Maha shivaratri 2024: మహా శివరాత్రి రోజు అరుదైన సంఘటనలు, అద్భుతాలు.. ఈ రాశుల వారికి ఇదొక వరం లాంటి సమయం
Maha shivaratri 2024: మహా శివరాత్రి అనేక అరుదైన సంఘటనలు, గ్రహాల కలయికలతో అద్భుతమైన రోజుగా మారింది. ఫలితంగా కొన్ని రాశుల వారికి వరం లాంటి సమయం కాబోతుంది.
Maha shivaratri 2024: దేశ వ్యాప్తంగా మహాశివరాత్రి సంబరాలు మొదలయ్యాయి. మార్చి 8న మహా శివరాత్రి పర్వదినం జరుపుకోనున్నారు. గ్రహాల గమనంతో ఈ ఏడాది వచ్చిన మహాశివరాత్రి రోజు అనేక శుభకార్యాలు జరగబోతున్నాయి. ఫలితంగా ఈ మహాశివరాత్రి ఎంతో ప్రత్యేకం కాబోతుంది. శివరాత్రి కి ఒక రోజు ముందు అంటే మార్చి 7న శుక్రుడు కుంభరాశిలోకి, బుధుడు మీనరాశిలోకి ప్రవేశం చేస్తారు.
కుంభరాశిలో శని, శుక్రుడు, సూర్యుడు కలయిక ఏర్పడుతుంది. మూడు గ్రహాల సంయోగం వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. అటు మీన రాశిలో రాహువు, బుధుడు కలయిక జరుగుతుంది. కుజుడు, చంద్రుడు మకరంలో కలవడంతో లక్ష్మీ యోగం సృష్టిస్తున్నారు. అదే సమయంలో మహా శివరాత్రి రోజు శివయోగం, సిద్ధయోగం, సర్వార్ధ సిద్ద యోగంతో పాటు శ్రవణా నక్షత్రం, ధనిష్ట నక్షత్రం ఏర్పడనున్నాయి. వీటితో పాటు మహా శివరాత్రి రోజే ప్రదోష వ్రతం రావడం గమనార్హం. శుక్రవారం రావడం వల్ల దీన్ని శుక్ర ప్రదోష వ్రతంగా పిలుస్తారు.
గ్రహాల సంచారం శుభయోగాల ఏర్పాటుతో మహా శివరాత్రి నుంచి కొన్ని రాశుల వారికి నెలరోజుల పాటు విపరీతమైన లాభాలు కలగబోతున్నాయి. మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండటం వల్ల వెయ్యి అశ్వమేధ యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుంది. అలాగే ఈరోజు సకల గ్రహాలు నాలుగు ఇళ్లల్లో బస చేయడం వల్ల కేదార్ యోగం ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు.
మహాశివరాత్రి రోజు గంగా నదిలో స్నానమాచరించి శివలింగానికి గంగాజలంతో అభిషేకం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. శివుని ఆశీస్సులు పొందడం కోసం శివ పంచాక్షరీ పారాయణం, శివ సహస్రనామ పారాయణం, మహా మృత్యుంజయ పారాయణం చేయడం శుభదాయకం.
మహాశివరాత్రి రోజు గ్రహాల కదలికలు
బృహస్పతి- మేషరాశి
కేతువు- కన్యా రాశి
కుజుడు- మకర రాశి
శుక్రుడు- కుంభరాశి
సూర్యుడు- కుంభరాశి
శని- కుంభరాశి
బుధుడు- మీనరాశి
రాహువు- మీన రాశి
చంద్రుడు రాత్రి 9:20 గంటల వరకు మకర రాశిలో ఉండి తర్వాత కుంభ రాశి ప్రవేశం చేస్తాడు. శుభ యోగాల ప్రభావంతో ఏయే రాశుల వారికి అదృష్టం ప్రకాశిస్తుందో చూద్దాం.
తులా రాశి
తులా రాశి వారికి మహా శివరాత్రి రోజు శుభయోగం కలగనుంది. గ్రహాల కదలికలు ప్రయోజనకరంగా ఉంటాయి. పురోభివృద్ధికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. కొంతమంది ఆస్తిని కూడా కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలు చేసే వారికి కొత్త ఉద్యోగాల ఆఫర్లు లభిస్తాయి. చిన్నచిన్న ఇబ్బందులను వచ్చినా వాటిని సులభంగా అధిగమిస్తారు. ప్రేమ జీవితంలో రొమాన్స్ ఉంటుంది. ఆకస్మిక ధన లాభం కూడా ఉండొచ్చు.
మేష రాశి
మేష రాశి జాతకులకు మహా శివరాత్రి నాడు త్రిగ్రాహి యోగం, శుభయోగాల ఫలితంగా శుభ ఫలితాలు పొందుతారు. మిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారులు కొత్త వ్యాపారం ప్రారంభించడానికి మంచి ఒప్పందం కుదుర్చుకుంటారు. కుటుంబంలో శాంతి సంతోషాలు నెలకొంటాయి. అదే సమయంలో ఆధ్యాత్మికంగా కూడా బలపడతారు.
వృషభ రాశి
మహా శివరాత్రి రోజు గ్రహాల సంచారం, శుభయోగాల ప్రభావంతో వృషభరాశి జాతకులకు మేలు కలుగుతుంది. జీవితంలోని కష్టాలు క్రమంగా సమసిపోతాయి. నూతన ఆదాయ మార్గాలు, కొత్త అవకాశాలు లభిస్తాయి. వృత్తిలో మీరు చేసే పోరాటం మంచి ఫలితాలను ఇస్తుంది. పదోన్నతికి కూడా అవకాశాలు లభిస్తాయి. జంక్ ఫుడ్ కు దూరంగా ఉంటూ ఆరోగ్యం పై దృష్టి పెట్టాలి. మీ ప్రియమైన వారితో కలిసి ఎక్కడికైనా ట్రిప్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.