Mauni amavasya 2024: మౌని అమావాస్య రోజు ఈ పరిహారాలు పాటిస్తే పితృ దోషం తొలగిపోతుంది
Mauni amavasya 2024: మౌని అమావాస్య రోజు కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించడం వల్ల పితృ దోషం, వంశపార పర్య దోషాల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ ఏడాది మౌని అమావాస్య ఫిబ్రవరి 9న వచ్చింది.
Mauni amavasya 2024: హిందూమతంలో అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అమావాస్య తిథి విష్ణుమూర్తికి అంకితం చేయబడి ఉంటుంది. ప్రతి నెలా అమావాస్య వస్తుంది. అలాగే ఈ ఫిబ్రవరిలో వచ్చే అమావాస్య మరింత ప్రత్యేకతని సంతరించుకుంది.
మాఘ మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే అమావాస్యను మాఘ అమావాస్య లేదా మౌని అమావాస్య అంటారు. ఈరోజు పవిత్ర నదీ స్నానం, దానాలకి విశేష ప్రాముఖ్యత ఉంటుంది. ఈరోజు మౌనవ్రతం ఉండి ఉపవాసం చేస్తే పుణ్యఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం. ఫిబ్రవరి 9న మౌని అమావాస్య వచ్చింది. మౌని అమావాస్య రోజు పితృ దేవతలని ప్రసన్నం చేసుకునేందుకు తర్పణం, పిండ దానం, పవిత్ర స్నానం ఆచరించడం వంటి పనులు చేస్తారు. మాఘ అమావాస్య రోజున పితృ దోషం తొలగిపోవడానికి ప్రత్యేకమైన నివారణలు పాటిస్తే మంచిది.
పితృ దోషం అంటే ఏంటి?
జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం జాతకంలో రెండు, నాలుగు, ఐదు, ఏడు, తొమ్మిది, పదో స్థానంలో సూర్యుడు- రాహువు లేదా సూర్యుడు-శని కలిసినప్పుడు పితృదోషం సంభవిస్తుంది. సూర్యుడు తులా రాశిలో ఉన్నప్పుడు లేదా రాహువు, శనితో కలిసి ఉన్నప్పుడు పితృ దోషం ప్రభావం పెరుగుతుంది. దీనితో పాటు రాహువు 6, 8, 12 వ ఇంట్లో లగ్నం ఉన్నప్పుడు కూడా పితృ దోషం ఏర్పడుతుంది. పితృ దోషం కారణంగా ఒక వ్యక్తి జీవితం సమస్యలతో నిండి ఉంటుంది.
పితృ దోషాలు తొలగించే నివారణలు
ఈ దోషం పోవాలంటే అమావాస్య రోజున పూర్వీకులని సమర్పించుకుంటే వారికి సంబంధించిన పనులు చేయాలి. వారికి పిండ దానం చేయాలి. వరి తప్పులకు క్షమాపణలు కోరుకోవాలి.
మౌని అమావాస్య రోజున పవిత్ర నదీ స్నానం చేసి సూర్య దేవుడికి నీరు సమర్పించాలి. రాగి చెంబులో నీరు, పువ్వులు, అక్షితలు, బెల్లం వేసి సూర్య భగవానుడికి నీటిని సమర్పించాలి.
దాన ధర్మాలు చేయడం వల్ల పుణ్యఫలం దక్కుతుంది. పేదలు, అవసరంలో ఉన్న వారికి మీకు తోచినంత పూర్వీకుల పేరు మీద దానం చేయాలి. బ్రాహ్మణులకు ఆహారం, డబ్బు దానం చేయండి. దుప్పట్లు, పాలు, పంచదార, నల్ల నువ్వులు, డబ్బు దానం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతోషిస్తారని నమ్ముతారు.
చీమలకు పిండిలో పంచదార కలిపి తినిపించాలి. ఇలా చేయడం వల్ల మీకు పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి. ఈరోజు ఆవులకు తప్పకుండా ఆహారం పెట్టండి. ఆవుకి సాత్విక ఆహారం పెట్టాలి. మత విశ్వాసాల ప్రకారం ఆవుకు ఆహారం పెట్టడం వల్ల అన్ని రకాల బాధలు తొలగిపోతాయి.
మౌని అమావాస్య రోజున రావి చెట్టుకు నీరు సమర్పించండి. చెట్టు కింద దీపం వెలిగించి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేయాలి. ఈ పరిహారాలు పాటించడం వల్ల పితృ దోషాల నుంచి ఉపశమనం కలుగుతుందని నమ్ముతారు.
మౌని అమావాస్య రోజున “ఓం ఆద్య భూతయ్ విద్మహే సర్వ సేవయ ధీమాహి, శివ శక్తి స్వరూప్ పితృ దేవ్ ప్రచోదయాత్” అనే మంత్రాన్ని జపించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల వంశపారపర్య దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు.