ముచ్చటగా మూడోసారి.. కామ్రేడ్ సీతారాం ఏచూరి
వరుసగా మూడోసారి కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టుకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి ఎన్నికయ్యారు. 2015 ఏప్రిల్‌లో విశాఖలో పార్టీ మహాసభల్లో తొలిసారి పదవికి ఎంపికైన ఏచూరి 2018 ఏప్రిల్ 22న హైదరాబాద్‌లో రెండోసారి ఆ పదవికి ఎన్నికయ్యారు.
కేరళలోని కన్నూరులో జరుగుతున్న 23వ పార్టీ కాంగ్రెస్ సమావేశాల్లో ముచ్చటగా మూడోసారి సీతారాం ఏచూరిని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంది. బీజేపీని ఓడంచడమే తమ లక్ష్యమని సీతారాం ఏచూరి చెప్పారు. హిందుత్వ ఎజెండా అమలు చేస్తోన్న బీజేపీని ఒంటరిని చేయడమే తన ముందున్న కర్తవ్యమన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నా, గణతంత్ర, లౌకిక భావనలు సురక్షితంగా ఉండాలన్నా బీజేపీని మట్టికరిపించడమే పరిష్కారమన్నారు.
గతంలో 2005 నుంచి 2015 వరకు పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు ప్రకాష్ కారత్ నిర్వహించారు. ఇప్పుడు ఏచూరి కూడా వరుసగా మూడోసారి ఆ పదవి బాధ్యతలు చేపట్టారు. సీపీఎం ఆవిర్భావం నుంచి వరుసగా పుచ్చలపల్లి సుందరయ్య, ఈఎంఎస్ నంబూద్రి ప్రసాద్, హరికిషన్ సింగ్, సుర్జిత్, ప్రకాష్ కారట్‌లు ఈ బాధ‌్యతలు నిర్వహించారు.
ఈ పదవి చేపట్టిన ఐదో వ్యక్తి సీతారాం ఏచూరి. దేశ వ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పార్టీలన్ని క్రమంగా బలహీనమవుతున్న నేపథ్యంలో వామపక్షాలతో పాటు భావసారూప్య పక్షాల మధ్య ఐక్యత సాధించాల్సిన బాధ‌్యత ఏచూరిపై ఉంది. పార్టీ పొలిట్ బ్యూరోలోకి 14మంది పాత సభ్యులతో పాటు ముగ్గురు కొత్తవారిని ఎన్నుకున్నారు.
పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారి ఓ దళితుడికి పొలిట్ బ్యూరోలో స్థానం దక్కింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన దళిత నాయకుడు రామచంద్ర డోమ్‌ను పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. 69ఏళ్ల సీతారాం ఏచూరి గరిష్టంగా 75ఏళ్ల వరకు ప్రధాన కార్యదర్శి పదవిలో ఉండేందుకు పార్టీ రాజ్యాంగం అనుమతిస్తుంది.
ఎస్‌ఎఫ్‌ఐతో మొదలుపెట్టి..
చెన్నైలో 1952 ఆగష్టు12న ఏచూరి సర్వేశ్వర సోమయాజి, కల్పకం దంపతులకు సీతారాం జన్మించారు. హైదరాబాద్‌లోని ఆల్ సెయింట్స్ హైస్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్నారు. 1969 తెలంగాణ ఉద్యమం కారణంగా హైదరాబాద్‌లో విద్యాసంస్థలు నిలిచిపోవడంతో ఢిల్లీ వెళ్లి ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్లో సీబీఎస్‌ఈ హయ్యర్ సెకండరీలో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు.
అక్కడే సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో బీఏ ఆనర్స్, జేఎన్‌యూలో ఎంఏ చదువుకున్నారు. 1974లో ఎస్‌ఎఫ్‌ఐతో ఆయన వామపక్ష రాజకీయాలు మొదలయ్యాయి. 1978లో ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ సంయుక్త కార్యదర్శిగా, ఆ తర్వాత అధ్యక్షుడిగా బాధ‌్యతలు నిర్వర్తించారు. కేరళా, పశ్చిమ బెంగాల్లో సైతం సీతారాం ఏచూరి ఎస్‌ఎఫ్‌ఐ బాధ‌్యతలు నిర్వహించారు. 2005, 11లలో బెంగాల్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.