Lord shiva: మహా శివరాత్రి శివపూజలో ఏయే వస్తువులు సమర్పించాలి? ఏ వస్తువులు సమర్పించకూడదు?
Lord shiva: మహా శివరాత్రి రోజు చేసే పూజలో పాటించాల్సిన నియమాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. పూజలో ఏయే వస్తువులు సమర్పించాలి? ఏ వస్తువులు సమర్పించకూడదో తెలుసుకుందాం.
Lord shiva: ఈ ఏడాది శివరాత్రి ప్రత్యేకమైన యోగంలో వచ్చింది. త్రయోదశి, చతుర్దశి కలిసి శివరాత్రి రావడం ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు. ఆరోజు అర్ధరాత్రి శంకరుడు బ్రహ్మ నుండి రుద్ర రూపంలో అవతరించాలని పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఈరోజు ఆదిశక్తి పార్వతి దేవిని వివాహం చేసుకున్నారని చెబుతారు.
శివరాత్రి రోజు క్రమ పద్ధతిలో పూజలు చేసి అభిషేకం చేయడం వల్ల పరమేశ్వరుడు ప్రసన్నుడవుతాడు. నాలుగు గంటలకు ఒకసారి వివిధ వస్తువులతో అభిషేకం చేయడం వల్ల భోలేనాథుడి అనుగ్రహం లభిస్తుంది. అయితే శివరాత్రి రోజు మీరు పూజ చేసే సమయంలో సమర్పించకూడని కొన్ని వస్తువులు ఉన్నాయి.
మహా శివరాత్రి పూజలో ఏం సమర్పించాలి?
మహా శివరాత్రి రోజు అభిషేకం, రుద్రాభిషేకం చేయడం విశిష్టతను సంతరించుకుంటుంది. ఉపవాసం ఉండి, రాత్రంతా జాగారం చేస్తే శివుని ఆశీస్సులు లభిస్తాయి. నాలుగు గంటలకు ఒకసారి శివ పూజ చేస్తూ శివ నామస్మరణలో భక్తులు మునిగిపోతారు. మొదటి పూజ చేసే సమయంలో పాలు, గంగా జలం, కుంకుమపువ్వు, తేనె, నీటితో చేసిన మిశ్రమాన్ని శివలింగానికి సమర్పించాలి.
శివరాత్రి రోజున నాలుగు గంటలకు ఒకసారి చేసే ఆరాధన విశేష ఫలితాలు ఇస్తుంది. ఇలా పూజ చేయడం వల్ల మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఏకాగ్రతతో పూజ చేయాలి. శివలింగానికి మొదటిసారి పూజ చేసే సమయంలో నీరు సమర్పించాలి. రెండోజామున పూజించేటప్పుడు పెరుగు, మూడో జామున పూజించేటప్పుడు నెయ్యి, నాలుగో జామున నీటితో అభిషేకం చేయొచ్చు. గంధం పూసి భస్మాన్ని సమర్పించాలి.
అలాగే రేగు పండ్లు సమర్పించాలి. శమీ ఆకులు, బిల్వపత్రాలు, ఉమ్మెత్త పువ్వులు అంటే శివునికి మహా ప్రీతి. వీటిని సమర్పించి పూజించడం వల్ల దుఃఖాల నుండి విముక్తి పొంది జీవితంలో సుఖసంతోషాలు, సౌభాగ్యాలు కలుగుతాయి. ఈరోజు శివపార్వతులను పూజిస్తే సకల కోరికలు నెరవేరతాయి.
శివుడికి ఏం సమర్పించకూడదు
మహా శివరాత్రి రోజు మీరు చేసే పూజ భక్తిశ్రద్ధలతో నియమనిష్ఠలతో చేయాలి. శివునికి ఇష్టమైన వస్తువులు, ఆహార పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. అలాగే కొన్ని వస్తువులు పూజలో పొరపాటున కూడా పెట్టకూడదు. శివలింగంపై పసుపు చల్ల కూడదు. ఎంతో పవిత్రమైన తులసి ఆకులు కూడా శివలింగానికి సమర్పించకూడదు. వాటికి బదులుగా రావి, శమీ, బిల్వ దళాలు సమర్పించుకోవచ్చు.
మీరు అభిషేకం చేసేటప్పుడు ఆరాధనలో శంఖాన్ని పొరపాటున కూడా పెట్టకూడదు. శంకరుడు అనే రాక్షసుడిని శివుడు సంహరిస్తాడు. అతడి భస్మం నుంచి వచ్చినది శంఖం. అందుకే శంఖాన్ని శివుడికి సమర్పించరు. శివలింగానికి అన్నంతో అభిషేకం చేస్తారు. అయితే మీరు సమర్పించే అన్నం చెడిపోయి ఉండకూడదు. వాటితో పాటు శివుడికి కుంకుమ కూడా సమర్పించకూడదు. పసుపు కుంకుమలకు బదులుగా భస్మం, గంధంతో తిలకం వేయొచ్చు. శివుడికి తెల్ల గంధం రాయడం వల్ల సంతోషిస్తాడు. పూజ సమయంలో నలుపు రంగు దుస్తులు ధరించకూడదు. శివుడికి నలుపు అంటే ఇష్టం ఉండదు.