Supreme Court : వైద్యుల భద్రతకు నేషనల్ టాస్క్ ఫోర్స్.. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు సీరియస్-supreme court on kolkata doctor rape case will set up national task force of doctors on hospital safety chief justice ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Supreme Court : వైద్యుల భద్రతకు నేషనల్ టాస్క్ ఫోర్స్.. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు సీరియస్

Supreme Court : వైద్యుల భద్రతకు నేషనల్ టాస్క్ ఫోర్స్.. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు సీరియస్

Anand Sai HT Telugu
Aug 20, 2024 12:20 PM IST

Supreme Court On Kolkata Doctor Rape Case : కోల్‌కతా హత్యాచార ఘటనను సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకున్న విషయం తెలిసిందే. విచారణ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది ధర్మాసనం. నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని చెప్పింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై సీరియస్ అయింది.

భారత సుప్రీం కోర్టు
భారత సుప్రీం కోర్టు (HT_PRINT)

కోల్‌కతా ఆసుపత్రిలో వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసును సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ సందర్భంగా విచారణ చేసింది. వైద్యుల భద్రత కోసం జాతీయ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ఎఫ్‌ఐఆర్ దాఖలులో జాప్యం చేసినందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, ఆసుపత్రి పరిపాలనపై కూడా చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం, మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో కూడా చెప్పాలని పేర్కొంది. పశ్చిమ బెంగాల్‌లో శాంతిభద్రతలు కుప్పకూలాయని ఆరోపిస్తూ కోల్‌కతా పోలీస్ చీఫ్‌ను తొలగించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. వక్రబుద్ధితో ఒక యువ వైద్యురాలిపై హత్యాచారం చేయడం దారుణమని ఆయన పేర్కొన్నారు. దీన్ని రాజకీయ సమస్యగా చేయకూడదనుకుంటున్నానని చెప్పారు. తల్లిదండ్రులు వైద్యురాలి మృతదేహం చూసేందుకు 3 గంటలు వేచి ఉన్నారని పేర్కొన్నారు.

నిరసనలను అణిచివేసేందుకు బలప్రయోగం చేయడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై మేం ఆందోళన చెందుతున్నామని, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై ప్రభుత్వం బలప్రయోగం చేయకూడదని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఆర్‌జి కర్ ఆసుపత్రిలో అర్ధరాత్రి విధ్వంసాన్ని ఆపడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన మండిపడ్డారు. ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులోని కీలకమైన మౌలిక సదుపాయాలను ఒక గుంపు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.

'తెల్లవారుజామున నేరం బయటపడిన తరువాత, ప్రిన్సిపాల్ దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించాడు. బాధితురాలి తల్లిదండ్రులను మృతదేహాన్ని చూడటానికి కూడా అనుమతించలేదు. రాత్రి పొద్దుపోయే వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఎఫ్ఐఆర్‌ను ఆలస్యం చేయడం సరికాదు. డాక్టర్లు, మహిళా వైద్యుల భద్రత జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశం. చర్యలు తీసుకోండి. దేశం మరో అత్యాచారం కోసం వేచి ఉండదు. ఆరోగ్య కార్యకర్తలను రక్షించడానికి రాష్ట్రంలో చట్టాలు ఉన్నాయి, కానీ అవి వ్యవస్థాగత సమస్యలను పరిష్కరించవు.' అని సీజేఐ డీవై చంద్రచూడ్ అన్నారు.

మరోవైపు ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయనపై కోల్‌కతా పోలీసులు అవినీతి కేసును నమోదు చేశారు. ఆసుపత్రిలో అవకతవకలు జరిగాయని ఫిర్యాదు అందింది. దీంతో అక్కడి ఆర్థిక వ్యవహారాలను పరిశీలించాని బెంగాల్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. దీనికి అధిపతిగా ఐజీ ప్రవీణ్ కుమార్‌ను నియమించింది. ఒక్క నెలలోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

Whats_app_banner