సూర్యాస్తమయం తర్వాత ఈ పనులు ఎట్టి పరిస్థితులలోనూ చేయకూడదు - ఎందుకో తెలుసా?
జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదు. మీరు ఈ పనులు చేస్తున్నట్టయితే వెంటనే అలవాటు మార్చుకోండి. లేదంటే లక్ష్మీదేవి మీ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది.
జ్యోతిష్య శాస్త్రంలో సూర్యోదయం, సూర్యాస్తమయానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. సూర్యోదయం వేళతో రోజు ప్రారంభంఅవుతుంది. సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తూ కొందరు తమ రోజును మొదలు పెడతారు. హిందూ శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత కొన్ని పనులు చేయడం నిషిద్ధంగా భావిస్తారు.
లక్ష్మీదేవి ఈ సమయంలో భూమి మీద తిరుగుతుందని అందుకే ఇంట్లో ఎప్పుడూ చీకటి ఉంచకూడదని చెప్తారు. ఈ సమయంలో గేట్లు తెరిచి ఉంచాలని, లైట్లు వేసి వెలుతురుగా ఉంచాలని అంటారు. అప్పుడే ఇల్లు కళకళగా ఉంటుంది. లక్ష్మీదేవి ఆ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఇంటి మీద ఉంటాయి. అందుకే సూర్యాస్తమయం తర్వాత కొన్ని పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీరు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవాల్సి వస్తుంది.
1. సూర్యాస్తమయం తర్వాత ఇల్లు చిమ్మకూడదు. ఇంటిని శుభ్రం చేయడం, చెత్తను రోడ్డు మీదకు విసిరేయడం వంటి పనులు చేయకూడదు. ఇది సంపద వృద్ధిని దెబ్బతీస్తుంది. అలాగే లైట్లు వేసిన తర్వాత ఇంటిని చిమ్మడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కోల్పోవాల్సి వస్తుంది. చీపురు లక్ష్మీదేవితో సంబంధం కలిగి ఉందని నమ్ముతారు. అలాగే తుడవడం వంటి పనులు కూడ చెయ్యరాదు.
2. సాయంత్రం వేళ ఎప్పుడు లైట్లు వేసిన తర్వాత ఇంటి తలుపులు, గేట్లు మూసి వేయకూడదు. మత విశ్వాసాల ప్రకారం సాయంత్రం లక్ష్మీదేవితో సహా దేవతలు అందరూ భూమి మీద విహరించేందుకు వస్తారట. అందుకే తలుపులు వేయకూడదు. అలాగే ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించాలి.
3. ప్రదోష కాలంలో ఇంట్లో ఎవరూ నిద్రపోకూడదు. ముఖ్యంగా ఆడవాళ్ళు నిద్రపోవడం ఇంటికి దరిద్రం తీసుకొస్తుందని చెప్తారు. సాయంత్రం నిద్రిస్తే ఆ ఇంట్లో ప్రతికూలత ఏర్పడుతుంది. లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు. సంపదకు దేవతగా భావించే లక్ష్మీదేవి ఆశీస్సులు ఇంటి మీద ఉండకపోవడం వల్ల ఆర్థిక కష్టాలు ఇబ్బంది పెడతాయి. సంపదలో పురోగతి నాశిస్తుంది.
4. తులసి ఆకులు సాయంత్రం వేళ కోయకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కోల్పోవాల్సి వస్తుంది. పేదరికానికి దారి తీస్తుంది. అయితే ఉదయం, సాయంత్రం వేళ తులసి దగ్గర దీపం వెలిగించడం మాత్రం తప్పనిసరిగా ఆచరించాలి. ఏ ఇంట్లో అయితే తులసి ఆరాధన జరుగుతుందో అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుంది.
5. సాయంత్రం వేళ పొరపాటున కూడా ఎవరికీ డబ్బులు అప్పుగా ఇవ్వడం, తీసుకోవడం చేయకూడదు. అలాగే తెల్లటి వస్తువులు దానం చేయడం, ఇరుగు పొరుగు ఇంటికి వెళ్ళి తెచ్చుకోవడం చేయకూడదు. పాలు, పెరుగు, ఉప్పు, పసుపు, సూదులు, ఉల్లిపాయ, వెల్లుల్లి, పుల్లని వస్తువులు ఇంటి నుంచి బయటకు పంపించకూడదు. ఇలా చేస్తే ఇంటి నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది.
6. సూర్యాస్తమయం తర్వాత బట్టలు ఉతకడం, వెంట్రుకలు, గోర్లు కత్తిరించడం చేయకూడదు. అలాగే బట్టలు కుట్టడం, మంచాలు అల్లడం వంటివి చెయ్యరాదు. ఇతరులతో గొడవలకు దిగకూడదు.
7. ఎవరైనా మరణించిన వ్యక్తిని సూర్యాస్తమయం తర్వాత ఖననం చేయడం లేదంటే సమాధి చేయడం పొరపాటున కూడా చేయరు. సాయంత్రం నాలుగు గంటలలోపే అంత్యక్రియల కార్యక్రమం నిర్వహించాలని గరుడ పురాణం చెబుతోంది. లేదంటే మరణించిన వారి ఆత్మ అనేక రకాల బాధలు అనుభవించాల్సి వస్తుంది.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.