Mauni amavasya 2024: మౌని అమావాస్య.. ఈ పరిహారాలు పాటిస్తే లక్ష్మీదేవి కటాక్షంతో మీ సంపద పెరుగుతుంది
Mauni amavasya 2024: ఫిబ్రవరి 9న మౌని అమావాస్య. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఈ పరిహారాలు పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ సంపద పెరుగుతుంది.
Mauni amavasya 2024: పుష్య మాసంలో వచ్చే అమావాస్యని మౌని అమావాస్య అంటారు. జ్యోతిష్య శాస్త్రంలో అమావాస్యకి అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఏడాది మొత్తంలో అనేక అమావాస్యలు వస్తూ ఉంటాయి కానీ మౌని అమావాస్య మాత్రం ప్రత్యేకం. ఈసారి మౌని అమావాస్య ఫిబ్రవరి 9వ తేదీన వచ్చింది. ఈరోజు అనేక శుభ యోగాలు ఏర్పడటంతో మౌని అమావాస్య మరింత ప్రత్యేకం కానుంది.
హంస, మాలవ్య, అమృతం, వినాయక యోగాల అరుదైన కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడిటింది. ఈ మౌని అమావాస్య నాడు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు. డబ్బు సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళు, అప్పుల బాధలతో విసిగిపోయిన వారు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మౌని అమావాస్య రోజు ఈ పరిహారాలు పాటించి చూడండి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
మౌని అమావాస్య రోజు పాటించాల్సిన పరిహారాలు
అమావాస్య రోజున ఇంటి ఈశాన్య మూలలో నెయ్యి దీపం వెలిగించాలి. ఈ దీపం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు దీపం వెలుగుతూనే ఉండాలి. అది కొండెక్కకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే నెయ్యి దీపంలో రెండు కుంకుమ పువ్వులు, లవంగాలు వేసి వెలిగిస్తే మంచిది. లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
అమావాస్య రోజున ఆవును సేవిస్తే ఇంట్లో సుఖ శాంతులు నిలుస్తాయి. ఈరోజు పొరపాటున కూడా ఏ జంతువుకి హాని తలపెట్టకూడదు. ఇంటి ముందుకు వచ్చిన ఆవుకి ఆహారం పెట్టి పంపించండి.
లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే రావి చెట్టుకు నీరు సమర్పించాలి. ఎందుకంటే రావి చెట్టు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అలాగే సాయంత్రం పూట రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం మంచిది.
ఎంత సంపాదించినా చేతిలో డబ్బులు నిలవడం లేదా? అనుకోకుండా వచ్చే వృధా ఖర్చుల వల్ల డబ్బు ఖర్చయి పోతుందా? అయితే ఈ అమావాస్య రోజున మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకోవడం కోసం ఈ పరిహారం పాటించండి. తులసి దండంతో గాయత్రీ మంత్రాన్ని 108 సార్లు పఠించండి. హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం గాయత్రీ మంత్రం అత్యంత శక్తివంతమైనది. దీన్ని పఠించడం వల్ల సమస్యలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు.
ఇంట్లోని ప్రతికూలత కూడా ఆర్థిక పరిస్థితి మీద ప్రభావం చూపుతుంది. అందుకే ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని తరిమి కొట్టేందుకు ఇల్లు తుడిచేటప్పుడు నీటిలో కొద్దిగా ఉప్పు వేసి ఆ నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం పొందుతారు.
పితృ దేవతలను ప్రసన్నం చేసుకునేందుకు
అమావాస్య రోజు పితృ దేవతలకు తర్పణాలు వదలడం చాలా ముఖ్యమైన పని. పితృ దోషం నుంచి ఉపశమనం పొందటం కోసం అమావాస్య రోజు మంచిదిగా భావిస్తారు. అందుకే ఈరోజు వారి పేరు మీద దానధర్మాలు చేస్తారు.
శ్రార్థ కర్మలు నిర్వహించడం వల్ల పితృ దేవతలు సంతోషిస్తారు. సూర్యాస్తమయం తర్వాత ఆవ నూనెలో నల్ల నువ్వులు వేసి దక్షిణ దిశలో దీపం వెలిగించాలి. ఈరోజున పితృ స్తోత్రం, పితృ కవచం పఠించడం వల్ల పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది.