UK Graduate Visa: హైయర్ స్టడీస్ కు యూకే వెళ్లే స్టుడెంట్స్ కు గుడ్ న్యూస్; గ్రాడ్యుయేట్ వీసాపై కీలక అప్ డేట్
UK Graduate Visa: పై చదువుల కోసం తమ దేశానికి వచ్చే విదేశీ విద్యార్థులకు బ్రిటన్ శుభవార్త తెలిపింది. అంతర్జాతీయ విద్యార్థులకు అందించే గ్రాడ్యుయేట్ రూట్ వీసా సిస్టమ్ ప్రస్తుత రూపంలోనే కొనసాగుతుందని బ్రిటన్ మైగ్రేషన్ అడ్వైజరీ కమిటీ స్పష్టం చేసింది. ఈ వీసాను 2021 జూలైలో ప్రవేశపెట్టారు.
UK Graduate Visa: ఉన్నత చదువుల కోసం భారత్ నుంచి విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు ప్రధాన గమ్యస్థానాల్లో ఒకటి బ్రిటన్. అమెరికా తరువాత యూకే కే ఎక్కువగా విద్యార్థులు పై చదువుల కోసం వెళ్తుంటారు. బ్రిటన్ లో ఆక్స్ ఫర్డ్, కేంబ్రిడ్జ్ వంటి ప్రపంచ ప్రసిద్ధ యూనివర్సిటీలు ఉండడం, వర్క్ చేసుకునే అవకాశం ఉండడం అందుకు ప్రధాన కారణాలు.
విద్యార్థులకు యూకే గుడ్ న్యూస్
ఈ ఏడాది యునైటెడ్ కింగ్ డమ్ కు వెళ్లాలని యోచిస్తున్న భారతదేశం నుండి వేలాది మంది విద్యార్థులకు ఉపశమనం కలిగించే విధంగా బ్రిటన్ మైగ్రేషన్ అడ్వైజరీ కమిటీ (MAC) కీలక ప్రకటన చేసింది.2021 నుంచి అమల్లో ఉన్న గ్రాడ్యుయేట్ రూట్ వర్క్ వీసా (graduate route work visa) లో ఎలాంటి మార్పులు చేయడ లేదని, దాన్ని యథాతథంగా కొనసాగిస్తామని తెలిపింది. ఈ వీసా ద్వారా యూకే వెళ్లి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులకు తమ విద్యాభ్యాసం అనంతరం రెండేళ్ల పాటు అక్కడ ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది. ఈ వీసాను పోస్ట్ స్టడీ వర్క్ (PSW -post study work)) వీసా అని కూడా అంటారు.
2021 నుంచి..
ఈ గ్రాడ్యుయేట్ రూట్ వర్క్ వీసాను యూకే ప్రభుత్వం 2021 జులైలో ప్రవేశపెట్టింది. నాటి నుంచి హయ్యర్ స్టడీస్ కోసం యూకే వెళ్లే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇటీవల ఈ వీసా కేటగిరీని రద్దు చేయనున్నారనే వార్తలు వచ్చాయి. దీనిపై బ్రిటన్ స్పందించింది. ఈ గ్రాడ్యుయేట్ రూట్ వర్క్ వీసా (graduate route work visa) కేటగిరీ కొనసాగుతుందని, దానిలో ఎలాంటి మార్పులు చేయడం లేదని స్పష్టం చేసింది. 2030 నాటికి యూకేలో ఆరు లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థులు ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బ్రిటన్ ఎంఏసీ (Migration Advisory Committee -MAC) తెలిపింది. అయితే ఈ లక్ష్యాన్ని గడువు కంటే ముందే సాధించామని వెల్లడించింది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో గ్రాడ్యుయేట్ రూట్ వీసా ప్రధాన పాత్ర పోషించిందని తెలిపింది.
45,600 మంది భారతీయ విద్యార్థులు
ఈ వీసా కేటగిరీ అంటే గ్రాడ్యుయేట్ రూట్ వర్క్ వీసా దుర్వినియోగం అయినట్లు ఎలాంటి ఆధారాలు లేవని ఎంఏసీ స్పష్టం చేసింది. 2023లో మొత్తం 1.14 లక్షల గ్రాడ్యుయేట్ రూట్ వీసాలు జారీ చేయగా, మరో 30 వేల వీసాలను డిపెండెంట్లకు ఇచ్చారు. భారతదేశం, చైనా, పాకిస్తాన్, నైజీరియా ల నుంచి ఎక్కవ మంది ఈ గ్రాడ్యుయేట్ వీసాలను పొందారు. మొత్తం గ్రాడ్యుయేట్ వీసాలలో 70 శాతం ఈ నాలుగు దేశాలకే వెళ్లాయన్నారు. వీటిలో భారతదేశ విద్యార్థులు పొందినవి 40 శాతం. అంటే మొత్తం 45,600 గ్రాడ్యుయేట్ రూట్ వర్క్ వీసాను పొందారు. గ్రాడ్యుయేట్ మార్గంలో ఉన్నవారిలో ఎక్కువ మంది (91 శాతం) మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నాన్-ప్రీమియర్ విశ్వవిద్యాలయాల ((నాన్-రస్సెల్ గ్రూప్) పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఎక్కువ మంది విద్యార్థులు చేరారు. ఇది మొత్తం గ్రాడ్యుయేట్ వీసాలలో 66 శాతంగా ఉంది.