Kharma days: ఖర్మలు మొదలుకాబోతున్నాయి.. ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు?-kharma days starts with sun transit in meena rashi why auspicious programmes not conducted in this month ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Kharma Days: ఖర్మలు మొదలుకాబోతున్నాయి.. ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు?

Kharma days: ఖర్మలు మొదలుకాబోతున్నాయి.. ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు?

Gunti Soundarya HT Telugu
Mar 11, 2024 03:38 PM IST

Kharma days: శుభకార్యాలు జరుపుకునేందుకు ఇక మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఖర్మలు మొదలుకాబోతున్నాయి. తర్వాత నెల రోజుల పాటు ఎటువంటి శుభకార్యాలు జరుపుకునేందుకు అనువైన సమయం కాదు.

సూర్య సంచారంతో ఖర్మలు మొదలు కాబోతున్నాయి
సూర్య సంచారంతో ఖర్మలు మొదలు కాబోతున్నాయి

Kharma days: ఖర్మల కాలం మొదలు కాబోతుంది. మరో మూడు రోజుల్లో సూర్యుడు కుంభరాశిని వదిలి మీన రాశి ప్రవేశం చేస్తాడు. గ్రహాల రాజు సూర్యుడు ధనుస్సు, మీన రాశిలో ప్రవేశించినప్పుడు కర్మల కాలంగా పరిగణిస్తారు. ఈ రెండు రాశులకు బృహస్పతి అధిపతిగా వ్యవహరిస్తాడు.

సూర్యుడు రావడం వల్ల బృహస్పతి శుభ ప్రభావం తగ్గుతుంది. ఖర్మల సమయంలో అన్ని రకాల శుభకార్యాలు నిషేధిస్తారు. మత విశ్వాసాల ప్రకారం ఖర్మల సమయం ఏడాదికి రెండు సార్లు వస్తుంది. ఈ ఏడాది మార్చి మధ్య నుంచి ఏప్రిల్ మధ్య వరకు ఉంటుంది.

ఖర్మల సమయంలో ఏం చేయాలి?

మార్చి 14 మధ్యాహ్నం 12:30గంటలకు సూర్యుడు కుంభ రాశి నుంచి మీనరాశి ప్రవేశం చేయడంతో ఖర్మల సమయం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో సూర్యుడు మార్చి 17న ఉత్తరాభాద్రపదంలోకి మార్చి 31 రేవతి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఏప్రిల్ 13తో ఖర్మల సమయంలో ముగుస్తుంది. ఈ సమయంలో వివాహం, గృహప్రవేశం మొదలైన అన్ని రకాల శుభకార్యాలు నిర్వహించరు. కేవలం ఈ రోజుల్లో మంత్రాలు పఠించడం, దానాలు చేయడం, నదుల్లో పుణ్య స్థానాలు ఆచరించడం, తీర్థయాత్రలు చేపట్టడం ఆనవాయితీ. ఈ సమయంలో మంత్రోచ్ఛారణలు చేయడం, దానధర్మాలు చేయడం వల్ల మీకు పుణ్యఫలం దక్కుతుంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు నెలకు ఒకసారి తన రాశి చక్రం మార్చుకుంటూ ఉంటాడు. అలా డిసెంబరు నెలలో సూర్యుడు ధనుస్సు రాశి ప్రవేశం చేస్తాడు. జనవరి 15 వరకు సూర్యుడు అదే రాశిలో సంచరిస్తాడు. ఆ నెల రోజులు కూడా ఖర్మ మాసంగా పరిగణిస్తారు. మార్చి నెల మధ్యలో సూర్యుడు మీన రాశి ప్రవేశం చేసినప్పుడు మరొకసారి ఖర్మలు ప్రారంభమవుతాయి. ఈ రెండు నెలల్లో సూర్యుడు, బృహస్పతి కలయిక ఉంటుంది. ధనుస్సు, మీన రాశులను వదిలి సూర్యుడు మరొక రాశి సంచారం చేసినప్పుడు ఖర్మల రోజులు ముగుస్తాయి.

శుభకార్యాలు ఎందుకు చేయరంటే..

సూర్యుడు ప్రత్యక్ష దైవంగా పరిగణిస్తారు. సమస్త జీవి ప్రాణ కోటికి సూర్యుడు ఆధారం. అందుకే ఏదైనా శుభకార్యం ప్రారంభంలో గణేశుడు, శివుడు, విష్ణువు, దుర్గాదేవి, సూర్యదేవుడిని పూజిస్తారు. సూర్యుడు తన గురువు బృహస్పతి సేవలో ఉన్నప్పుడు దాని ప్రభావం క్షీణిస్తుంది. ఫలితంగా బృహస్పతి బలం తగ్గుతుంది. ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉంటాయి. అందువల్ల శుభకార్యాలు చేయకూడదని పండితులు సూచిస్తారు.

వివాహ సమయంలో సూర్యుడు, బృహస్పతి మంచి స్థితిలో ఉంటే ఆ వివాహం విజయవంతమైన అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో సూర్యుని ఆరాధించాలి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని పఠించడం వల్ల సూర్య దేవుడి అనుగ్రహం పొందుతారు.

దానం ప్రదానం

ఖర్మ సమయంలో ప్రతిరోజు శ్రీరామ కథ, భాగవతం, శివపురాణం చదవాలి. కనీసం ఒక పుస్తకాన్ని అయినా పారాయణం చేయడానికి ప్రయత్నించాలి. దేవాలయాలను సందర్శిస్తూ పూజలు జరిపించాలి. తీర్థయాత్రలకు వెళ్లి పవిత్ర నదిలో స్నానం ఆచరించాలి. పుణ్యస్నానం ఆచరించలేని వారు నీటిలో గంగా జలం కలిపి స్నానం చేయవచ్చు.

ఖర్మలలో దానాలకు అధిక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సమయంలో దానాలు చేయడం వల్ల పుణ్యస్నానం చేసినంత ప్రతిఫలం లభిస్తుంది. నిస్వార్థంగా భగవంతుని సన్నిధికి చేరుకోవడం కోసం చేసే ఉపవాసాలకు శాశ్వత ఫలితాలు ఇస్తాయి. ఈ సమయంలో వచ్చే వ్రతాలను ఆచరించిన వారి పాపాలు తొలగుతాయి. 

పేదలకు, సాధువులకు, అవసరాల్లో ఉన్నవారికి దానాలు చేయాలి. డబ్బు, ధాన్యాలు, బట్టలు, బూట్లు, చెప్పులు అవసరంలో ఉన్న వారికి దానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఆవులకు పచ్చిగడ్డి ఆహారంగా పెట్టాలి. మీ ఇంటికి సమీపంలో ఏదైనా ఆలయం ఉంటే నెయ్యి, నూనె, దీపం వంటి పూజ సామాగ్రి విరాళంగా ఇవ్వొచ్చు.