Sitaram Yechury : వెంటిలేటర్​పై సీతారాం ఏచూరి- దిల్లీ ఎయిమ్స్​ కీలక అప్డేట్​-sitaram yechury on ventilator delhi aiims shares key update ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sitaram Yechury : వెంటిలేటర్​పై సీతారాం ఏచూరి- దిల్లీ ఎయిమ్స్​ కీలక అప్డేట్​

Sitaram Yechury : వెంటిలేటర్​పై సీతారాం ఏచూరి- దిల్లీ ఎయిమ్స్​ కీలక అప్డేట్​

HT Telugu Desk HT Telugu
Sep 06, 2024 11:15 AM IST

Sitaram Yechury health updates : సీపీఎం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీతారం ఏచూరి దిల్లీ ఎయిమ్స్​లోని వెంటిలేటర్​పై ఉన్నారు. అనారోగ్య సమస్యల కారణంగా కొన్ని రోజుల క్రితం ఆయన ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

సీపీఎం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీతారాం ఏచూరి
సీపీఎం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీతారాం ఏచూరి (PTI)

సీపీఎం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, తెలుగు రాష్ట్రాల‌కు సుప‌రిచితులు సీతారాం ఏచూరి వెంటిలేటర్​పై ఉన్నారు. కాగా ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిల‌క‌డ‌గా ఉందని దిల్లీ ఎయిమ్స్​ వైద్యులు చెప్పారు. ఆయ‌న ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్ష‌న్‌తో బాధ‌ప‌డుతూ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే గురువారం ఒక్క‌సారిగా ఆయ‌న ప‌రిస్థితి సంక్లిష్టంగా మార‌డంతో వెంటిలేట‌ర్‌పైకి మార్చి చికిత్స అందించారు. శుక్ర‌వారం ఉద‌యం నాటికి ప‌రిస్థితి కాస్తా మెరుగుప‌డింది.

దిల్లీ ఎయిమ్స్​లో చికిత్స..

శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న సీతారాం ఏచూరి ఆగ‌స్టు 19న ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్‌)లో చేరారు. అప్ప‌టి నుంచి స్పెషలిస్ట్‌ల డాక్టర్ల బృందం ఆయ‌కు వైద్యం అందిస్తున్నారు. ఏడుగురు డాక్ట‌ర్ల బృందం ఆయ‌న‌కు వైద్యం అందిస్తోంది. ఆగ‌స్టు 31న సీపీఎం విడ‌ద‌ల చేసిన బులిటెన్‌లో చికిత్స పొందుతున్న సీతారాం ఏచూరి పరిస్థితి మెరుగవుతోందని తెలిపింది.

సీతారాం ఏచూరి ఆరోగ్య ప‌రిస్థితిపై వ‌చ్చిన మీడియా క‌థ‌నాల‌పై సీపీఎం స్పందించింది. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా సీపీఎం ధృవీక‌రించింది. ఈ మేర‌కు శుక్ర‌వారం సీపీఎం కేంద్ర క‌మిటీ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఏచూరి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నార‌ని, తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో చికిత్స పొందుతున్నార‌ని తెలిపింది. చికిత్సకు సానుకూల స్పందిస్తున్నార‌ని, ఏచూరి ఆరోగ్య‌ పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొంది.

వైద్యానికి ఆయ‌న స‌హ‌క‌రిస్తున్నార‌ని, ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని డాక్ట‌ర్లు తెలిపారు. కొద్దిమేర ప‌రిస్థితి బాగుండ‌టంతో ఆయ‌న‌ను ఎమర్జెన్సీ వార్డు నుంచి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కి మార్చారు. గురువారం వ‌ర‌కు ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉన్న ఆయ‌న‌కు వైద్యం అందిస్తున్నారు. అయితే గురువారం రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో ఒక్క‌సారిగా ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి సంక్లిష్టంగా మారింది. దీంతో ఆయ‌న‌ను వెంటిలేట‌ర్‌పైకి మార్చారు.

సీతారాం ఏచూరికి ఇటీవలే ఎయిమ్స్‌లో కంటి ఆప‌రేష‌న్ కూడా జ‌రిగింది.

తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులు..

కాకినాడ వాసి అయిన ఏచూరి తెలుగు రాష్ట్రాల్లో సుప‌రిచితులు. తెలుగు రాజ‌కీయాల‌పై త‌న పాత్ర‌ను ఎంతో ఉంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో పార్ల‌మెంట్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు జ‌రుగుతున్న అన్యాయంపై గ‌ల‌మెత్తారు. అలాగే తెలంగాణ హ‌క్కుల గురించి కూడా మాట్లాడారు. పార్ల‌మెంట‌రీ రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేసుకున్న సీతారాం ఏచూరి ప్ర‌భుత్వాల ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై ప‌దునైనా విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టేవారు. క‌మ్యూనిస్టుల మ‌హోన్న‌తులైన పీ. సుందరయ్య, ఈఎంఎస్, బీటీఆర్, హరికిషన్ సింగ్ సూర్జిత్, బసవ పున్నయ్య, జ్యోతిబసు వంటి సీనియర్ నాయకులతో సీతారాం ఏచూరి కలిసి పనిచేశారు.

సీతారం ఏచూరి తండ్రి సర్వేశ్వర సోమయాజులు ఏచూరి ఆటోమొబైల్ ఇంజనీర్. ప్రభుత్వ అధికారి అయిన తల్లి కల్పకం ఏచూరి సామాజిక కార్యక్రమాల్లో కూడా పాలుపంచుకున్నారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ‌కు చెందిన వీరు చెన్నైలో నివసిస్తున్నప్పుడు 1952 ఆగస్టు 12న ఏచూరి జన్మించారు. సోమయాజులు ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌లో ఉద్యోగంలో చేరడంతో కుటుంబం హైదరాబాద్‌కు వెళ్లింది. తన తండ్రి తరచూ ట్రాన్స్​ఫర్​ అవ్వడంతో సీతారాం ఏచూరి అమ్మమ్మ దగ్గర పెరిగారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి మోహన్ కందా ఏచూరి మేన‌మామ. ఏచూరి ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు హైద‌రాబాద్‌లోని ఆల్ సెయింట్స్ హై స్కూల్‌లో చదివారు. 1969 నాటి తెలంగాణ ఉద్యమం ఆయనను దిల్లీకి తీసుకువెళ్లింది. దిల్లీలోని ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్ 11వ తరగతి చదువు కొనసాగించారు. ఇంకా అప్ప‌టి నుంచి ఆయ‌న విద్యా, జీవితం, రాజ‌కీయాలు అన్నీ దిల్లీతోనే ముడిప‌డి ఉన్నాయి. పుచ్చ‌ల‌ప‌ల్లి సుంద‌ర‌య్య త‌రువాత సీపీఎం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అయిన రెండో వ్య‌క్తి సీతారాం ఏచూరే.

– జగదీశ్వరరావ్​ జరజాపు

Whats_app_banner

సంబంధిత కథనం