నరఘోష ఉంటుందా? నరఘోష మన మీద ఉన్నట్లు ఎలా గుర్తించాలి? దానికి పరిహారాలు ఏమిటి
నర ఘోష, నరదిష్టి మన మీద ఉన్నట్లు ఎలా గుర్తించాలి? దానికి పరిహారాలు ఏమిటి? ఈ ధర్మ సందేహానికి ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ నివృతి చేశారు. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
సనాతన ధర్మంలో విశేషించి పురాణాల ప్రకారం అలాగే జ్యోతిష్యశాస్త్ర ప్రకారం కూడా నరఘోష, దృష్టిదోషం వంటివి ఉంటాయి. దీనికి ఉదాహరణగా వినాయక వ్రతకల్పంలో చంద్రుని దృష్టి వలన వినాయకుని యొక్క ఉదర భాగం పగిలి ఇబ్బందిపడినట్లుగా, అందుచేత పార్వతీదేవి చంద్రుని శపించినట్లుగా తెలుస్తుంది. ఇలా నరఘోష, నరదిష్టికి అనేక ఉదాహరణలు సనాతన ధర్మంలో ప్రముఖంగా ఉన్నాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

నరఘోష అసలు ఏయే సందర్భాల్లో ఏర్పడతాయని శాస్త్రాలు ఈవిధంగా తెలియచేశాయి. శుభకార్యాలు ఆచరించేటప్పుడు అనగా వివాహ, గృహారంభ, గృహప్రవేశ, ఉపనయన, శంకుస్థాపన, గర్భాదానం, సీమంతం వంటివి, సామాజిక కార్యక్రమాలు ఆచరించేటప్పుడు, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఉన్నత పదవులు, ఉన్నత స్థానాలు వ్యవహరించేటప్పుడు రాజ్యాధికారం వంటి కార్యక్రమాలు చేపట్టేటప్పుడు నరఘోష, నరదిష్టి వంటివి సోకే అవకాశాలు అధికంగా ఉంటాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
సంతానం కలిగినప్పుడు పిల్లలమీద కూడా ఈ నరదిష్టి ప్రభావం ఉంటుందని అందుచేతనే భారతీయ సాంప్రదాయంలో శుభకార్యాలు ఆచరించేటప్పుడు, శుభకార్యాలు ఆచరించిన తరువాత కూడా ఈ నరదిష్టి, నరఘోషకు సంబంధించినటువంటి పరిహారాలు ఆచరించడం సాంప్రదాయం అని చిలకమర్తి తెలిపారు.
నరదిష్టి, నరఘోష తొలగడానికి నివసించే గృహాలయందు గుమ్మడి కాయలు వంటివి కట్టడం, నరఘోష యంత్రాలు వంటివి పూజించి స్థాపించుకోవడం ఒక విధానం. అలాగే నరఘోష వంటివి తొలగడానికి ఏ శుభకార్యం ఆచరించినా కార్యక్రమానికి ముందు కార్యక్రమం అయిన తరువాత దిష్టి తీయడం విశేషంగా బూడిద గుమ్మడి కాయతో, కర్పూరం, కొబ్బరికాయతో లేదా ఉప్పు వంటి వాటితో దిష్టిని తీయడం చాలా మంచిదని చిలకమర్తి తెలిపారు.
సాధారణంగా ప్రతీ వ్యక్తి నెలకొక శనివారం నిమ్మకాయ లేదా ఉప్పు లేదా ఎండు మిరపకాయలతో శనివారం రోజు స్నానానికి పూర్వం దిష్టి తీయించుకున్న తరువాత తలస్నానం ఆచరించినట్లయితే వారికి నరఘోష బాధల నుండి విముక్తి కలుగుతుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.