USA: ‘చిన్నప్పటి నుంచీ అమెరికాలో ఉన్నా.. ఆ పిల్లలు వెనక్కు రాక తప్పదు’: త్రిశంకు స్వర్గంలో యూఎస్ ఇండియన్ చిల్డ్రెన్-why 2 5 lakh children including indo americans face deportation risk ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Usa: ‘చిన్నప్పటి నుంచీ అమెరికాలో ఉన్నా.. ఆ పిల్లలు వెనక్కు రాక తప్పదు’: త్రిశంకు స్వర్గంలో యూఎస్ ఇండియన్ చిల్డ్రెన్

USA: ‘చిన్నప్పటి నుంచీ అమెరికాలో ఉన్నా.. ఆ పిల్లలు వెనక్కు రాక తప్పదు’: త్రిశంకు స్వర్గంలో యూఎస్ ఇండియన్ చిల్డ్రెన్

HT Telugu Desk HT Telugu
Jul 27, 2024 05:41 PM IST

అమెరికాలోని దాదాపు 2.5 లక్షల మంది పిల్లల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. చిన్నప్పటి నుంచి అమెరికాలో పెరిగినా, అక్కడే చదువుకున్నా.. నిబంధనల ప్రకారం దేశం విడిచి స్వదేశానికి వెళ్లక తప్పని పరిస్థితి వారిది. వీరిలో వేలాది మంది భారతీయ సంతతి పిల్లలున్నారు.

‘చిన్నప్పటి నుంచీ అమెరికాలో ఉన్నా.. ఆ పిల్లలు వెనక్కు రాక తప్పదు: త్రిశంకు స్వర్గంలో యూఎస్ ఇండియన్  చిల్డ్రెన్
‘చిన్నప్పటి నుంచీ అమెరికాలో ఉన్నా.. ఆ పిల్లలు వెనక్కు రాక తప్పదు: త్రిశంకు స్వర్గంలో యూఎస్ ఇండియన్ చిల్డ్రెన్

అధికారిక గణాంకాల ప్రకారం.. అమెరికాలో దాదాపు 2.5 లక్షల మంది పిల్లల పరిస్థితి త్రిశంకు స్వర్గంలో ఉన్నట్లుగా ఉంది. వారిలో వేలాది మంది భారతీయ కుటుంబాలకు చెందినవారు ఉన్నారు. వారి భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోకుండా, రిపబ్లికన్, డెమొక్రాట్ పార్టీల నాయకులు బ్లేమ్ గేమ్ ఆడుతున్నారు.

చట్టబద్ధంగానే ఉన్నా..

వివరాల్లోకి వెళితే, అమెరికాలోకి చిన్న వయస్సులో తల్లిదండ్రులతో కలిసి వచ్చి, అక్కడే పెరిగి, అక్కడే చదువుకుని, తాము కూడా అమెరికన్లమే అని భావించే 2.5 లక్షల మంది పిల్లలను, మీది అమెరికా కాదు, మీరు మీ స్వదేశం వెళ్లాల్సిందే అని అమెరికా చట్టాల్లోని నిబంధనలు చెబుతున్నాయి. చట్టబద్ధమైన వలసదారులు అంటే టెంపరరీ వర్క్ వీసాపై అమెరికాకు వచ్చేవారు తమతో పాటు పిల్లలను డిపెండెంట్ లుగా తీసుకువస్తారు. అక్కడే వారికి విద్యాబుద్ధులు నేర్పిస్తారు. అయితే, అమెరికా చట్టాల ప్రకారం, ఆ పిల్లలకు 21 ఏళ్లు నిండగానే, వారికి డిపెండెంట్ హోదా ముగుస్తుంది. అంటే, వారు డిపెండెంట్లు గా అమెరికాలో నివసించడానికి అర్హత కోల్పోతారు. 21 ఏళ్లు నిండిన తర్వాత వారిని యునైటెడ్ స్టేట్స్ నుండి బహిష్కరించబడే ప్రమాదం ఉంది.

స్వదేశానికి వెళ్లాల్సిందే..

యూఎస్ లో ఈ సమస్యను ‘ఏజింగ్ ఔట్ (aging out)’ అంటున్నారు. ఈ పిల్లలనే 'డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ (Documented Dreamers)' అంటున్నారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాలు- ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ (ఐఎన్ఏ)- పిల్లలు 21 ఏళ్లు వచ్చేసరికి, ఒకవేళ, అప్పటికీ వారి తల్లిదండ్రులు శాశ్వత నివాస హోదాను పొందకపోతే, ఆ పిల్లలు అమెరికాను విడిచిపెట్టాలని నిర్దేశిస్తున్నాయి. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ (ఎన్ఎఫ్ఎపి) సర్వే నవంబర్ 2023 ప్రకారం, డిపెండెంట్లతో సహా 12 లక్షలకు పైగా భారతీయులు ఈబీ -1, ఈబీ -2, ఈబీ -3 వీసా (VISA) కేటగిరీలలో గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు.

గ్రీన్ కార్డ్ రాకపోతే..

గ్రీన్ కార్డ్ కోసం అర్హులైన చాలా మంది దశాబ్దాల తరబడి ఎదురు చూసే పరిస్థితి రావడానికి రిపబ్లికన్ లు కారణమని డెమొక్రాటిక్ పార్టీ విమర్శిస్తోంది. ఈ సమస్య పరిష్కారానికి ఉద్దేశించిన ద్వైపాక్షిక ఒప్పందాన్ని వారు రెండుసార్లు తిరస్కరించారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియరీ విమర్శించారు. ఈ డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ ను క్షించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ను సెనేటర్ అలెక్స్ పాడిల్లా నేతృత్వంలోని 43 మంది చట్టసభ సభ్యుల బృందం కోరింది.

సోషల్ మీడియాలో..

ఇదిలావుండగా, భావోద్వేగ, ఆచరణాత్మక ఇబ్బందులను ఎత్తిచూపుతూ ఈ డాక్యుమెంటెడ్ డ్రీమర్ల వ్యక్తిగత కథనాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. భారత సంతతికి చెందిన పాడ్ కాస్టర్ ద్వారకేష్ పటేల్ తన అనుభవాన్ని ఎక్స్ లో పంచుకున్నారు. తన కుటుంబం ఎదుర్కొంటున్న ఆందోళనను వివరించారు. పటేల్ 8 సంవత్సరాల వయస్సులో అతని కుటుంబం అమెరికాకు వెళ్లింది. కాని అతని తండ్రి ఇప్పటికీ హెచ్ 1 బీ వీసాపైనే ఉన్నారు. పటేల్ కు 21 ఏళ్లు వచ్చేనాటికి కూడా ఇంకా గ్రీన్ కార్డు పొందలేదు. దాంతో, పటేల్ కు ఒకవేళ హెచ్ 1 బీ (H1B VISA) వీసా రాకపోతే, అతడు భారత్ కు తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Whats_app_banner