Maha shivaratri 2024: పురాణాలలో ఎంతో మంది మహర్షులు ఉన్నారు. వారి ఆశీర్వాదంతో వరాలు పొందిన వాళ్లు ఉన్నారు. శాపాలను అనుభవించిన వాళ్ళు ఉన్నారు. దుర్వాస మహర్షి ముక్కోపి. సంతోషపెట్టిన వారికి వరాలు ఇచ్చేవాడు. కోపం తెప్పిస్తే శపించేవాడు. అందుకే దుర్వాస మహర్షి అంటే అందరూ భయపడేవాళ్ళు. ఆయన కోపం తట్టుకోవడం సాధ్యమయ్యే విషయం కాదు. మహర్షిని చూసి భూలోకం నుంచి దేవలోకం వరకు అందరూ భయపడే వాళ్ళు.
శివుడు దుర్వాస మహర్షికి ఆరాధ్యుడు. శివుని కోపం నుంచి జన్మించిన వ్యక్తి దుర్వాస మహర్షి అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆయన ఎప్పుడు కోపంగా ఉంటాడు.
ఒకనాడు బ్రహ్మ, శివుడి మధ్య మాటల యుద్ధం మొదలైంది. వీరి మాటల యుద్ధం ఎన్నో ప్రళయాలకు దారితీసింది. పరమేశ్వరుడు ప్రళయ రుద్రుడుగా మారడంతో దేవతలు అందరూ భయపడిపోయారు. పార్వతీదేవి కూడా శివుని కోపాన్ని తట్టుకోలేక పోయింది. దీంతో పరమేశ్వరుడు తన కోపాన్ని విడిచిపెట్టి పార్వతీ దేవిని సంతోష పెట్టాలనుకున్నాడు. అదే సమయంలో అనసూయ దేవి త్రిమూర్తుల దివ్యాంశతో బిడ్డలు కలగాలని కోరుకుంది. అలా బ్రహ్మ అంశతో చంద్రుడు, విష్ణు అంశతో దత్తాత్రేయుడు జన్మించాడు. ఇక పరమేశ్వరుడు తన ఆగ్రహాన్ని అనసూయ దేవికి ఇవ్వడంతో దుర్వాసుడు జన్మించాడు. అలా శివుడి కోపం నుంచి పుట్టినవాడు దుర్వాస మహర్షి.
అయితే దుర్వాస మహర్షికి ఒకరోజు వచ్చిన కోపం వల్ల శివుడిని కూడా శపించడానికి వెనుకాడ లేదు. ఒకనాడు దుర్వాస మహర్షి శంకరుని కలవడానికి వచ్చాడు. ఆ సమయంలో శివుడు, అక్కడి ఉన్న ప్రజలు దుర్వాస మహర్షితో సరదాగా మాట్లాడారు. అది తట్టుకోలేక ముక్కోపి స్వభావం కలిగిన దుర్వాస మహర్షి శివుడిని శపిస్తాడు.
జటాధార రూపాన్ని, శరీరంపై బూడిదని, మెడలో పాము రూపాన్ని విడిచి పెట్టినప్పుడు మాత్రమే వివాహం జరుగుతుందని శివుడిని శపించాడు. అవి విడిచి పెట్టకపోతే శివుడి వివాహం జరగదని శపిస్తాడు.
శివపార్వతుల వివాహ సమయంలో శివుడు ఊరేగింపుగా పార్వతీదేవి ద్వారం వద్దకు చేరగానే ఆయన రూపాన్ని చూసి అందరూ భయపడతారు. శివుని వివాహం గురించి తెలిసి లోకం మొత్తం ఆనందించింది. కానీ ఆ దృశ్యాన్ని చూసి పార్వతీ దేవి మనసు కలత చెందింది.
శివుడు ఈ రూపంలో ఉంటే వివాహం చేసుకోలేనని ఆమె నిరాకరించింది. ఆ విధంగా దుర్వాస మహర్షి ఇచ్చిన శాపం వివాహానికి అడ్డంకిగా మారింది. దీంతో విష్ణువు శివుడిని అందమైన పెళ్ళికొడుకుగా సిద్ధం చేశాడు. ఆ తర్వాత పార్వతి దేవి శివుడిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది.