దేశం నుంచి మరొక దేశానికి ఒక రోజు వరకు తేడా ఉంటుంది. అలా సౌదీలో పండుగ జరుపుకున్న మరుసటి రోజు భారత్ లో రంజాన్ జరుపుకుంటారు.
రంజాన్ మాసంలోనే ఖురాన్ ఆవిర్భవించిందని నమ్ముతారు. అందుకే ఈ పండుగ ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటారు. నెలవంక చూసినప్పుడు రంజాన్ ఉపవాసం చివరి రోజు సాయంత్రం చాంద్రరాత్రి జరుపుకుంటారు. చాంద్రరాత్రిలో కుటుంబాలు, స్నేహితులు అందరూ కలిసిమెలిసి విందులో పాల్గొంటారు. నెల వంకని చూసిన మరుసటి రోజు రంజాన్ పండుగ చేసుకుంటారు. ఒకవేళ నెలవంక కనిపించకపోతే మరొక రోజు ఉపవాసం ఉంటారు.