King Charles: కేన్సర్ తో బాధ పడుతున్న గ్రేట్ బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-king charles diagnosed with cancer undergoing treatment ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  King Charles: కేన్సర్ తో బాధ పడుతున్న గ్రేట్ బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్

King Charles: కేన్సర్ తో బాధ పడుతున్న గ్రేట్ బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్

HT Telugu Desk HT Telugu
Feb 06, 2024 03:05 PM IST

King Charles: గ్రేట్ బ్రిటన్ రాజుగా బాధ్యతలు స్వీకరించిన కింగ్ చార్లెస్ కేన్సర్ తో బాధపడుతున్నట్లు తేలింది. కింగ్ చార్లెస్ కు కేన్సర్ నిర్ధారణ అయిందని బకింగ్ హామ్ ప్యాలెస్ ప్రకటించింది. కేన్సర్ కు చికిత్స పొందుతున్నందున, ఆయన కొన్ని రోజుల పాటు విధులకు దూరంగా ఉంటారని ప్యాలెస్ ప్రకటించింది.

బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్
బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ (REUTERS)

బ్రిటన్ కింగ్ చార్లెస్ (75) కేన్సర్ బారిన పడ్డారని, దానికి చికిత్స ప్రారంభమైందని బకింగ్ హామ్ ప్యాలెస్ ప్రకటించింది. చికిత్స పొందుతున్న కారణంగా, ఆయన తన అధికారిక విధుల్లో కొన్ని రోజుల పాటు పాల్గొనలేరని ప్యాలెస్ తెలిపింది. అయితే, ఆయనకు సోకింది ఏ రకమైన కేన్సర్ అనే విషయాన్ని ప్యాలెస్ వెల్లడించలేదు. కానీ, ఇది ప్రోస్టేట్ కు సంబంధించిన కేన్సర్ కాదని మాత్రం స్పష్టం చేసింది.

గతంలో ప్రొస్టేట్ సమస్యకు చికిత్స

‘‘ఇటీవల కింగ్ చార్లెస్ (King Charles) ప్రొస్టేట్ ఎన్ లార్జ్ మెంట్ సమస్యకు చికిత్స పొందారు. ఆ సమయంలో ఆందోళన కలిగించే ఒక ప్రత్యేక సమస్యను వైద్యులు గుర్తించారు. ఆ తర్వాత నిర్వహించిన నిర్ధారణ పరీక్షల్లో కేన్సర్ ను గుర్తించాం’’ అని బకింగ్ హామ్ ప్యాలెస్ తన అధికారిక ప్రకటనలో తెలిపింది. అయితే, అది ప్రొస్టేట్ కేన్సర్ కాదని స్పష్టం చేసింది.

చికిత్స ప్రారంభం

కాగా, కేన్సర్ చికిత్స లో భాగంగా కింగ్ చార్లెస్ కు ఈ రోజు ఆసుపత్రిలో పలు పరీక్షలు నిర్వహించారు. చికిత్స పొందే సమయంలో అధికారిక విధులను వాయిదా వేయాలని వైద్యులు ఆయనకు సూచించారని ప్యాలెస్ తెలిపింది. తన ఆరోగ్యంపై వెల్లువెత్తే హాగానాలను నివారించడానికి, అలాగే, ప్రపంచవ్యాప్తంగా కేన్సర్ తో బాధపడుతున్న ప్రజలందరికీ అవగాహన పొందడానికి సహాయపడుతుందనే ఆశతో కింగ్ చార్లెస్ తన అనారోగ్య సమస్యను వెల్లడించాలని నిర్ణయించుకున్నారు’’ అని ప్యాలెస్ ఆ ప్రకటనలో తెలిపింది.

పీఎం రుషి సునక్ స్పందన

కాగా, కింగ్ చార్లెస్ త్వరగా కోలుకోవాలని బ్రిటన్ ప్రధాని రుషి సునక్ ఆకాంక్షించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సునక్ ట్వీట్ చేశారు. ‘‘కింగ్ చార్లెస్ త్వరలోనే పూర్తి బలంతో తిరిగి వస్తాడనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు. దేశం మొత్తం కింగ్ చార్లెస్ కోలుకోవాలని కోరుకుంటోంది’’ అని ట్వీట్ చేశారు. కింగ్ చార్లెస్ కోలుకోవాలని లేబర్ పార్టీ తరఫున ఆకాంక్షిస్తున్నానని యూకే ప్రతిపక్ష లేబర్ పార్టీ నేత కెయిర్ స్టార్మర్ తెలిపారు. ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. తన తల్లి క్వీన్ ఎలిజబెత్ 2 మరణం తరువాత సెప్టెంబర్ 2022 లో బ్రిటన్ చార్లెస్ సింహాసనాన్ని అధిష్టించారు.

Whats_app_banner