NCERT new syllabus: ఈ తరగతులకు కొత్త సిలబస్, కొత్త పుస్తకాలను విడుదల చేయనున్న ఎన్సీఈఆర్టీ-ncert to release new syllabus text books for classes 3 and 6 cbse ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ncert New Syllabus: ఈ తరగతులకు కొత్త సిలబస్, కొత్త పుస్తకాలను విడుదల చేయనున్న ఎన్సీఈఆర్టీ

NCERT new syllabus: ఈ తరగతులకు కొత్త సిలబస్, కొత్త పుస్తకాలను విడుదల చేయనున్న ఎన్సీఈఆర్టీ

HT Telugu Desk HT Telugu
Mar 23, 2024 04:49 PM IST

NCERT: త్వరలో 3 వ తరగతి, 6వ తరగతి విద్యార్థులకు కొత్త సిలబస్ ను, కొత్త పాఠ్య పుస్తకాలను విడుదల చేయనున్నట్లు ఎన్సీఈఆర్టీ ప్రకటించింది. మిగతా తరగతుల సిలబస్ లో కానీ, టెక్ట్స్ బుక్స్ లో కానీ ఎలాంటి మార్పులు లేవని వెల్లడించింది. 2022 లోనే 6 నుండి 12 తరగతులకు సిలబస్ ను NCERT హేతుబద్ధీకరించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

3వ తరగతి, 6వ తరగతి విద్యార్థులకు మాత్రమే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) త్వరలో కొత్త సిలబస్ ను, పాఠ్యపుస్తకాలను విడుదల చేయనుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) వెల్లడించింది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇతర తరగతుల పాఠ్యాంశాలు, పాఠ్యపుస్తకాల్లో ఎలాంటి మార్పులు ఉండవని తన అనుబంధ పాఠశాలలకు సీబీఎస్ఈ అధికారిక సమాచారం ఇచ్చింది.

3, 6 తరగతులకు మాత్రమే..

సిలబస్, టెక్ట్స్ బుక్స్ లో మార్పు కేవలం 3వ తరగతి, 6వ తరగతి విద్యార్థులకు మాత్రమేనని సీబీఎస్ఈ స్పష్టం చేసింది. ప్రస్తుతం మూడు, ఆరో తరగతులకు సంబంధించి కొత్త సిలబస్, పాఠ్యపుస్తకాలను రూపొందించే ప్రక్రియ చివరి దశకు వచ్చిందని ఎన్సీఈఆర్టీ (NCERT) వెల్లడించింది. ఈ వివరాలను తన అనుబంధ పాఠశాలలకు సీబీఎస్సీ (CBSE) అధికారికంగా సమాచారం పంపించింది. మూడో తరగతి, ఆరో తరగతి విద్యార్థులకు త్వరలో నిర్ణయించనున్న కొత్త సిలబస్, కొత్త పాఠ్య పుస్తకాల ప్రకారమే విద్యా బోధన జరపాలని స్పష్టం చేసింది.

జాతీయ విద్యావిధానం

నూతన జాతీయ విద్యావిధానం (NEP) అమలులో భాగంగా పలు విప్లవాత్మక చర్యలు ప్రారంభించారు. పాఠశాల విద్య కోసం కొత్త జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్ వర్క్ (national curriculum framework for school education NCF-SE) 2023 కు అనుగుణంగా ఎన్సీఈఆర్టీ కొత్త సిలబస్ ను, కొత్త టెక్ట్స్ బుక్స్ ను సిద్ధం చేస్తోంది. విద్యార్థులపై కంటెంట్ లోడ్ ను తగ్గించడానికి 2022 లో 6 నుండి 12 తరగతుల విద్యార్థులకు సిలబస్ ను ఎన్సీఈఆర్టీ (NCERT) హేతుబద్ధీకరించింది.

ఆరో తరగతికి బ్రిడ్జి కోర్సు

ఆరో తరగతికి బ్రిడ్జి కోర్సు, మూడో తరగతికి సంక్షిప్త మార్గదర్శకాలను ఎన్సీఈఆర్టీ అభివృద్ధి చేస్తోంది. విద్యార్థులు కొత్త బోధనా పద్ధతులు, అధ్యయన రంగాలకు మారడానికి వీలుగా ఎన్సీఈఆర్టీ అభివృద్ధి చేస్తున్న వనరులను త్వరలోనే అన్ని పాఠశాలలకు అందిస్తామని సీబీఎస్ఈ (CBSE) తెలిపింది. ఎన్సీఎఫ్-ఎస్ఈ-2023 (NCF-SE 2023) లో పేర్కొన్న సిఫార్సులకు అనుగుణంగా పాఠశాలలు తమ బోధనా పద్ధతులను మార్చుకోవాలని సీబీఎస్ఈ సూచించింది. కంటెంట్, బోధనా వ్యూహాలు, మూల్యాంకన పద్ధతులు మొదలైనవాటికి సంబంధించిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది.

Whats_app_banner