CBSE: ఆ రెండు తరగతులు మినహాయించి.. మిగతా క్లాస్ లకు సిలబస్ లో ఎలాంటి మార్పు లేదు: సీబీఎస్ఈ స్పస్టీకరణ
CBSE: వివిధ తరగతుల సిలబస్ లో మార్పులు చేస్తున్నారన్న వార్తలపై సీబీఎస్ఈ మరోసారి స్పందించింది. వచ్చే ఏడాది 3, 6 తరగతులు మినహా అన్ని తరగతులకు ప్రస్తుత పాఠ్యప్రణాళిక కొనసాగుతుందని సీబీఎస్ఈ స్పష్టం చేసింది. పాఠ్యపుస్తకాలలో కూడా ఎలాంటి మార్పులు ఉండవని సీబీఎస్ఈ పునరుద్ఘాటించింది.
CBSE: వచ్చే ఏడాది 3, 6 తరగతులు మినహా అన్ని తరగతులకు ప్రస్తుతం ఉన్న పాఠ్యప్రణాళిక కొనసాగుతుందని సీబీఎస్ఈ స్పష్టం చేసింది. పాఠ్యపుస్తకాలలో కూడా ఎలాంటి మార్పులు ఉండవని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పునరుద్ఘాటించింది.
అదే సిలబస్, అవే బుక్స్
అన్ని సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలలు గత విద్యా సంవత్సరం (2023-24) మాదిరిగానే ఇతర తరగతులకు కూడా అదే సిలబస్ తో, అవే పాఠ్యపుస్తకాలను ఉపయోగించడం కొనసాగించాలని మరోసారి ఆదేశించింది. ఈ మేరకు సీబీఎస్ఈ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. 3, 6 తరగతులకు సంబంధించి కొత్త సిలబస్, పాఠ్యపుస్తకాలు ప్రస్తుతం రూపొందిస్తున్నామని, త్వరలో వాటిని విడుదల చేస్తామని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) సీబీఎస్ఈకి ఈ మార్చి నెలలో ఒక లేఖ ద్వారా తెలియజేసింది.
3 వ తరగతి, 6 వ తరగతికి మాత్రం వేరే బుక్స్
3, 6 తరగతులకు 2023 వరకు ఎన్సీఈఆర్టీ ప్రచురించిన పాఠ్యపుస్తకాల స్థానంలో ఈ కొత్త సిలబస్ ను, పాఠ్యపుస్తకాలను పాఠశాలలు అనుసరించాలని సూచించింది. అదనంగా, ఎన్సీఎఫ్-ఎస్ఈ 2023 కు అనుగుణంగా కొత్త బోధనా పద్ధతులు, అధ్యయన రంగాలకు ఉపాధ్యాయులను, విద్యార్థులను సిద్ధం చేయాలని సూచించింది. అందుకోసం 6 వ తరగతికి బ్రిడ్జ్ కోర్సు, 3 వ తరగతికి సంక్షిప్త మార్గదర్శకాలను ఎన్సీఈఆర్టీ అభివృద్ధి చేస్తోంది. ‘‘2024 ఏప్రిల్ 1 నుండి ప్రారంభమైన 2024-25 విద్యా సంవత్సరానికి 3వ తరగతి, 6వ తరగతి మినహాయించి మిగతా క్లాస్ లకు పాఠ్యప్రణాళిక, పాఠ్యపుస్తకాలలో ఎటువంటి మార్పులు ఉండవు" అని సీబీఎస్ఈ తెలిపింది.
9 నుంచి 12వ తరగతి వరకు
9 నుంచి 12వ తరగతి వరకు వార్షిక పాఠ్యప్రణాళిక, అకడమిక్ కంటెంట్, అభ్యసన ఫలితాలతో కూడిన పరీక్షలకు సిలబస్, బోధనా పద్ధతులు, మూల్యాంకన మార్గదర్శకాలను అందిస్తామని బోర్డు పేర్కొంది. సీబీఎస్ఈ (CBSE) ఆమోదించిన నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్ వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ (NCF-SE) 2023 ఆధారంగా ఈ మార్గదర్శకాలను రూపొందించారు. ఎన్సీఎఫ్-ఎస్ఈ-2023లో పేర్కొన్న సిఫార్సులకు అనుగుణంగా పాఠశాలలు తమ పద్ధతులను మార్చుకోవాలని సీబీఎస్ఈ సూచించింది. కంటెంట్, బోధనా వ్యూహాలు, మూల్యాంకన పద్ధతులు, బోర్డు ఎప్పటికప్పుడు తెలియజేసే ఇతర సంబంధిత అంశాలకు సంబంధించిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది.
ఈ వెబ్ సైట్ లో అన్ని వివరాలు
2024-25 సంవత్సరానికి సంబంధించిన సిలబస్ 'www.cbseacademic.nic.in' వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని, 2024-25 సంవత్సరానికి 9 నుంచి 12 తరగతుల పాఠ్యప్రణాళికను సెకండరీ స్కూల్ కరిక్యులమ్, సీనియర్ సెకండరీ స్కూల్ కరిక్యులమ్ (CBSE Academic curriculum) లింక్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చని బోర్డు పేర్కొంది.