Karthika masam 2024: కార్తీకమాసంలో దీప దానం ఎందుకు చేయాలి? దీని వల్ల కలిగే ఫలితాలు ఏంటి?
Karthika masam 2024: కార్తీకమాసం దీపారాధనకు ఎంతో విశిష్టమైనది. ఈ మాసంలో ఎక్కువగా దీప దానం చేయాలని చెప్తారు. దీప దానం ఎందుకు చేస్తారు. దీని వల్ల కలిగే ఫలితాలు ఏంటి అనే విషయాల గురించి సవివరంగా తెలుసుకుందాం.
ఆధ్యాత్మికంగా ఎదిగేందుకు కార్తీకమాసం చాలా మంచిది. హిందూ మతంలో ఈ మాసానికి అపారమైన ప్రాముఖ్యత ఉంటుంది. స్నానం, దానం, ఉపవాసం, దీపారాధన, దీప దానం వంటి వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తారు.
ఈ ఏడాది కార్తీకమాసం నవంబర్ 2 నుంచి ప్రారంభం కాబోతుంది. శివుడికి ఎంతో ప్రీతికరమైన మాసం ఇది. కార్తీక సోమవారాలు భక్తులు విధిగా దీపాలు వెలిగించి పరమేశ్వరుడి అనుగ్రహం కోసం పూజలు చేస్తారు. అలాగే విష్ణువు, లక్ష్మీదేవికి పూజలు నిర్వహిస్తారు.
“సర్వజ్ఞానప్రదం దీపం సర్వ సంపత్ సుఖావహం దీపదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదామమ” అంటూ దీపం దానం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తాయి. ఈ మాసంలో తులసి దగ్గర నెయ్యి దీపం వెలిగించడం, దీప దానం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. అసలు దీప దానం ఎందుకు చేస్తారు? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది
దీప దానం ఆధ్యాత్మిక వృద్ధిని పెంపొందింస్తుంది. జ్వాల మనలోని జ్ఞానాన్ని సూచిస్తుంది. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం ప్రసాదించమని కోరుకుంటూ దీప దానం చేస్తారు. నెయ్యి దీపాలు గుడిలో లేదా ఎవరైనా దానం చేయడం వల్ల అంతర్గత శాంతి పెరుగుతుంది.
శ్రేయస్సు, అదృష్టాన్ని ఇస్తుంది
కార్తీకమాసంలో దీప దానం చేయడం వల్ల శ్రేయస్సు, అదృష్టం వస్తుంది. జ్వాల పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది. మీరు తలపెట్టిన అన్ని పనుల్లో విజయాన్ని అందిస్తుంది. ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తుంది. భౌతిక సౌకర్యాలు అందిస్తుంది. మనసు భక్తిభావంతో నిండిపోతుంది.
ప్రతికూలతలు తొలగిపోతాయి
కార్తీకమాసంలో దీప దానం చేయడం వల్ల తరతరాల నుంచి వస్తున్న పాపాలు తొలగిపోతాయి. ప్రతికూలతల నుంచి విముక్తి కలుగుతుంది. నెయ్యి దీపం సమర్పించడం వల్ల గత తప్పుల నుంచి క్షమాపణ లభిస్తుంది. మనసు, శరీరం, ఆత్మను శుద్ధి చేస్తుంది. సరికొత్త జీవితం ఆరంభించేందుకు అవకాశం కలిగిస్తుంది.
ఆరోగ్యం ఇస్తుంది
ప్రతికూలతల కారణంగా మనసు, శరీరం చిక్కుల్లో పడుతుంది. మీరు కార్తీకమాసంలో దీపం దానం చేయడం వల్ల వాటి నుంచి బయట పడతారు. కాంతి చెడు ప్రభావాలను దూరం చేస్తుంది. ఆరోగ్యం, శక్తి, బలాన్ని ప్రసాదిస్తుంది. వ్యాధులు, చెడు శక్తుల నుంచి రక్షణ కల్పిస్తుంది. అందుకే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఆలయంలో దీప దానం చేయడం చాలా మంచిది. ఇది మీకు స్వస్థతను, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది.
అనుకున్నవి నెరవేరతాయి
ప్రతి ఒక్కరూ దీపం వెలిగించి తమ కోరికలు నెరవేరాలని కోరుకుంటారు. ఈ కార్తీకమాసంలో మీరు కూడా హృదయపూర్వకంగా పూజలు చేసి దీపం దానం చేయడం వల్ల దైవ ఆశీర్వాదాలు లభిస్తాయి. మీ కోరికలు నెరవేరతాయి. తెలియక చేసిన, తెలిసి చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. జీవితంలో సానుకూలత ఏర్పడుతుంది. సంపదలు లభిస్తాయి.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.