Ayyappa deeksha: అయ్యప్ప భక్తులు చేపట్టే మండల కాల దీక్ష అంటే ఏంటి? ఎన్ని రోజులు ఆచరిస్తారు?
Ayyappa deeksha: కార్తీకమాసంలో చాలా మంది అయ్యప్ప దీక్ష చేపడతారు. కొందరు మండల దీక్ష చేపడితే మరికొందరు అర్థ మండల దీక్ష చేపడతారు. అయ్యప్ప భక్తులు చేపట్టే మండల కాల దీక్ష ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది. ఎన్ని రోజు ఆచరిస్తారు? నియమాలు ఏంటి అనేది తెలుసుకుందాం.
అత్యంత పవిత్రమైన కార్తీకమాసం ప్రారంభమైంది. ఇప్పటికే కొంతమంది అయ్యప్ప స్వాములు దీక్షలు ప్రారంభించారు. అయితే కొందరు శబరిమల వెళ్ళి దీక్షలు విరమిస్తే మరికొందరు మాత్రం దగ్గరలోని అయ్యప్ప స్వామి ఆలయంలో గురు స్వాముల సమక్షంలో విరమిస్తారు.
కార్తీకమాసంలో అయ్యప్ప దీక్ష చేపట్టే వారిలో ఎక్కువ మంది మండల కాల దీక్ష చేపడతారు. ఇవి నవంబర్ 15న మకర విళక్కుతో మండల పూజలు ప్రారంభం అవుతాయి. మండల కాల దీక్ష చేపట్టే వాళ్ళు నవంబర్ 16 నుంచి జనవరి 14 వరకు ఎంతో కఠినమైన నియమాలు అనుసరిస్తారు. జనవరి 15న మకర జ్యోతి దర్శనం చేసుకుంటారు. అయ్యప్ప దీక్ష విరమించేందుకు శబరిమల వెళ్ళి మోక్ష మార్గంగా భావించే 18 మెట్లు ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు.
అయ్యప్ప స్వామి ఆలయంలో ఉండే ఈ 18 మెట్లు ఎక్కడం ఎంతో పుణ్యంగా భావిస్తారు. నాలుగు వేదాలు, రెండు శాస్త్రాలు, అష్ట దిక్పాలకులు, విద్య, అవిద్య, జ్ఞానం, అజ్ఞానానికి రూపమైన దేవతా మూర్తులు పద్దెనిమిది మెట్లుగా ఏర్పడి అయ్యప్పను దర్శించుకునేందుకు భక్తులకు సహాయపడతారని చెబుతారు. ఈ పద్దెనిమిది మెట్లకు పద్దెనిమిది పేర్లు ఉన్నాయి. మండల కాల దీక్ష చేపట్టి కఠోరమైన ఉపవాసం ఆచరించిన వ్యక్తి మాత్రమే ఈ పద్దెనిమిది మెట్లు ఎక్కేందుకు అర్హులుగా ఉంటారు. స్వామి తల మీద ఇరుముడి పెట్టుకుని మెట్లు ఎక్కుతారు.
మండల కాలం దీక్ష చేపట్టిన వాళ్ళు ఇరుముడి కట్టుకుంటారు. ఇది రెండు భాగాలుగా ఉంటుంది. ఒక భాగంలో బియ్యం, నెయ్యితో నింపిన కొబ్బరి కాయ ఉంటుంది. వీటిని అయ్యప్ప స్వామికి సమర్పిస్తారు. మరొక భాగంలో స్వాములు తినేందుకు అవసరమైన తినుబండారాలు ఉంటాయి.
అయ్యప్ప దీక్ష ధరించిన వ్యక్తిని స్వామి అంటే భగవంతుని స్వరూపంగానే చూస్తారు. ఈ 41 రోజులు అన్ని ప్రాపంచిక సుఖాలకు దూరంగా ఉంటారు. ఉదయం, సాయంత్రం చన్నీటి స్నానం చేస్తూ, ఏక భుక్తం చేస్తారు. జుట్టు, గోర్లు కత్తిరించరు. చెప్పులు కూడా ధరించకుండా ఉంటారు. శృంగారంలో పాల్గొనడం, ధూమపానం, మద్యపానం సేవించడం మహా పాపం. ఎదుటి వారి మీద దూషణలకు దిగడం వంటివి చేయరు. తమను తాము దేవుడిగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తారు.
మండల కాల దీక్ష ప్రాముఖ్యత
పురాణాల ప్రకారం అయ్యప్ప స్వామి శని దుష్ప్రభావాల నుంచి తన భక్తులను రక్షించేందుకు 41 రోజుల వ్రతం చేయమని చెప్పినట్టుగా చెప్తారు. ఎందుకంటే శని చెడు ప్రభావాలు ఎదున్నార సంవత్సరాల పాటు కొనసాగుతుంది. అందువల్ల అనేక ఇబ్బందులు, కఠినమైన జీవితం ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే వాటి నుంచి బయట పడేందుకు ఇలా అయ్యప్ప దీక్ష చేసి స్వామి వారి ఆశీర్వాదంతో శని బాధల నుంచి కూడా తప్పించుకుంటారు.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.