Haryana Election Result : హర్యానాలో ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఎందుకు విఫలమైంది?
Haryana Election Result 2024 : హర్యానా ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. కాంగ్రెస్‌కు ఊహించని దెబ్బ తగిలినట్టుగా అయింది. నిజానికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను కూడా కాంగ్రెస్ తనకు అనుకూలంగా మార్చుకోలేక పోయిందని వాదనలు ఉన్నాయి.
హర్యానాలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. అక్టోబర్ 8న ఉదయం కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల్లో సంబరాలు చేసుకున్నారు. కానీ రెండు గంటల్లోనే సీన్ రివర్స్ అయింది. కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత కాంగ్రెస్ హవా కనిపించింది. తర్వాత బీజేపీ పుంజుకుంది. సీన్ అంతా తారుమారు అయింది. ఈ విషయాన్ని ఎవరూ ఊహించలేదు. రౌండ్ రౌండ్‌కి ఫలితం మారిపోయింది. దీంతో మ్యాజిక్ ఫీగర్ కంటే ఎక్కువలో బీజేపీ కొనసాగుతోంది.
90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 36 సీట్లు, భారతీయ జనతా పార్టీ 49 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఈ రాష్ట్రంలో మెజారిటీ మార్క్ 46 సీట్లు. బీజేపీ ఈజీగా మ్యాజిక్ ఫిగర్ దాటేసేలా ఉంది. హర్యానాలో కాంగ్రెస్, బీజేపీ మధ్య ఊహించినదానికంటే ఎక్కువే ఉంది. అయితే ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా.. కాంగ్రెస్ ఆ అస్త్రాన్ని సరిగా పట్టుకోలేకపోయిందనే విమర్శలు ఉన్నాయి. దీంతో మళ్లీ బీజేపీ అధికారం దిశగా వెళ్తోంది.
మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భూపిందర్ సింగ్ హుడాపై చాలా ఎక్కువగా ఆధారపడింది హస్తం పార్టీ. అది ఫలించలేదు. జాట్‌లు, దళితులు, ముస్లింల ఓట్లు కలిసి రాష్ట్రంలో విజయం సాధిస్తాయని కాంగ్రెస్ విశ్వసించింది. కానీ జాట్‌యేతర, ముస్లిమేతర ఓట్లలో బీజేపీ తన ఓట్లను పటిష్టంగా ఉంచుకుంది. పెద్దగా ఓట్లు చీలకుండా ప్రణాళికలు వేసింది. ఇంకా జాట్‌యేతర ఇతర వెనుకబడిన తరగతుల (OBC) ఓట్లను ఏకీకృతం చేయాలనే పార్టీ ప్రణాళిక కోసం పని చేసింది.
తూర్పు, దక్షిణ హర్యానాలోని జాట్‌యేతర ప్రాంతాల్లో బీజేపీ తన బలాన్ని నిలుపుకున్నట్లు కనిపిస్తోంది. జాట్-ఆధిపత్యం ఉన్న పశ్చిమ హర్యానాలో ఇది చాలా బాగా పనిచేసింది. ఇక్కడ జాట్‌యేతర ఓట్లు బీజేపీకి పెద్ద సంఖ్యలో కలిసివచ్చినట్లు అర్థమవుతోంది.
బీజేపీ అధికార వ్యతిరేకతను కాంగ్రెస్ గుర్తించింది. దానికి తగ్గట్టుగా ప్రణాళికలతో ముందుకు వెళ్లింది. కానీ భూపిందర్ సింగ్ హుడా, కుమారి సెల్జాల మధ్య అంతర్గత పోరుకు కాంగ్రెస్ చెక్ పెట్టలేకపోయింది. అంతర్గతంగా జరిగిన ఉద్రిక్తతలు కూడా పార్టీ గెలుపు అవకాశాలను తగ్గించినట్టుగా కనిపిస్తున్నాయి. బీజేపీ చేసినంత ఐక్యంగా ఎన్నికల్లో పోటీ చేయలేదు కాంగ్రెస్. అనేక మంది రెబల్స్ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేశారు. ఇలాంటి కారణాలతో హర్యానాలో గెలుపునకు దగ్గరకు వచ్చి ఆగిపోయింది హస్తం పార్టీ.