Joe Biden : అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి జో బైడెన్​ ఔట్​.. అసలు కారణం ఇదే!-why did joe biden exit 2024 us presidential race what led to this decision ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Joe Biden : అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి జో బైడెన్​ ఔట్​.. అసలు కారణం ఇదే!

Joe Biden : అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి జో బైడెన్​ ఔట్​.. అసలు కారణం ఇదే!

Sharath Chitturi HT Telugu
Jul 22, 2024 06:59 AM IST

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి వైదొలిగినట్టు జో బైెడన్​ ప్రకటించారు. రేసు నుంచి తప్పుకోవాలని ఆయనపై ఒత్తిడి పెరిగిందన్న విషయం తెలిసిందే.

జో బైడెన్
జో బైడెన్

ఊహించినదే జరిగింది! అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి జో బైడెన్​ తప్పుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. నవంబర్​లో జరగనున్న ఎన్నికల్లో డెమొక్రటిక్​ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్​కు జో బైడెన్​ మద్దతిచ్చారు.

డొనాల్డ్ ట్రంప్​నకు వ్యతిరేకంగా బైడెన్​ పేలవమైన డిబేట్ ప్రదర్శన కనబరచడం, దేశాధ్యక్షుడిగా మరో దఫా పూర్తి చేయలేరన్న రిపబ్లికన్ పార్టీ విమర్శల మధ్య అధ్యక్ష రేసు నుంచి వైదొలగాలని జో బైడెన్ నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్ష అభ్యర్థిగా జో బైడెన్ వైదొలగాలని పలువురు డెమోక్రాట్ చట్టసభ సభ్యులు సైతం డిమాండ్ చేశారు.

అధ్యక్ష ఎన్నికల నుంచి వైదొలగాలని ఆయన నిర్ణయం తీసుకున్న అనంతరం ఆ విషయాన్ని తొలుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్​కి వెల్లడించారని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. శ్వేతసౌధం చీఫ్ ఆఫ్ స్టాఫ్ జెఫ్ జియెంట్స్, బైడెన్​ ప్రచార సారథి జెన్ ఓ మాలీ డిల్లాన్​తో ఆయన ముఖాముఖి భేటీ అయిన అనంతరం ప్రకటన వెలువడింది.

స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 1:45 గంటలకు జో బైడెన్ ప్రచార సిబ్బంది, వైట్​హౌజ్​ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి, అమెరికా అధ్యక్షుడు తన నిర్ణయాన్ని వారికి వివరించారు. ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు చీఫ్ ఆఫ్ స్టాఫ్ మొత్తం వైట్ హౌస్ సిబ్బందికి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చేశారు.

వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం.. శ్వేతసౌధం కౌన్సిలర్ స్టీవ్ రిచెట్టి, సీనియర్ ప్రచార సలహాదారు మైక్ డోనిలాన్, డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అనీ టొమాసిని, ప్రథమ మహిళ సీనియర్ సలహాదారు ఆంథోనీ బెర్నాల్​తో వారాంతంలో పలుమార్లు చర్చలు జరిపారు.

అధ్యక్ష ఎన్నికలకు ముందు జరిగే ‘డిబేట్స్​’ని అత్యంత కీలకంగా పరిగణిస్తారు. అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశించే సత్తా వీటికి ఉంటాయి. జూన్ 27న డోనాల్డ్ ట్రంప్​తో జరిగిన డిబేట్​లో బైడెన్​ పేలవమైన ప్రదర్శన చేశారు. ఓటమి తర్వాత అమెరికా అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలని జో బైడెన్​పై ఒత్తిడి పెరిగింది. తన పేలవ ప్రదర్శనకు.. జెట్ లాగ్, అంతర్జాతీయ ప్రయాణాలు కారణామని అమెరికా అధ్యక్షుడు చెప్పుకొచ్చారు. కానీ ఆయన దిగిపోవాలని డిమాండ్​లు వెల్లువెత్తాయి.

గత వారం రోజులుగా బైడెన్ ప్రచారంపై వ్యతిరేకత ఊపందుకుంది. రేసు నుంచి తప్పుకోవాలని 36 మంది కాంగ్రెస్ డెమోక్రాట్లు బహిరంగంగానే డిమాండ్​ చేశారు.

బైడెన్​ ఎన్నికల రేసు నుంచి తప్పుకోకపోతే.. ఉభయ సభలపై డెమొక్రాట్ల పట్టు కచ్చితంగా తగ్గిపోతుందని సొంత పార్టీలోనే అభిప్రాయాలు వెలువడ్డాయి.

బైడెన్ చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారని, శనివారం రాత్రి వరకు రేసు నుంచి తప్పుకునే ఉద్దేశం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. అమెరికా అధ్యక్షుడు తన ఉన్నత సలహాదారులతో పలుమార్లు సమావేశమైన తర్వాత ఆదివారం మధ్యాహ్నం మనసు మార్చుకుని.. అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.

ఆగస్ట్​లో జరిగే ఈవెంట్​లో డెమొక్రాట్లు తమ అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. కమలా హారిస్​ కచ్చితంగా అధ్యక్ష అభ్యర్థి అవుతారని డెమొక్రాట్లలో చాలా మంది విశ్వసిస్తున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం