Navaratrulu Day 1 Shailaputri: నవరాత్రుల్లో దుర్గామాత అమ్మవారి మొదటి రూపం శైలపుత్రి దేవి వెనుక హృదయ విదారకమైన కథ-shardiya navratri 2024 day 1 who is goddess shailaputri ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Navaratrulu Day 1 Shailaputri: నవరాత్రుల్లో దుర్గామాత అమ్మవారి మొదటి రూపం శైలపుత్రి దేవి వెనుక హృదయ విదారకమైన కథ

Navaratrulu Day 1 Shailaputri: నవరాత్రుల్లో దుర్గామాత అమ్మవారి మొదటి రూపం శైలపుత్రి దేవి వెనుక హృదయ విదారకమైన కథ

Galeti Rajendra HT Telugu
Sep 26, 2024 04:00 PM IST

Navratri 2024 Day 1 Shailaputri: నవరాత్రులలో మొదటి రోజు శైలపుత్రి మాతకు అంకితం. ఆ రోజున శైలపుత్రి అమ్మవారిని భక్తులు పూజిస్తారు. ఆ శైలపుత్రి మాత పవిత్ర గాథని ఇక్కడ తెలుసుకోండి.

శైలపుత్రి దేవి అమ్మవారు
శైలపుత్రి దేవి అమ్మవారు

Who is Goddess Shailaputri: నవరాత్రులలో తొమ్మిది రోజులూ దుర్గామాత అమ్మవారిని తొమ్మిది రూపాలలో పూజిస్తారు. నవరాత్రులలో మొదటి రోజు శైలపుత్రి దేవి అమ్మవారికి అంకితం చేశారు. ఈ సంవత్సరం శారదీయ నవరాత్రులు అక్టోబరు 3వ తేదీ నుంచి ప్రారంభమై 11వ తేదీ వరకు జరగనున్నాయి. 12వ తేదీ దసరా పండగ.

నవరాత్రులలో మొదటి రోజు దుర్గాదేవి అమ్మవారిని శైలపుత్రిగా పూజిస్తారు. హిమాలయ రాజుకు కుమార్తెగా జన్మించినందున ఆమెకు శైలపుత్రి అనే పేరు వచ్చింది. ఆమె వాహనం వృషభం.

శైలపుత్రి అమ్మవారి కుడిచేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలం ఉంటుంది. అందుకే అమ్మవారిని సతీ అని కూడా పిలుస్తారు. సతీ పిలుపు వెనుక ఒక హృదయ విదారకమైన కథ ఉంది.

ప్రజాపతి ఒక యజ్ఞం చేసిన తర్వాత దేవతలందరినీ ఆహ్వానించాడు. కాని అల్లుడైన శంకరుడిని మాత్రం పిలవలేదు. అయితే తన తండ్రి చేస్తున్న యజ్ఞాన్ని చూడాలనే కుతూహలంతో సతీదేవి యజ్ఞానికి వెళ్లాలని నిశ్చయించుకుంది.

పిలవని పేరంటానికి వద్దన్నా వినని సతీ దేవి

కానీ పిలవని పేరంటానికి వెళ్లకూడదని శంకరుడు ఒప్పుకోలేదు. అయినా సతీదేవి పట్టువీడలేదు. దాంతో చివరికి సతీదేవితో శంకరుడు ‘‘దేవీ.. యజ్ఞానికి దేవతలందరినీ ఆహ్వానించారు. కానీ నన్ను కాదు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడికి వెళ్లడం సరికాదు’’ అని నచ్చచెప్పే ప్రయత్నం చేస్తాడు.

శివుడు ఎంత నచ్చచెప్పినా.. సతీమాత వినకపోవడంతో యజ్ఞానికి వెళ్లడానికి ఆఖరికి అనుమతించాడు. సతీ పుట్టింటికి వెళ్లగానే తల్లి మాత్రమే ప్రేమగా మాట్లాడి ఆప్యాయతను చాటుకుంది. కానీ, అక్కాచెల్లెళ్ల మాటల్లో వ్యంగ్యం, హేళన కనిపించాయి. అందరి ముందు శంకరుడిని అవమానించేలా వాళ్లు మాట్లాడారు.

చివరికి తండ్రి దక్ష ప్రజాపతి కూడా తన పతిని అవమానించడం సతీమాతను మరింత మానసిక క్షోభకి గురిచేసింది. దాంతో ఆ అవమానాన్ని భరించలేక సతీదేవి అక్కడే బొటన వేలితో నేలపై నిప్పు రవ్వలు సృష్టించి ఆత్మాహుతి చేసుకుంది.

కోపంతో రగిలిపోయిన శివుడు

సతి ఆత్మాహుతి గురించి తెలియగానే చలించిపోయిన శంకరుడు ఆ యజ్ఞాన్ని కోపంతో నాశనం చేశాడు. ఆ సతీ దేవి అమ్మవారే మరు జన్మలో హిమాలయ రాజుకు కుమార్తెగా జన్మించి శైలపుత్రిగా పేరుగాంచింది. పార్వతి, హేమావతి అనేవి శైలపుత్రి దేవి మారు పేర్లు. శైలపుత్రి అమ్మవారు కూడా శంకరుడిని వివాహం చేసుకుంది.

గమనిక: పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.