Ganesh chaturthi 2023: వినాయకచవితి పూజలో వాడే 21 పత్రాలు, వాటి విశిష్టత తెలుసుకోండి..
Ganesh chaturthi 2023: గణపతి పూజలో వాడే 21 రకాల ఆకులూ, వాటి విశిష్టత గురించి, ఆరోగ్య గుణాల గురించి వివరంగా ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
పురాణాల ప్రకారం భాద్రపద మాస శుక్ల పక్ష చవితిరోజు విఘ్నేశ్వరుని జననం జరిగినట్లుగా చెప్పబడింది. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంతం పంచాంగ గణితం ఆధారంగా 18 సెప్టెంబర్ 2028 భాద్రపద మాస శుక్ల పక్ష చవితి వినాయక చవితిగా జరుపుకుంటున్నాం. మధ్యాహ్న సమయానికి చవితి తిథి ఉండటంచేత 11 నుండి 2 గంటల సమయంలో విఘ్నేశ్వర ఆరాధన చేసుకోవడం మంచిదని చిలకమర్తి సూచించారు. 'ఏకవింశతిపత్రపూజ' అని 21 పత్రాలతో వినాయకుని పూజించే పద్ధతిని మన పెద్దలు ప్రవేశపెట్టారు. ఈ పత్రాలన్నింటినీ కలిపి పత్రి అంటారు. ఆయుర్వేదం ప్రకారం ఈ 21 పత్రాలలో ఎన్నో ఔషధ గుణాలుయని తెలుస్తోంది. ఆ ఆకుల రకాలు, వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి.
1. మాచీపత్రం:
ఇది అన్ని ప్రాంతాలలో లభిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం ఇది నులిపురుగులను, కుష్టును, బొల్లి, దప్పికను పోగొడుతుంది. త్రిదోషాలను ఉపశమింపజేస్తుంది. ఈ పత్రాలను కాసేపు కళ్ళపై పెట్టుకుని పడుకుంటే నేత్రదోషాలు తగ్గుతాయి. తలపై పెట్టుకుంటే తలనొప్పులు మటుమాయమవుతాయి. నరాలకు బలాన్నిస్తుంది. ఇది ఘాటైన వాసన కలది కనుక, నాసికా పుటాలు శుభ్రపడతాయి. దీని చూర్ణాన్ని నూనెలో కలిపి ఒంటికి రాస్తే మంచి సువాసన వస్తుంది.
2. బృహతీపత్రం (వాకుడాకు, నేలమూలిక):
దీనిలో తెలుపు, నీలిరంగు పువ్వులు పూసే రెండు రకాలుంటాయి. ఇది కఫాన్ని, వాతాన్ని తగ్గిస్తుంది. జ్వరం, శ్వాసశూల, గుండె జబ్బులను అరికడుతుంది. మలబద్ధకం, మూలవ్యాధులు తగ్గుతాయి. దీని రసాన్ని చర్మరోగాలకు పైపూతగా ఉపయోగిస్తారు. ఇది అన్ని ప్రాంతాలలో దొరుకుతుంది.
3. బిల్వపత్రం (మారేడు పత్రం):
ఇది హిందువులకు అతి పవిత్రమైనది. బిల్వపత్రాల రసాన్ని శరీరానికి రాసుకుని స్నానం చేస్తే, పొద, దురద, గజ్జి వంటి రోగాలు నివారింపబడతాయి. దీని నుంచి వచ్చే గాలిని శ్వాసిస్తే, శ్వాసకోశవ్యాధులు దరిచేరవు. ఈ పత్రాలను నమిలి తింటే మధుమేహానికి మందులా పనిచేస్తుంది. దీనిని గాలిసోకని ప్రాంతాలలో పెడితే పురుగు పుట్రా రావు. స్వచ్చమయిన గాలి కోసం మన పూర్వులు మారేడును పెంచారు.
4. దూర్వాయుగ్మం (గరిక) :
గరికకు వైద్యగుణాలున్నాయన్న సంగతి చాలామందికి తెలియదు. చిన్న పిల్లలకు ముక్కునుండి రక్తం కారడాన్ని అరికడుతుంది. మూత్రబంధానికి, రక్త పైత్యానికి ఉపయోగపడుతుంది. దీనిని కషాయం చేసి తాగితే, క్రిములను నశింపజేసి, చర్మ రోగాలను తగ్గిస్తుంది.
5. దత్తూరపత్రం (ఉమ్మెత్త):
దీనిలో తెల్ల ఉమ్మెత్త, నల్ల ఉమ్మెత్త అని రెండూ రకాలున్నాయి. ఉమ్మెత్త పత్రాల రసం తేలుకాటు, ఎలుక కాటుల విషాన్ని హరిస్తుంది. దీని పత్రాలు, కొమ్మలు, గింజలు, వేర్లు అన్నింటిలో బెషధ గుణాలున్నాయి. ఉమ్మెత్తరసాన్ని తలపై మర్ధన చేస్తే ఊడిపోయిన వెంట్రుకలు మళ్ళీ వచ్చే అవకాశముంది. కీళ్ళనొప్పులకు, నువ్వుల నూనెను రాసి, ఈ పత్రాలను ఐదారుసార్లు కడితే నొప్పులు తగ్గుతాయి.
6. బదరిపత్రం (రేగు ఆకు):
దీని పత్రాలు కురుపులను త్వరగా నయం చేస్తాయి. రోజు మధ్యాహ్నం తరువాత రేగుపళ్ళను తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. ఈ పత్రం గాత్రశుద్ధికి మంచిది. ఎముకలకు బలాన్ని ఇస్తుంది. ఇంకా ఎన్నో రోగాలకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.
7. తులసీ పత్రం:
ఇందులో శ్వేత, కృష్ణ అని రెండు రకాలున్నాయి. ఈ పత్రాల రసం జ్వరం, జలుబు, దగ్గు తగ్గిస్తుంది. క్రిమిరోగాల్లోపాటు నోటి దుర్వాసనను అరికడుతుంది. తులసీతీర్ధం గొంతును శుభ్రపరుస్తుంది. మధుమేహం, గుండెపోటు, రక్తపోటువంటి వ్యాధులను అరికడుతుంది. దీని గాలి సర్వరోగనివారిణి. మూత్రసంబంధమైన వ్యాధులను, వాంతులను అరికడుతుంది.
8. అపామార్గపత్రం (ఉత్తరేణి పత్రం):
ఉత్తరేణి పుల్లతో పండ్లు తోమడంవల్ల చిగుళ్ళవాపు, రక్తం కారడం తగ్గి, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. భోజనం చేసిన తర్వాత వెంటనే విరోచనమై, కడుపునొప్పితో బాధపడేవారు ఈ పత్రాలను కడుపులోకి తీసుకుంటే మంచిది. కుష్టు, చర్మ వ్యాధులను తగ్గిస్తుంది. కందిరీగలు, తేనేటీగలు కుట్టినచోట ఈ పత్రాల రసాన్ని తీసి పూస్తే నొప్పి తగ్గుతుంది. దీనిని దుబ్చెనచెట్టు అని కూడా అంటారు.
9. చూతపత్రం (మామిడి పత్రం):
లేత మామిడి పత్రాలను నూరి, పెరుగులో కలిపి తింటే అతిసారవ్యాధి తగ్గుతుంది. మామిడి పత్రాలు, లేత కాడలను నమిలితే నోటిపూటలు, చిగుళ్ళ బాధలు త్వరగా తగ్గుతాయి. మామిడికాయ రక్తదోషాన్ని హరిస్తుంది. శరీరానికి ఉష్టాన్నిచ్చి పుష్టినిస్తుంది. ఒరిసిన పాదాల కురుపులకు, మామిడి జీడి రసంతో పసుపును కలిపి రాస్తే పుండు మానుతుంది. ఈ చెట్టు జిగురుతో ఉప్పు కలిపి వెచ్చబెట్టి, కాళ్ళ పగుళ్ళకి రాస్తే అమోఘంగా పని చేస్తుంది. దీని పత్రాలను శుభకార్యాలలో తోరణాలుగా కడతాం.
10. కరవీరపత్రం (గన్నేరు పత్రాలు):
దీని పత్రాలు కుష్టురోగాన్ని దురదను తగ్గిస్తాయి. ఈ ఆకు పసరు తలలోని చుండ్రును నివారిస్తుంది. దీని వేరు బెరడుని తీసి ఎంతకు మానని పుండ్లకు పైన కట్టుగా కదతారు. తెల్లగన్నేరు, బిళ్ళగన్నేరు, ఎర్రగన్నేరు అంటూ మూడు రకాలున్నాయి.
11. విష్ణుక్రాంతం (హరిపత్రం):
ఆయుర్వేదంలో ఈ పత్రాలను జ్ఞాపకశక్తికి, నరాల అలహీనతకు వాడుతుంటారు. వాతం, కఫాలను నివారిస్తుంది. దంతాలను గట్టిపరుస్తుంది. క్రిములను, వ్రణాలను మటుమాయం చెస్తుంది రకరకాల దగ్గులను తగ్గిస్తుంది. ఇది జ్వరనివారిణి.
12. దాడిమీపత్రం (దానిమ్మ పత్రం):
ఈ చెట్టులోని అన్ని భాగాలు ఉపయోకరమైనవే. పత్రాలు, పళ్ళు, అతిసార, అజీర్ణ వ్యాధులను అరికట్టడానికి వాడతారు. ఈ పండ్లను తింటే రక్తం శుద్ధి అవుతుంది. చర్మం కాంతివంతమవుతుంది. ఇది వాతాన్ని, కఫాన్ని, పిత్తాన్నిహరిస్తుంది. హృదయనికి బలం చేకూరుస్తుంది.
13. దేవదారుపత్రం:
దీని బెరడు కషాయం శరీరవేడిని తగ్గిస్తుంది. వెక్కిళ్ళను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
14. మరువకపత్రం (మరువము):
దీని పత్రాల నుండి తీసిన నూనెను కీళ్ళనొప్పులకు పైపూతగా వాడతారు. శ్వాసరోగాలు, హృద్రోగాలను తగ్గిస్తుంది. తేలు, జెర్రి మొదలైన విషపు పురుగులు కుట్టినపుడు మరువం ఆకులరసాన్ని తీసి కడితేనొప్పి తగ్గుతుంది. ఇది దేహానికి చల్లదనాన్ని చేకూరుస్తుంది. చెవిలోని చీమును, చెవిపోటును తగ్గిస్తుంది. దీనిని పసుపుతో కలిపి రాస్తే గజ్జి, చిడుము మొదలైన చర్మవ్యాధులు తగ్గిపోతాయి. ఇది విరివిగా దొరుకుతుంది.
15. సింధువారపత్రం (వావిలాకు) :
దీని ఆకులను నీళ్ళలో వేసి మరగకాచి బాలింతలకు స్నానం చేయిస్తే, వాతం రాకుండా ఉండటమే కాకుండా ఒళ్ళు నొప్పులు తగ్గడానికి ఉపయోగపడుతుంది. దీని ఆకులను నూరి తలకు కట్టుకుంటే తలనొప్పి తగ్గుతుంది. చిగుళ్ళవాపు తగ్గేందుకు కూడా దీనిని ఉపయోగిస్తారు. దీని ఆకుల కషాయం శూలి మొదలైన వ్యాధులను తగ్గిస్తుంది.
16. జాజిపత్రం:
ఇది అజీర్తి నివారిణి. జాజి ఆకులను తింటే శరీరానికి తేజస్సు వస్తుంది. కంఠస్వరం గంభీరంగా ఉంటుంది. నోటి దుర్వాసన పోతుంది. దీనికి తులసికి ఉన్న గుణం ఉంది. దీనిని చాలామంది పెంచుతుంటారు.
17. గండకీపత్రం (కామంచి):
దీనిని అడవిమల్లె అని కూడ అంటారు. దీని ఆకులరసం మూర్చ రోగాన్ని తగ్గిస్తుంది ఈ ఆకులతో కఫం, వాతం, రక్త పైత్యం,విరేచనాలు అరికట్టబడతాయి. అధికమూత్రాన్ని తగ్గిస్తుంది.
18. శమీపత్రం (జమ్మి పత్రం):
ఇది గాలి క్రిమిసంహారిణి. వాయు సంబంధమైన రుగ్మతలను నాశనం చేస్తుంది. దీని ఆకులద్వారా మూలవ్యాధి, అతిసారం తగ్గుతాయి. ఈ ఆకులరసాన్ని తలకు రాసుకుంటే జుట్టు నల్లబడుతుంది. ఈ ఆకు రసాన్ని పిప్పి పన్నులో పెడితే నొప్పితగ్గి దంతం రాలిపోతుంది.
19. అశ్వత్ధపత్రం (రావి ఆకు) :
ఈ చెట్టును త్రిమూర్తుల రూపంగా పూజిస్తుంటారు దీని వేర్లు బ్రహ్మ, కాండం విష్ణువు, కొమ్మలు, ఆకులను శివరూపంగా భావించి పూజిస్తారు. ఈ చెట్టు నీడను ఇవ్వడంతో పాటు మంచి కాలుష్యనివారిణిగా ఉపయోగపడుతుంది. ఈ చెట్టునుంచి వచ్చేగాలి ఆరోగ్యానికి మంచిది.ఈ ఆకుల, చెక్క రసం విరేచనాలు, నోటి వ్యాధులను తగ్గిస్తుంది. రక్తస్రావాన్ని అరికడుతుంది. ఈ చెట్టునీడలో కూర్చుంటే చదివింది చక్కగా ఒంటపడుతుందని మన పెద్దలు చెబుతుంటారు.
20. అర్జునపత్రం (మద్ది ఆకు):
ఇది వాత రోగాలను పోగొడుతుంది. కఫాన్ని తగ్గిస్తుంది. ఆకుల రసం కురుపులను తగ్గిస్తుంది. దీని గింజల తైలాన్ని బెణుకులను తగ్గించేందుకు ఉపయోగిస్తారు. దీని తెల్ల మద్ది అని కూడ అంటారు.
21. అర్కపత్రం (జిల్లేడు పత్రం) :
ఆయుర్వేదంలో దీనిని 64 రోగాల నివారిణిగా పేర్కొన్నారు. ఇది శరీరానికి వేడిని తగ్గిస్తుంది. అందుకే దీనిని అర్భపత్రమని అన్నారు. దీని ఆకులను నూనెలో కాచి, కీళ్ళకు రాస్తే కీళ్ళనొప్పులు తగ్గుతాయి. ఇది పాము విషాన్ని కూడా హరిస్తుందని అంటారు. వాత, పక్షవాతం, కుష్టు, కఫం తదితర వ్యాధులకు మందుగా వాడుతుంటారు. దీని ద్వారా జలుబు తగ్గుతుంది. జిల్లేడు పాలను పసుపుతో కలిపి ముఖానికి రాస్తే ముఖం కాంతివంతమవుతుంది.
వినాయకునికి వెలగపండును నైవేద్యంగా పెడతాము. వెలగపండు గుజ్జును తేనెలో కలిపి తీసుకుంటే పైత్యం, వాంతులు తగ్గుతాయి. ఇలా వినాయక పూజలో ఉపయోగించే పత్రాల ద్వారా మన అనారోగ్య సమస్యలెన్నో తగ్గుతాయి. ఈ పత్ర పూజా విధానంలో ఎన్నో వైజ్ఞానిక విశేషాలున్నాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.