Gruha pravesam: గృహ నిర్మాణం ఎప్పుడు చేయాలి? ఏ మాసంలో గృహ ప్రవేశం చేస్తే సుఖ సంతోషాలు ఉంటాయి
Gruha pravesam: గృహ నిర్మాణం ఎప్పుడు చేయాలి? ఏ మాసంలో గృహ నిర్మాణం, గృహ ప్రవేశం వంటివి చేసేందుకు అనుకూలంగా ఉంటాయనే దాని గురించి పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.
Gruha pravesam: గృహ నిర్మాణము అనేక వ్యత్యాసాలు, పనులు, కష్టసుఖాలతో కూడినటువంటి వ్యవహారము. అందుకే పెళ్ళిచేసి చూడు ఇల్లు కట్టి చూడు అని అంటారు. అనగా పెళ్ళి చేయడం ఇల్లు కట్టడం అంత సులభ సాధ్యము కాదని అర్ధము. గృహ నిర్మాణాలు శాస్త్ర ప్రమాణముతో వాస్తురీత్యా నిర్మించుకోవాలని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ముహూర్తం ప్రకారం గృహప్రవేశం, నిర్మాణం వంటివి ప్రారంభించకుండా ఇష్టప్రకారము చేసి అనేక సమస్యలు ఇబ్బందులు తెచ్చుకుంటుంటారని చిలకమర్తి తెలిపారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గృహ నిర్మాణానికి మాస ఫలితములు కూడా చూసుకోవాలి. వైశాఖ మాసం, శ్రావణ మాసం, కార్తీక మాసం, మాఘ, ఫాల్గుణ మాసాలు గృహ నిర్మాణానికి ఉత్తమమైన మాసములని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
చాంద్రమానము, తెలుగు మాసాలు, ఫాల్గుణ పర్యంతము గృహనిర్మాణము చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయంటే..
శ్లో: గృహసంస్థాపనం వైత్రే। ధనహాని రృహద్భయమ్ ।
వైశాఖే శుభదం వింద్యా । జ్యేష్టేతు మరణం (ధ్రువమ్ ।
ఆషాధే గోకులం హంతి । శ్రావణే భృత్య వర్ధనమ్ ॥
కార్తీకే ధనలాభం స్యా ॥ న్మార్గశీర్నే మహద్భయమ్ 1
పుష్యే చాగ్ని భయం | వింద్యాన్మాఘేచ బహుపుత్రవాన్ |
ఫాల్గునే రత్నలాభం స్యా ॥ న్మాసాంచ శుభాశుభమ్ |
మాఘే వైశాఖమాసేతు కార్తిక్యాం శావణా తథా ।
అన్యమాసం పరిత్యజ్య చాతుర్మాసం గృహోత్తమమ్ ।
1. చైత్ర మాసం: గృహ ప్రవేశం లేదా ఇల్లు కడితే అందులో ఉన్న వారికి అధిక భయం, ధనవ్యయం కలుగును.
2. వైశాఖ మాసం: మంచి గ్రహబలం గల ముహూర్తమును ఏర్పాటు చేసుకొని శంఖుస్థాపన లేక గృహ ప్రవేశం చేస్తే ఆయురారోగ్య భాగ్యములు చేకూరును.
3. జ్యేష్ట మాసం: ఈ మాసమందు ఏ వాస్తు కారకుడు గృహ నిర్మాణము చేయుటకు అంగీకరించలేదు. ఇది మరణప్రదము. గృహములో యజమాని నివసించలేడు. వంశవృద్ధి ఉండదు.
4. ఆషాఢ మాసం: ఇది కూడా అంత శ్రేయస్కరమైనది కాదు. పశునాశనము, కష్టనష్టములు, చిక్కులు కల్గును.
5. శ్రావణ మాసం: ఇది చాలా జయకరమైనది. బంధుమిత్రులతో చాలా ఆనందకరముగా కాలం నడుచును. ఎట్టి లోటుపాట్లు కలుగవు.
6. భాద్రపద మాసం: ఈ మాసము గృహనిర్మాణమునకు యోగ్యముగా పరిగణించరు. ప్రజల వలన పీడ, నరఘోష ఎక్కువగా ఉంటుంది.
7. ఆశ్వీయుజ మాసం: ఇది కూడా ఇల్లు కట్టేందుకు అనువైన సమయం కాదు. ఈ సమయంలో ఇల్లు కడితే కలహాలు, అశాంతి, ధనవ్యయం, భీతి, అభిప్రాయ భేదాలు కలుగుతాయి.
8. కార్తీక మాసం: ఇది చాలా శ్రేష్టమైనది. ఆయురారోగ్యం, సుఖ క్షేమ లాభములు కలుగును. బంధుమిత్రుల వలన గౌరవాదులు, జీవన లాభం, సంఘములో గౌరవము, పలుకుబడి, మనోధైర్యం కలుగును.
9. మార్గశిర మాసం: ఇందు గృహనిర్మాణము చేయుట వలన మహాభయం, ఆందోళన, కలవరం కలిగించును. సుఖంగా ఉండలేరు. మనశ్శాంతి ఉండదు.
10. పుష్య మాసం: అనగా సంక్రాంతి దినములు గృహనిర్మాణమునకు అనుకూలించవు. ఒడిదుడుకులు అగ్ని భయం కలుగును.
11. మాఘ మాసం: అత్యుత్తమమైనది మాసం ఇది. శ్రేష్టం, లాభం, సుఖం, ఆనందము, పురోభివృద్ధి, పుత్ర పుత్రికాదులతో చాలా సంతోషంగా ఉంటారు. వృద్ధి, సంపద కలుగును.
12. ఫాల్గుణ మాసం : ఇది చాలా మంచిది. రత్నలాభం, సుఖ సంపదలు, విలువైన వస్తువులు సేకరించుట జరుగును. ప్రాణమిత్ర వైషమ్యములు అంతరించును.
ముఖ్యముగా వైశాఖం, శ్రావణం, కార్తీకం, ఫాల్గుణ మాసాలలో గృహనిర్మాణము చేసుకోవడడం శ్రేయస్కరంగా ఉంటుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.