Kamala Harris: భారత్​తో కమలా హారిస్​కి ఉన్న కనెక్షన్​ ఏంటి? అమెరికా తొలి అధ్యక్షురాలు అవ్వగలరా?-meet kamala harris who will replace biden whats her indian connection ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Kamala Harris: భారత్​తో కమలా హారిస్​కి ఉన్న కనెక్షన్​ ఏంటి? అమెరికా తొలి అధ్యక్షురాలు అవ్వగలరా?

Kamala Harris: భారత్​తో కమలా హారిస్​కి ఉన్న కనెక్షన్​ ఏంటి? అమెరికా తొలి అధ్యక్షురాలు అవ్వగలరా?

Sharath Chitturi HT Telugu
Jul 22, 2024 08:59 AM IST

ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అధ్యక్ష రేసులో డెమొక్రటిక్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. కమలా హారిస్​కి భారత్​కు ఉన్న కనెక్షన్​ ఏంటి? ఇక్కడ తెలుసుకోండి..

కమలా హారిస్​
కమలా హారిస్​

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించారు ప్రస్తుత ప్రెసిడెంట్​ జో బైడెన్​. ఈ నేపథ్యంలో ఇప్పుడు అగ్రరాజ్య రాజకీయాల ఫోకస్​ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్​పై పడింది. నవంబర్​లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్​ పార్టీ తరఫున అభ్యర్థింగా కమలా హారిస్​కు మద్దతిచ్చారు జో బైడెన్​. ఈ నేపథ్యంలో అసలు ఎవరు ఈ కమలా హారిస్​? భారత్​తో ఆమెకు ఉన్న కనెక్షన్​ ఏంటి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ఎవరు ఈ కమలా హారిస్?

కమలా దేవి హారిస్ కాలిఫోర్నియాలో తమిళ జీవశాస్త్రవేత్త శ్యామా గోపాలన్, జమైకా-అమెరికన్ తండ్రి ప్రొఫెసర్​ డోనాల్డ్ జె హారిస్​కు జన్మించారు. కమలా హారిస్​ ఒక భారత సంతతి మహిళగా గుర్తింపు తెచ్చుకున్నారు.

తన తల్లిదండ్రుల విడాకుల తరువాత, కమలా హారిస్ తన తల్లి, సోదరితో కలిసి జీవించారు. ఆమె తన బ్యాచిలర్ డిగ్రీ కోసం చారిత్రాత్మక ఆల్ బ్లాక్ కళాశాల అయిన హోవార్డ్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు.

కమలా హారిస్​కు పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్​లో డిగ్రీ పట్టా పొంది. ఆ తర్వాత న్యాయశాస్త్రంలో చేరారు, 1990 లో బార్ అసోసియేషన్ సభ్యురాలిగా మారారు. అదే ఏడాది కాలిఫోర్నియాలో డిప్యూటీ డిస్ట్రిక్ట్ అటార్నీగా తన వృత్తిని ప్రారంభించారు.

2003లో శాన్​ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీగా ఎన్నికయ్యారు ప్రస్తుత ఉపాధ్యక్షురాలు. 2010, 2014లో కాలిఫోర్నియాకు ఎన్నికైన అటార్నీ జనరల్​గా రెండు పర్యాయాలు పనిచేశారు. 2017లో ఆమె తన రాష్ట్రం నుంచి జూనియర్ యూఎస్ సెనేటర్ అయ్యారు.

పన్ను, ఆరోగ్య సంస్కరణలు, వలసదారులకు పౌరసత్వం, తుపాకీ నియంత్రణ చట్టాల మీద ప్రచారాలతో ఆమె మంచి వెలుగులోకి వచ్చారు.

సెనేట్​లో పనిచేసిన రెండో ఆఫ్రికన్ అమెరికన్, తొలి ఆగ్నేయాసియా మహిళగా ఆమె గుర్తింపు పొందారు.

2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన కమలా హారిస్​, జో బైడెన్​కు మద్దతుగా రేసు నుంచి తప్పుకున్నారు. అనంతరం ఆయన పాలనలో ఉపాధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు.

భారత సంతత మహిళ- చరిత్ర సృష్టించగలరా?

ఆగస్ట్​లో జరగనున్న ఈవెంట్​లో డెమొక్రాట్లు తమ అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. కమలా హారిస్ ఈ నామినేషన్​లో గెలిస్తే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి భారత సంతతి మహిళగా చరిత్ర సృష్టిస్తారు. అంతేకాకుండా, అధ్యక్ష ఎన్నికల్లో ఆమె విజయం సాధిస్తే, దేశానికి మొదటి భారతీయ సంతతి మహిళ సహా అమెరికా తొలి అధ్యక్షురాలు అవుతారు!

రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ సతీమణి భారతీయురాలు కావడం, వలస ఓటర్లను ఆకట్టుకోవడంలో భారత సంతతి మహిళగా కమలా హారిస్​కి ఉన్న గుర్తింపు రానున్న ఎన్నికల్లో పెద్ద పాత్ర పోషించనుంది.

కమలా హారిస్ తన పార్టీ నుంచి నామినేషన్ గెలుచుకున్నప్పటికీ అధ్యక్ష పదవిని చేపట్టడం అంత సులభం కాదు. ఇందుకు కారణం డొనాల్డ్​ ట్రంప్​! రిపబ్లికెన్​ పార్టీ అభ్యర్థి డొనాల్డ్​ ట్రంప్​.. డెమొక్రాట్లకు ఈసారి గట్టిపోటీనిస్తున్నారు.

"అమెరికా అధ్యక్ష రేసులో నిలిచేందుకు అధ్యక్షుడి ఆమోదం పొందడం గౌరవంగా ఉంది," అని కమలా హారిస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆమెకు కౌంటర్​ ఇస్తూ.. “జో బైడెన్​ కన్నా కమలా హారిస్​ను ఓడించడమే చాలా సులభం,” అని ట్రంప్​ తెలిపారు.

Whats_app_banner