Devi navaratrulu: నవరాత్రి తొలిరోజు పూజా విధానం, పఠించాల్సిన మంత్రాలు, సమర్పించాల్సిన నైవేద్యం ఇదే
Devi navaratrulu: దేవి నవరాత్రుల్లో భాగంగా తొలి రోజు శైలపుత్రి అమ్మవారిని పూజిస్తారు. మీరు ఇంట్లో నవరాత్రులు పూజ చేసుకుంటున్నట్టయితే ఈ సింపుల్ విధానం పాటించి పూజ చేసుకోవచ్చు. పూజా విధానం, పఠించాల్సిన మంత్రాలు, సమర్పించాల్సిన నైవేద్యం గురించి ఇక్కడ తెలుసుకోండి.
దేవి నవరాత్రులు గురువారం(అక్టోబర్ 3) నుంచి ప్రారంభం కాబోతున్నాయి. మొదటి రోజు దుర్గాదేవిని శైలపుత్రి రూపంలో పూజిస్తారు. శైలపుత్రి బలం, స్వచ్చట, ఆధ్యాత్మిక వృద్ధికి ప్రతీక. తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాలలో పూజిస్తారు.
నవరాత్రి తొలి రోజు శైలపుత్రి అమ్మవారిని ఎలా ఆరాధించాలి, పూజా విధానం, శుభ ముహూర్తం, మంత్రాలు, ఎటువంటి నైవేద్యం సమర్పించాలో తెలుసుకుందాం. ఈరోజు ఏ రంగు దుస్తులు ధరించి పూజ చేస్తే ఉత్తమ ఫలితాలు దక్కుతాయో తెలుసుకోండి. అమ్మవారు ఎద్దు మీద కూర్చుని ఎడమ చేతిలో పుష్పం, కుడి చేతిలో త్రిశూలాన్ని పట్టుకుని ఉంటుంది. బ్రహ్మ, శివుడు, విష్ణుమూర్తి అన్ని దివ్య శక్తులు శైలపుత్రికి ఉన్నాయని నమ్ముతారు. చంద్ర గ్రహానికి అధిపతి. చంద్ర దోషం ఉన్న వాళ్ళు, మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు శైలపుత్రిని ఆరాధించడం వల్ల దోషాలు తొలగిపోతాయి.
మొదటి రోజు శైలపుత్రిని ఆరాధించేటప్పుడు పసుపు రంగు దుస్తులు ధరించడం మంచిది. ఇది ఆధ్యాత్మిక మేలుకొలుపును సూచిస్తుంది. తొమ్మిది రోజుల వేడుకకు ఇది శుభారంభాన్ని ఇస్తుంది. అమ్మవారికి పసుపు రంగు పూలు సమర్పించడం లేదంటే పసుపు రంగు వస్తువులతో వేదికను అలంకరించడం మంచిది.
పూజా విధానం
తెల్లవారు జామునే నిద్రలేచి పుణ్య స్నానం ఆచరించాలి. ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. తమలపాకులు, కలశం, మామిడి ఆకులు, యాలకులు, ధూపం, గంగాజలం, దీపాలు, దేశీ నెయ్యి, మేకప్ వస్తువులు, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు అన్నీ ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఒక చెక్క పీట తీసుకుని దాని మీద ఎరుపు రంగు వస్త్రం పరచాలి. దుర్గాదేవి చిత్ర పటం లేదా విగ్రహాన్ని ప్రతిష్టించుకోవాలి. అనంతరం గంగాజలం చల్లాలి.
దుర్గాదేవి ఆరాధన కలశ స్థాపనతో ప్రారంభమవుతుంది. నీరు, నేల, విత్తనాలతో కూడిన పవిత్ర కలశాన్ని ఏర్పాటు చేస్తారు. శైలపుత్రికి నెయ్యి దీపం వెలిగించాలి. తెల్లని పువ్వులు, ధూపం, పండ్లు, స్వీట్లు సమర్పించాలి. దేవత అనుగ్రహాన్ని కోరుతూ ఉపవాసం ఉండవచ్చు. పూజ చేసుకునేందుకు ఉదయం 8.45 నుంచి 10.33 వరకు శుభ ముహూర్తం ఉంది. షోడశ ఉపచారాలతో పూజ నిర్వహించాలి. ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా పూజ చేయడం మంచిది.
మంత్రం
శారదీయ నవరాత్రి మొదటి రోజు శైలపుత్రి అమ్మవారికి సంబంధించిన మంత్రం పఠించాలి. పూజ చేసేటప్పుడు “ఓం దేవి శైలపుత్రయే నమః” అనే మంత్రాన్ని పఠించాలి. అలాగే “యా దేవి సర్వ భూతేషు శైలపుత్రయే రూపేణ సంస్థిత, నమస్తస్యే, నమస్తస్యే, నమస్తస్యే నమో నమః” అనే మంత్రాన్ని జపించాలి.
నైవేద్యం
నవరాత్రులు మొదటి రోజు భక్తులు సంప్రదాయ బద్ధంగా పాలు, స్వచ్చమైన నెయ్యితో చేసిన తీపి వంటకాలు అమ్మవారికి సమర్పించి ఆశీర్వాదం తీసుకుంటారు. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం సమర్పించడం వల్ల కుటుంబం మీద దుర్గాదేవి ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయి.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.