Vinakaya patri puja: వినాయక పూజలో ఉపయోగించే 21 పత్రాలు ఏంటి? వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?
Vinakaya patri puja: జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగించమని వేడుకుంటూ వినాయక చవితి రోజు వినాయకుడిని పూజిస్తారు. ఈ పూజలో తప్పనిసరిగా 21 పత్రాలు ఉపయోగిస్తారు. అవి ఏ పత్రాలు, వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, విశిష్టత ఏంటి అనేది తెలుసుకుందాం.
Vinakaya patri puja: వినాయక చవితి రోజు గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజా కార్యక్రమాలు ఘనంగా జరుపుకుంటారు. సాధారణంగా అందరి దేవుళ్ళకు పూలు, పండ్లు వంటి వాటిని సమర్పిస్తూ పూజలు చేస్తారు. కానీ వినాయకుడికి మాత్రం ఏకవింశతి పత్ర పూజ చేస్తారు.
ఇది చాలా విశిష్టమైనది. ప్రకృతిలో దొరికే 21 రకాల పత్రాలతో ఈ పూజ జరిపిస్తారు. వినాయకుడి 21 నామాలను స్మరిస్తూ ఈ పత్రాలతో పూజ చేయడం వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. 21 పత్రాలు సమర్పించడం వల్ల ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెప్తారు. ఏకవింశత పత్ర పూజలో ఉపయోగించే పత్రాలు ఏంటి? వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
మాచీపత్రం
ఆయుర్వేదం ప్రకారం ఇది చర్మ వ్యాధులను తొలగిస్తుంది. అలాగే తలనొప్పిని తగ్గిస్తుంది, నరాలకు బలాన్ని ఇస్తుంది.
బృహతీ పత్రం
ఈ పత్రం వాత, పిత్త, కఫాలను తగ్గిస్తుంది. మలబద్ధకం, జ్వరం, చర్మ రోగాలను నయం చేస్తుంది.
బిల్వపత్రం
హిందువులకు అత్యంత పవిత్రమైనది బిల్వ పత్రం. దీన్నే మారేడు దళాలు అని కూడా అంటారు. వీటినుంచి వచ్చే గాలిని పీల్చడం వల్ల శ్వాసకోసవ్యాధులు నయమవుతాయి.
దుర్వా యుగ్మం
దీన్ని గరిక అంటారు. ఇది మూత్ర సంబంధం వ్యాధులను నయం చేస్తుంది. చర్మ రోగాలను తగ్గిస్తుంది.
దత్తూర పత్రం
ఉమ్మెత్త పువ్వులు ఉండే పత్రం. ఇది ఊపిరితిత్తుల వ్యాధులను నయం చేస్తుంది.
బదరి పత్రం
ఇది కూడా చర్మ వ్యాధులకు మంచి ఔషధంగా పనిచేస్తుంది.
తుర్యాపత్రం
శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. తుర్యా పత్రం అంటే తులసి మొక్క. ఈ ఆకులు వాసన పీల్చడం వల్ల జలుబు, దగ్గు వంటి వ్యాధులు నయమవుతాయి.
అపామార్గ పత్రం
దగ్గు, ఉబ్బసాన్ని తగ్గిస్తుంది. కడుపు నొప్పి నుంచి బయటపడేస్తుంది.
చూతపత్రం
అంటే మామిడి ఆకులు. ఇవి నోటి దుర్వాసన, చిగుళ్ళు, దంత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
కరవీర పత్రం
ఇవే గన్నేరు పత్రాలు. చర్మం మీద వచ్చే పుండ్లను తగ్గిస్తుంది.
విష్ణుక్రాంత పత్రం
జ్ఞాపకశక్తి పెంచుకునేందుకు, నరాల బలహీనత నుంచి ఉపశమనం పొందేందుకు ఉపయోగిస్తారు. దంత సమస్యలను కూడా తొలగిస్తుంది.
దాడిమి పత్రం
ఇవి అజీర్ణవ్యాధులను అరికడుతుంది వాత, పిత్త, కఫాలను తొలగిస్తుంది.
దేవదారు పత్రం
శరీరంలోని వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇస్తుంది.
మరువక పత్రం
ఇది కీళ్ల నొప్పులను తొలగిస్తుంది. అలాగే చెవి, గొంతు సమస్యల నుంచి ఉపశమనం కల్పిస్తుంది. చర్మవ్యాధులను తగ్గిస్తుంది.
సింధువార పత్రం
దంతా క్షయాలను తగ్గించేందుకు ఉపయోగిస్తారు.
జాజి పత్రం
అజీర్తి, నోటి దుర్వాసనను తొలగిస్తుంది.
గండకీ పత్రం
దీన్ని అడవి మల్లె అని కూడా పిలుస్తారు. పైత్యం తొలగిస్తుంది.
శమీ పత్రం
అతి సారవ్యాధిని అరికడుతుంది. దంత సమస్యలను తొలగిస్తుంది. జుట్టుకు మంచి చేస్తుంది.
అశ్వద్ధ పత్రం
ఇవే రావి ఆకులు. ఈ చెట్టులో త్రిమూర్తులు నివసిస్తారని అంటారు. ఈ ఆకులు అధిక రక్తస్రావాన్ని అరికడతాయి. ఆక్సిజన్ అందిస్తాయి.
అర్చన పత్రం
గుండె సంబంధిత సమస్యల నుంచి బయట పడేస్తుంది.
అర్క పత్రం
శరీరంలోని వేడిని తొలగిస్తుంది. నరాల బలహీనత నుంచి ఉపశమనం కలిగిస్తుంది. చర్మ వ్యాధులను తగ్గిస్తుంది.
ఈ 21 పత్రాలు పూజలో పెట్టడం వల్ల వాటి నుంచి వచ్చే వాసన మనం పీల్చుకుంటాం. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అందుకే వినాయకుడికి చేసే పత్ర పూజకు అంతటి ప్రాముఖ్యత ఉంటుంది.