మహాలయ పక్షాలలో పితృ దోషాలు, పితృ శాపాలు ఎలా నివారించుకోవాలి?
భారతీయ సనాతన ధర్మములో ఉత్తరాయణం దేవతలకు సంబంధించినదిగా, దక్షిణాయనం పితృదేవతలకు సంబంధించినటువంటిదిగా చెప్పబడినది.
ఉత్తరాయణం శుభకార్యాలకు, దక్షిణాయనం పితృకార్యాలు ఆచరించడానికి శ్రేష్టమని ప్రముఖ ఆధ్యాత్మ కవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఏ మానవుడైనా గతించినటువంటి పితృదేవతలకు ఆబ్దికాలు, శ్రాద్ధ కర్మలు వంటివి ఖచ్చితంగా నిర్వర్తించాలి. అలా వారు నిర్వర్తించలేకపోతే వారికి పితృ దోషాలు, పితృ శాపాలు వంటివి ఇబ్బందులు కలుగచేస్తాయని శాస్త్రాలు తెలియచేశాయి.
గతించినటువంటి పితృదేవతలకు తర్పణాలు, పిండప్రదానాలు అందకపోవడం వలన పితృ దేవతలు కనుక బాధకు గురి అయినట్లు అయితే వారి ప్రభావంచేత వారి వంశస్తులకు కుటుంబమునందు అశాంతి, రుణబాధలు వంటివి పెరగడం, అనారోగ్య సమస్యలు కలగడం వంటివి జరుగుతాయని చిలకమర్తి తెలిపారు. ఇలా పితృ శాపాలు తొలగించుకోవడానికి, పితృ దోషాలు తొలగించుకోవడానికి, పితృ దేవతల అనుగ్రహం సంపాదించుకోవడానికి మహాలయ పక్షాలు అద్భుతమైనటువంటి అవకాశమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఎవరైతే గతించినటువంటి పితృదేవతలకు ఈ మహాలయ పక్షాలలో పితృతర్పణాలు, పిండ ప్రధానాలు, దానధర్మాలు వంటి కార్యక్రమాలు, తల్లిదండ్రులు మరియు పితరులకు ఆ తిథిని అనుసరించి మహాలయ పక్షాలలో ఆచరిస్తారో వారికి పితృదోషాలు, పితృ శాపాలు తొలగి పితృదేవతల అనుగ్రహం చేత శుభఫలితాలు కలుగుతాయని చిలకమర్తి తెలిపారు.
టాపిక్