Sravana masam 2024: శ్రావణ మాసంలో ఇంట్లో బిల్వ మొక్క నాటడం శుభమేనా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
Sravana masam 2024: శివుడికి ఎంతో ఇష్టమైన శ్రావణ మాసంలో బిల్వ మొక్క ఇంట్లో నాటడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఇది ఇంటికి తీసుకురావడం వల్ల శివుని ఆశీస్సులు లభిస్తాయి.
Sravana masam 2024: రెండు రోజుల్లో శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది. ఇది శివునికి ఇష్టమైన మాసంగా పరిగణిస్తారు. ఈ పవిత్ర మాసంలో శివుడిని ఆరాధించడం ద్వారా, వ్యక్తి జీవితంలోని అన్ని బాధలు, కష్టాల నుండి ఉపశమనం పొందుతాడని నమ్ముతారు.
దేవతల దేవుడైన మహాదేవుని అనుగ్రహం పొందడానికి మీరు శ్రావణ మాసంలో మీ ఇంట్లో వెలగ చెట్టును కూడా నాటవచ్చు. దీన్నే బిల్వ వృక్షం అంటారు. శివుడికి ఎంతో ప్రీతికరమైంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో బిల్వ పత్రాల మొక్కను నాటడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. పార్వతీ దేవి చెమట నుంచి ఉద్భవించినదని చెప్తారు. అందుకే ఈ వృక్షం అంటే శివుడికి ఎంతో ఇష్టమని చెప్తారు.
బిల్వ వృక్షం ఉన్న ఇంట్లో శివుడు కుటుంబంలోని ప్రతి సభ్యునిపై దయతో ఉంటాడని విశ్వసిస్తారు. సంపద, ఆనందం, శ్రేయస్సును ప్రసాదిస్తాడని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో, మీరు కూడా శ్రావణ మాసంలో మీ ఇంట్లో బిల్వ పత్రాల మొక్కను నాటాలనుకుంటే ఖచ్చితంగా వాస్తుకు సంబంధించిన కొన్ని విషయాలను గుర్తుంచుకోండి. ఏ దిశలో ఈ మొక్కను నాటడం వల్ల శివుని ఆశీస్సులు లభిస్తాయో తెలుసుకుందాం.
బిల్వ పత్రం మొక్క నాటేందుకు వాస్తు నియమాలు
వాస్తు ప్రకారం ఇంటికి ఉత్తరం లేదా పడమర దిశలో బిల్వ పత్ర మొక్కను నాటడం ప్రయోజనకరంగా భావిస్తారు. ప్రతికూలతను తొలగించడానికి, మీరు మీ ఇంటి ప్రాంగణంలో ఈ మొక్కను కూడా నాటవచ్చు. దీంతో ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతారు.
అలాగే ఇంట్లో బిల్వ మొక్క ఉండటం వల్ల ఇంటి సభ్యులకు చంద్ర దోషం నుండి ఉపశమనం లభిస్తుందని చెబుతారు. శ్రావణ మాసంలో బిల్వ పత్ర మొక్కను పూజించడం చాలా శ్రేయస్కరం. అలాగే ఈ చెట్టుకు ఎర్రటి దారం లేదా కల్వాను కట్టడం వల్ల జాతకంలో రాహువు వల్ల కలిగే అశుభ ప్రభావాల నుండి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు.
అదే సమయంలో చెట్టు మూలానికి ఎర్రటి దారం కట్టి క్రమం తప్పకుండా నీటిని అందించడం వల్ల పితృ దోషం వల్ల కలిగే సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. వాస్తు ప్రకారం చతుర్థి, అష్టమి, నవమి, చతుర్దశి, అమావాస్య తిథి నాడు బిల్వ పత్రాలు కోయకూడదు. సోమవారం కూడా బిల్వ పత్రాలను తెంపకూడదు. పూజకు ఒకసారి వాడిన బిల్వ పత్రాలు నీటితో శుభ్రం చేసి మరొకసారి ఉపయోగించుకోవచ్చు.
ఈ శ్రావణ మాసంలో ఇది మాత్రమే కాదు శివునికి ఎంతో ఇష్టమైన మరికొన్ని మొక్కలు ఇంట్లో నాటుకోవచ్చు. అంజూర చెట్టు ఈ మాసంలో నాటడం శుభప్రదంగా భావిస్తారు. అలాగే అరటి చెట్టును పెంచుకోవచ్చు. ఇది విష్ణువుతో పాటు శివునికి ఎంతో ఇష్టమైనది. ఈ శ్రావణ మాసంలో రావి చెట్టును మీరు ఎక్కడైనా నాటవచ్చు. హిందూ శాస్త్రం ప్రకారం రావి చెట్టును పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ చెట్టును నిత్యం పూజిస్తారు. రావి చెట్టుకు నీరు సమర్పించి దీపం పెట్టడం వల్ల అనేక దోషాలు తొలగిపోతాయి.
నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.