Rishi Sunak fined for not wearing seatbelt : నిబంధనల అమల్లో పెద్దా, చిన్నా తేడా ఉండదని నిరూపించారు బ్రిటన్ పోలీసులు. ఈ క్రమంలో.. ఏకంగా ప్రధాని రిషి సునక్‌కే జరిమానా విధించారు! సీట్‌బెల్ట్ పెట్టుకోకుండా వాహనంలో ప్రయాణించినందుకు.. రిషి సునక్‌పై ఈ జరిమానా పడింది.
కొన్ని రోజుల క్రితం.. తన కారులో ప్రయాణిస్తున్న రిషి సునక్.. ఓ వీడియోను తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దేశ ఆర్థిక వృద్ధికి సంబంధించిన నిధుల వివరాలను అందులో వెల్లడించారు. దేశాభివృద్ధి కోసం తాను ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటున్నట్టు వివరించారు. ఈ వీడియో నిడివి దాదాపు 1 నిమిషం.
Rishi Sunak fined : అంతా బాగానే ఉంది కానీ.. వీడియో చిత్రీకరిస్తున్న సమయంలో.. కారులో వెనక భాగంలో కూర్చున్న బ్రిటన్ ప్రధాని రిషి సునక్.. సీట్‌బెల్ట్ పెట్టుకోవడం మర్చిపోయారు. అంతే! ఆయన చెప్పిన మాటల కన్నా.. "సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ప్రయాణిస్తున్న ప్రధాని," అంటూ.. సామాజిక మాధ్యమాల్లో ఆ వీడియో వైరల్‌గా మారింది.
అనంతరం ఈ ఘటనపై రిషి సునక్ క్షమాపణలు చెప్పారు. "తప్పు జరిగింది. రిషి సునక్ క్షమాపణలు చెబుతున్నారు. అందరు సీట్‌బెల్ట్ ధరించాలన్నది ఆయన అభిప్రాయం," అని ప్రధాని ప్రతినిధి తెలిపారు.
UK PM Rishi Sunak fined : కాగా.. ఈ వ్యవహారంపై స్పందించిన లంకెషైర్ పోలీసు విభాగం.. ఘటనను పరిశీలిస్తున్నట్టు వివరించింది. సీట్ బెల్ట్ పెట్టుకోని కారణంగా.. ప్రధానిపై 100 పౌండ్ల జరిమానా విధిస్తున్నట్టు స్పష్టం చేసింది. రిషి సునక్‌ను 42ఏళ్ల లండన్వాసిగా సంబోధించింది!
"సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన వీడియో ఆధారంగా.. సీట్‌బెల్ట్ పెట్టుకోకుండా లంకెషైర్లో ప్రయాణించిన ఓ 42ఏళ్ల లండన్వాసికి జరిమానా విధించాము," అని లంకెషైర్ పోలీసు విభాగం,, శుక్రవారం ఓ ప్రకటనను విడుదల చేసింది.
యూకేలో రోడ్ సేఫ్టీకి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఇందుకు సంబంధించి.. కఠిన నిబంధనలు అమల్లో ఉంటాయి. వైద్యపరంగా ఏదైనా మినహాయింపులు ఉంటే తప్ప.. అక్కడ ప్రతి ఒక్కరు కచ్చితంగా సీట్‌బెల్ట్ ధరించే ప్రయాణించాల్సి ఉంటుంది. లేకపోతే.. మొదటి తప్పు కింద 100 పౌండ్ల జరిమానా విధిస్తారు. తర్వాత కూడా అదే తప్పు చేస్తే.. ఆ జరిమానా 500 పౌండ్ల వరకు కూడా వెళ్లే అవకాశం ఉంది.
UK PM Rishi Sunak latest news : ఇంగ్లాండ్‌లో.. ప్రయాణికులు సీట్‌బెల్ట్ వేసుకోవాల్సిందే. వాహనంలో ప్రయాణించాలంటే.. ప్రయాణికుల కనీస వయస్సు 14 ఉండాలి. కొన్ని సందర్భాల్లో మాత్రం మినహాయింపు ఉంటుంది.
సంబంధిత కథనం