Oldest woman: రెండు ప్రపంచ యుద్ధాలు, స్పానిష్ ఫ్లూ, కోవిడ్ లను గెలిచిన 117 ఏళ్ల యోధురాలు
Guinness World Records: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ 117 ఏళ్ల యోధురాలి గురించి తెలుసుకుందాం. ఆమె తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. రెండు ప్రపంచ యుద్ధాలను, స్పానిష్ ఫ్లూను, చివరకు కోవిడ్ 19 ను కూడా జయించారు. ఇటీవలనే తన 117వ బర్త్ డే ను ఘనంగా జరుపుకున్నారు.
ఈ విజేత పేరు మరియా బ్రాన్యాస్ మొరేరా (Maria Branyas Morera). 1907 వ సంవత్సరం మార్చి 4 వ తేదీన అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జన్మించారు. లేటెస్ట్ గా 2024 మార్చి 4 న తన 117వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఆమె గురించి తమ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఒక పోస్ట్ చేసింది.
రెండు ప్రపంచ యుద్ధాలు..
మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, స్పానిష్ ఫ్లూ మహమ్మారి, కోవిడ్ -19 మహమ్మారి వంటి భయంకరమైన ముప్పులను మరియా బ్రాన్యాస్ మొరెరా (Maria Branyas Morera) జయించారు. ప్రస్తుతం మరియా బ్రాన్యాస్ మొరెరా ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు. ‘‘తన 117వ పుట్టినరోజు జరుపుకున్న మరియా బ్రాన్యాస్ మొరేరాకు జన్మదిన శుభాకాంక్షలు. 2023 జనవరిలో ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా ఆమె గుర్తింపు పొందారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో 1907 మార్చి 4న జన్మించిన మారియా ఎనిమిదేళ్ల వయసులో కాటలోనియాలో స్థిరపడేందుకు కుటుంబంతో కలిసి స్పెయిన్ కు తిరిగి వచ్చారు. అప్పటి నుంచి ఆమె ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. గత 23 సంవత్సరాలుగా అదే నర్సింగ్ హోమ్ లో ఆమె నివసిస్తున్నారు’’ అని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ తన ఇన్స్టాగ్రామ్ (instagram) లో మోరేరా ఫోటోను పోస్ట్ చేస్తూ వివరించింది.
జీన్స్ లోనే ఉంది..
గిన్నిస్ బుక్ (Guinness World Records) ప్రతినిధితో మాట్లాడుతూ, మోరేరా (Maria Branyas Morera) తన దీర్ఘాయువుకు కారణాలను వెల్లడించారు. అదృష్టంతో పాటు వంశపారంపర్యంగా వచ్చిన మంచి జన్యువులు మాత్రమే తన దీర్ఘాయువుకు కారణం కాదని ఆమె స్పష్టం చేశారు. ‘‘క్రమశిక్షణ, ప్రశాంతత, కుటుంబం, స్నేహితులతో సత్సంబంధాలు, ప్రకృతితో పరిచయం, భావోద్వేగ స్థిరత్వం, చింత లేకపోవడం, సానుకూలత, విషపూరిత వ్యక్తులకు దూరంగా ఉండటం’’ వంటి ఇతర అంశాలు కూడా తన ఆరోగ్యానికి దోహదపడ్డాయని ఆమె తెలిపారు.
తన 117 వ పుట్టినరోజు
‘‘ఈ ప్రత్యేకమైన రోజును ఆమె తన కుటుంబం, మిత్రులు, సన్నిహితులతో గొప్పగా జరుపుకున్నారు’’ అని మారియా నర్సింగ్ హోమ్ డైరెక్టర్ ఇవా కారెరా బోయిక్స్ అన్నారు. మార్చి 4న ఆమె పుట్టినరోజు వేడుకలు జరిగాయని తెలిపారు. మొరేరాకు అందిన అభినందనలకు, ఆమె ఆరోగ్యంపై చాలా మంది చూపిన ఆసక్తికి ఆమె చాలా కృతజ్ఞురాలిగా ఉన్నారు’’ అని బోయిక్స్ పేర్కొన్నారు.
నెటిజన్ల నుంచి గొప్ప స్పందన
దాదాపు 14 గంటల క్రితం ఈ పోస్ట్ ను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ షేర్ చేసింది. అప్పటి నుంచి దాదాపు 1.8 లక్షల లైక్స్ వచ్చాయి. ఈ షేర్ కు ప్రజల నుంచి బోలెడన్ని కామెంట్లు వచ్చాయి. 'ఆమె రెండు ప్రపంచ యుద్ధాలు, రెండు మహమ్మారులను ఎదుర్కొంది, ప్రపంచం ఎలా ఉందో మా అందరి కంటే ఆమెకు మంచి అవగాహన ఉంది' అని ఒక ఇన్స్టాగ్రామ్ యూజర్ పేర్కొన్నారు. 'ఆమె నాకంటే 99 ఏళ్లు పెద్దది' అని మరొకరు పోస్ట్ చేశారు. "దేవుడు ఆమెను ఆశీర్వదించి, ఆమెకు మరింత శక్తిని, ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక" అని మరొక యూజర్ స్పందించాడు.
ఎన్నో సవాళ్లు, చివరకు కోవిడ్ కూడా..
నాటి స్పానిష్ ఫ్లూ మహమ్మారితో పాటు స్పానిష్ అంతర్యుద్ధం (1936-1939) సమయంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని, అవి తనకు 'చాలా చెడ్డ జ్ఞాపకాలని మారియా గిన్నిస్ బుక్ ప్రతినిధికి తెలిపారు. 2020 లో ఆమెకు 113 ఏళ్లు నిండిన, కొన్ని వారాల తర్వాత ఆమె కొరోనా వైరస్ బారిన పడ్డారు. కానీ కొద్ది రోజుల్లోనే పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఆమెకు వినికిడి మరియు చలనశీలత సమస్యలు తప్ప శారీరక లేదా మానసిక సమస్యలు లేవు.