Bhogi festival: గొబ్బెమ్మలతో పాటు పెట్టే నవధాన్యాలు ఏంటి? అవి ఎందుకు పోస్తారు?
Bhogi festival: అందమైన రంగవల్లులకి మరింత అందం వచ్చేలా చేసేందుకు వాటి మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి కొంతమంది నవధాన్యాలు చల్లుతారు. అలా ఎందుకు చేస్తారో తెలుసా?
Bhogi festival: రంగు రంగుల రంగవల్లులు, భోగి మంటలు, పక్షుల కిలకిల రావాలు, ముచ్చటగా ముస్తాబైన ఆడపిల్లలు, కొత్త అల్లుళ్ళు, కోడి పందేలు, ఘుమఘుమలాడే నోరూరించే పిండి వంటలు, బంధువుల సందడి.. ఇలా ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే సంక్రాంతి లిస్ట్ చాలానే ఉంటుంది. అందుకే అన్ని పండుగలలో అతిపెద్ద పండుగ సంక్రాంతి అయ్యింది.
భోగ భాగ్యాలని తీసుకొచ్చే భోగి పండుగతో సంక్రాంతి మొదలవుతుంది. తెల్లవారు జామునే నిద్రలేచి ఇంటి ముందు అందంగా ముగ్గు పెట్టి భోగి మంటలు వేస్తారు. ఇప్పటి వరకు పడిన కష్టాలు మంటల్లో వేసేసి కొత్త జీవితాన్ని ఇవ్వమని సుఖ సంతోషాలు కలగాలని కోరుకుంటూ దేవుడిని వేడుకుంటారు. పాతకి స్వస్తి చెప్పి కొత్తకి ఆహ్వానం పలుకుతారు. భోగి రోజు ప్రతి ఇంటి ముందు భోగి సిరులు పొంగే కుండ ముగ్గు కనిపిస్తుంది.
ఎంతో కష్టపడి శ్రమించిన చేసిన పంట చేతికి వచ్చే సమయం ఇది. కొత్త బియ్యం ఇంటికి చేరతాయి. కొత్త బియ్యం, బెల్లం, పాలు పోసి నైవేద్యం సిద్ధం చేస్తారు. ఈరోజు పాలు పొంగిస్తే ఇంట్లో సిరిసంపదలకి ఎటువంటి లోటు ఉండదని నమ్ముతారు. అందుకే దానికి ప్రతీకగా ఇంటి ముందు సిరులు పొంగే కుండ చెరకు గడలు వేస్తారు.
సంక్రాంతి పండుగ రోజు వేసే ముగ్గులో గొబ్బెమ్మలు పెడతారు. ఆవు పేడతో చేసే గొబ్బెమ్మలు గోదాదేవిగా విశ్వసిస్తారు. అందుకే వాటిని కాలితో తొక్కకూడదు అంటారు. గొబ్బెమ్మలు పెట్టి వాటికి పసుపు, కుంకుమ వేసి పూజ చేస్తారు. బంతి, చామంతి పువ్వుల రేకులు గొబ్బెమ్మల మీద వేస్తారు. చాలా మంది వీటితో పాటు నవధాన్యాలు కూడా గొబ్బెమ్మల మీద చల్లుతారు.
నవధాన్యాలు అంటే ఏంటి?
నవ ధాన్యాలు అంటే తొమ్మిది రకాల ధాన్యాలు. మనకి ఉన్న నవ గ్రహాలకు నవ ధాన్యాలు సంకేతంగా భావిస్తారు. సూర్యుడికి గోధుమలు, చంద్రుడికి బియ్యం, కుజ గ్రహరానికి కందులు, బుధ గ్రహానికి పెసలు, గురు గ్రహానికి సేనగలు, శుక్ర గ్రహానికి బొబ్బర్లు, శని గ్రహానికి నువ్వులు, రాహు గ్రహానికి మినుములు, కేతు గ్రహానికి ఉలవలుగా పరిగణిస్తారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అందుకే సంక్రాంతి రోజు సూర్యుడు, శని అనుగ్రహం పొందటం కోసం నువ్వులు నీటిలో వేసి సమర్పిస్తారు.
సంక్రాంతి రోజు నువ్వులు కూడా దానం చేస్తారు. బెల్లంతో కలిపి నువ్వుల లడ్డూలు చేసుకుని తింటారు. నువ్వులు శరీరానికి వేడి చేస్తాయి. ఉత్తరాయణంలో వచ్చే వాతావరణానికి శరీరాన్ని సిద్ధం చేసెకునేందుకు నువ్వులు బాగా ఉపయోగపడతాయి. నవ ధాన్యాలు గొప్ప ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. వీటిలో పోషకాలు కూడా సమృద్ధిగా అందిస్తాయి.
పూజా కార్యక్రమాలు, దైవ కార్యాలు, శుభ కార్యాలలో నవధాన్యాలు తప్పనిసరిగా ఉపయోగిస్తారు. వీటికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. నవధాన్యాలు చల్లి పూజించడం వల్ల నవగ్రహాల అనుగ్రహం కూడా పొందుతారని నమ్మకం. అందుకే గొబ్బెమ్మల మీద నవధాన్యాలు చల్లుతారు. గొబ్బెమ్మలు సాయంత్రం పూట తీసి పక్కన పెట్టి ఎండబెడతారు. తర్వాత పండుగ రోజు నైవేద్యం చేసే పొయ్యిలో ఎండబెట్టిన గొబ్బెమ్మలు వేస్తారు. ఇవి వేయడం వల్ల ఇంట్లోకి సూక్ష్మ క్రిములు కూడా ఇంట్లోకి చేరవు. పొద్దున్నే భోగి మంటలతో మొదలైన వేడుకలు సాయంత్రం చిన్న పిల్లల తల మీద భోగి పళ్ళు పోసి వారిని ఆశీర్వదిస్తారు.