
Assembly election results live updates : ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు- బీజేపీదే హరియాణా!
- Haryana Assembly election results : హరియాణాతో పాటు జమ్ముకశ్మీర్ ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. లైవ్ అప్డేట్స్ కోసం హెచ్‌టీ తెలుగు పేజ్ని ఫాలో అవ్వండి..
Tue, 08 Oct 202403:32 PM IST
హర్యానా ఎన్నికల్లో ‘జిలేబీ’ పిట్టకథ ఏంటి? దీనికి రాహుల్ గాంధీకి ఏంటి సంబంధం?
తుది హర్యానా, జమ్ముకశ్మీర్ ఎన్నికల ఫలితాలను ప్రకటించడానికి ఎన్నికల సంఘం మంగళవారం ఓట్లను లెక్కిస్తున్న సమయంలో 'జిలేబీ విప్లవం' సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్ ను ట్రోల్ చేయడానికి సోషల్ మీడియా యూజర్లు "జిలేబీ" ట్రెండ్ ను ఉపయోగిస్తున్నారు. 'జిలేబీ'కి, హర్యానా ఎన్నికలకు, కాంగ్రెస్ ఓటమికి సంబంధం ఏమిటని ఆలోచిస్తున్నారా? ఈ కింది లింక్ ను ఓపెన్ చేయండి..
Tue, 08 Oct 202401:52 PM IST
హరియాణా ప్రజలకు ప్రధాని మోదీ సందేశం
2024 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మరోసారి స్పష్టమైన మెజారిటీ ఇచ్చిన హర్యానా ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ కృతజ్ఞతలు తెలిపారు. 'భారతీయ జనతా పార్టీకి మరోసారి స్పష్టమైన మెజారిటీ ఇచ్చినందుకు హర్యానా ప్రజలకు సెల్యూట్ చేస్తున్నాను. ఇది అభివృద్ధి, సుపరిపాలన రాజకీయాల విజయం. వారి ఆకాంక్షలను నెరవేర్చడానికి మేము ఏ మాత్రం వెనకడుగు వేయబోమని నేను ఇక్కడి ప్రజలకు హామీ ఇస్తున్నాను" అని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ లో హిందీలో పోస్ట్ చేశారు. ఈ గొప్ప విజయం కోసం అవిశ్రాంతంగా, పూర్తి అంకితభావంతో పనిచేసిన బీజేపీ కార్యకర్తలందరికీ మోదీ అభినందనలు తెలిపారు.
Tue, 08 Oct 202412:43 PM IST
గుర్ గ్రామ్ లో బీజేపీ క్లీన్ స్వీప్
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను, కాంగ్రెస్ ఆశలను తలకిందులు చేస్తూ హరియాణాలో బీజేపీ విజయం సాధించింది. అలాగే, కాషాయ పార్టీకి కంచుకోటగా భావించే గుర్ గ్రామ్ జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాలను కూడా అలవోకగా గెలుచుకుంది. గుర్ గ్రామ్ జిల్లాలోని పటౌడీ, గుర్గావ్, సోహ్నా, బాద్షాపూర్ సీట్లలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు.
Tue, 08 Oct 202412:21 PM IST
‘‘హర్యానా రిజల్ట్స్ ను ఒప్పుకోం; ఈవీఎంలపై అనుమానం’’: కాంగ్రెస్
హర్యానా ఎన్నికల ఫలితాలను తాము అంగీకరించబోమని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. క్షేత్ర స్థాయి పరిస్థితులకు వ్యతిరేకంగా ఫలితాలు ఉన్నాయని పేర్కొంది. ఈసీఐ వెబ్సైట్లో ఎన్నికల డేటా అప్డేట్ మందకొడిగా ఉందని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రధానంగా మూడు జిల్లాల్లో ఈవీఎంల పనితీరుపై అనుమానాలు ఉన్నాయని తెలిపింది.
Tue, 08 Oct 202411:33 AM IST
రెండు సీట్లలో ఒమర్ అబ్దుల్లా విజయం
నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అసెంబ్లీ ఎన్నికల్లో సెంట్రల్ కశ్మీర్ లోని బుద్గాం, గండేర్ బల్ నియోజకవర్గాల నుంచి విజయం సాధించారు. ఒమర్ అబ్దుల్లా బుడ్గామ్ స్థానం నుంచి 18,485 ఓట్ల తేడాతో గెలుపొందగా, గందర్బల్లో 10,346 ఓట్ల ఆధిక్యం లభించింది.
Tue, 08 Oct 202401:52 PM IST
అయ్యో ఆప్.. హరియాణాలో మొత్తం 90 సీట్లలో పోటీ; కానీ..
ఆమ్ ఆద్మీ పార్టీ హరియాణాలో ఘోర పరాజయం మూట గట్టుకుంటోంది. పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సొంత రాష్ట్రమైన హరియాణాలో ఆప్ మొత్తం 90 సీట్లలో పోటీ చేసినప్పటికీ.. కనీసం ఒక్క స్థానంలోనూ విజయం సాధించే పరిస్థితి లేదు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం ఆప్ సాధించింది కేవలం 1.76% ఓట్లు మాత్రమే. అంతేకాదు, మెజారిటీ స్థానాల్లో డిపాజిట్ కోల్పోతోంది.
Tue, 08 Oct 202409:23 AM IST
జమ్మూకశ్మీర్ లోనూ ఖాతా తెరిచిన ఆమ్ ఆద్మీ పార్టీ
అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ జమ్మూకశ్మీర్ లో ఖాతా తెరిచింది. దోడా అసెంబ్లీ నియోజకవర్గంలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. ఆప్ అభ్యర్థి మెహరాజ్ మాలిక్ బీజేపీ అభ్యర్థి గజయ్ సింగ్ రాణాపై విజయం సాధించారు. స్థానికంగా మంచి పేరున్న మాలిక్ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలను ఎదుర్కొనేందుకు ముమ్మరంగా ప్రచారం చేశారు. మాలిక్ కు నిర్మొహమాటంగా మాట్లాడే నాయకుడిగా పేరుంది.
Tue, 08 Oct 202409:19 AM IST
పీడీపీకి పీడకలగా జమ్ముకశ్మీర్ ఫలితాలు
ఒకప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పీడీపీకి జమ్మూకశ్మీర్ ఎన్నికల ఫలితాలు పీడకలగా మారాయి. మొత్తం 90 స్థానాలకు గానూ పట్టుమని 5 సీట్లలో కూడా పీడీపీ గెలిచే పరిస్థితి కనిపించడం లేదు. ఏకంగా, పీడీపీ ఛీఫ్ మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా మెహబూబా శ్రీగుప్వారా-బిజ్బెహరా స్థానంలో 9,778 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి మెజారిటీ మార్కును దాటుతుందని ఎన్నికల సంఘం తాజా ట్రెండ్స్ చెబుతున్నాయి. ఈ కూటమికి భారతీయ జనతా పార్టీ గట్టి పోటీ ఇస్తోంది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల వరకు నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి 47 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 29 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, పీడీపీ 1 స్థానంలో విజయం సాధించి కేవలం 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
Tue, 08 Oct 202411:33 AM IST
హరియాణాలో ఓటమి దిశగా దేవీలాల్ మనవడు
హరియాణాలోని దబ్వాలీ నియోజకవర్గం నుంచి ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డీ) అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ప్రధాని దేవీలాల్ మనవడు ఆదిత్య దేవీలాల్ ఓటమి దిశగా పయనిస్తున్నారు. ఆయనపై దేవీలాల్ దూరపు బంధువు దిగ్విజయ్ సింగ్ చౌతాలా దాదాపు 10 వేల ఆధిక్యతతో కొనసాగుతున్నారు. ఆదిత్యా దేవి లాల్ తండ్రి జగదీష్ చౌతాలా, దేవీలాల్ చిన్న కుమారుడు.
Tue, 08 Oct 202408:43 AM IST
సోపోర్ నియోజకవర్గంలో అఫ్జల్ గురు సోదరుడి వెనుకంజ
పార్లమెంటుపై దాడి కేసులో దోషి అయిన అఫ్జల్ గురు సోదరుడు, స్వతంత్ర అభ్యర్థి ఐజాజ్ అహ్మద్ గురు ఉత్తర కాశ్మీర్ లోని సోపోర్ నియోజకవర్గంలో 16753 ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి ఇర్షాద్ రసూల్ కర్ ఈ స్థానం నుంచి ఐజాజ్ అహ్మద్ గురుకు గట్టి పోటీ ఇస్తున్నారు.
Tue, 08 Oct 202407:49 AM IST
వినేశ్ ఫోగట్ విజయం..!
హరియాణా కాంగ్రెస్ అభ్యర్థి, ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫోగట్ విజయం ఖరారైంది! జులానాలో సమీప బీజేపీ అభ్యర్థిపై ఆమె దాదాపు 60వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.
Tue, 08 Oct 202407:30 AM IST
బీజేపీపై కాంగ్రెస్ విమర్శలు..
భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) వెబ్సైట్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అప్డేట్ నెమ్మదించిందని కాంగ్రెస్ ఆరోపించింది.
“లోక్‌సభ ఎన్నికల మాదిరిగానే హరియాణాలో కూడా ఈసీఐ వెబ్సైట్లో అప్డేటెడ్ ట్రెండ్స్ అప్లోడ్ చేయడం నెమ్మదిస్తోంది. కాలం చెల్లిన, తప్పుదోవ పట్టించే ధోరణులను @ECISVEEP పంచుకోవడం ద్వారా బీజేపీ.. ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తోందా?” అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్
Tue, 08 Oct 202407:04 AM IST
ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు..
హరియాణా ఎన్నికల్లో విజయం ఖాయమని భావించిన కాంగ్రెస్ ఓటమి ముంగిట నిలపడింది. మరోవైపు ఎన్నికల సైట్లో ఫలితాలు అప్డేట్ అవ్వడానికి ఆలస్యమవుతోందని ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.
Tue, 08 Oct 202406:24 AM IST
జమ్ముకశ్మీర్‌లో కాంగ్రెస్ కూటమి హవా..
జమ్ముకశ్మీర్‌లో కాంగ్రెస్- ఎన్సీ కూటమి హవా స్పష్టంగా కనిపిస్తోంది. హంగ్ ఏర్పడుతుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చూస్తూ.. ఈ కూటమి 52 చోట్ల లీడింగ్‌లో ఉంది. బీజేపీ 26 సీట్లకే పరిమితమైంది. ఇతరులు 8 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. 90 సీట్లున్న జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో మెజారిటీ మార్క్ 46.
Tue, 08 Oct 202405:43 AM IST
ఆటాడుకుంటున్న ఫలితాలు..!
హరియాణాలో ఎన్నికల ఫలితాలు ఓ ఆట ఆడుకుంటున్నాయి. ఉదయం లీడింగ్‌లో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు వెనకంజలో ఉంది. ఫలితంగా.. పార్టీ కార్యాలయంలో అప్పటివరకు కనిపించిన సంబరాలు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఇటు ఉదయం చాలా సమయం వరకు బోసిపోయిన బీజేపీ కార్యాలయంలో ఇప్పుడు సంబరాలు మొదలయ్యాయి.
Tue, 08 Oct 202405:21 AM IST
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు!
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మరోమారు తారుమారయ్యాయి. హరియాణాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్పిన దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పూర్తిస్థాయిలో విఫలమయ్యాయి. 10ఏళ్లుగా ఇక్కడ అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు 47 చోట్ల లీడింగ్‌లో ఉంది. కాంగ్రెస్ కేవలం 35 స్థానాల్లోనే ముందంజలో ఉంది. ఇతరులు 8 చోట్ల ముందు ఉన్నారు. 90 సీట్లున్న హరియాణా అసెంబ్లీకి మెజారిటీ మార్క్ 46.
Tue, 08 Oct 202405:06 AM IST
లీడింగ్‌లో హరియాణా సీఎం..
హరియాణా సీఎం నాయబ్ సింగ్.. లద్వా అసెంబ్లీ నియోజకవర్గంలో లీడింగ్‌లో ఉన్నారు. ఆయన ప్రత్యర్థి మేవా సింగ్ వెనకంజలో ఉన్నారు.
Tue, 08 Oct 202404:52 AM IST
హరియాణాలో పుంజుకున్న బీజేపీ..
హరియాణాలో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. ఉదయం 10 గంటల ట్రెండ్స్ ప్రకారం రాష్ట్రంలో 47 చోట్ల బీజేపీ లీడింగ్‌లో ఉంది. కాంగ్రెస్ 37 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇతరులు 8 చోట్ల లీడింగ్‌లో ఉన్నారు.
Tue, 08 Oct 202404:23 AM IST
వెనకంజలో బీజేపీ..
జమ్ముకశ్మీర్‌లోనూ బీజేపీ వెనకంజలో ఉంది. ప్రస్తుతం 27 స్థానాల్లోనే లీడింగ్‌లో ఉంది. కాంగ్రెస్ కూటమి 46 చోట్ల ముందువరుసలో ఉంది. పీడీపీ 3 చోట్ల, ఇతరులు 6 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నారు.
Tue, 08 Oct 202403:45 AM IST
వినేస్ ఫోగట్ లీడింగ్..
ప్రారంభ ట్రెండ్స్ ప్రకారం బీజేపీ అభ్యర్థి యోగేష్ బజరంగీపై కాంగ్రెస్ అభ్యర్థి వినేస్ ఫోగట్ ముందంజలో ఉన్నారు.
Tue, 08 Oct 202403:45 AM IST
హరియాణాలో కాంగ్రెస్ లీడింగ్..
హరియాణాలో కాంగ్రెస్ లీడింగ్‌లోకి వచ్చింది. 47 చోట్ల ఆధిక్యంలో ఉంది. అధికార బీజేపీ కేవలం 24 చోట్ల ముందుంది.
Tue, 08 Oct 202403:20 AM IST
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు..
హరియాణాలో మొత్తం 90 సీట్లకు అక్టోబర్ 5న ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మెజారిటీ ఫిగర్ 46. ఉదయం 8:30 గంటలకు ఉన్న అప్డేట్స్ ప్రకారం ఇక్కడ అధికార బీజేపీ 27 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. 10ఏళ్ల పాటు విపక్షానికే పరిమితమైన కాంగ్రెస్ 29 చోట్ల ముందంజలో ఉంది. ఇతరులు మూడు చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.
హరియాణాలో ఈసారి కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యం అని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో ఎర్లీ ట్రెండ్స్‌లో కమలదళం కాస్త పోటీని చూపిస్తుండటం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతుంది.
Tue, 08 Oct 202403:03 AM IST
జమ్ముకశ్మీర్‌లో హోరాహోరీ..
ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం జమ్ముకశ్మీర్‌లోనూ పోటాపోటీ వాతావరణం కనిపిస్తోంది. ఇక్కడ బీజేపీ 12 చోట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్-ఎన్సీ కూటమి 9 స్థానాల్లో ముందంజలో ఉంది.
Tue, 08 Oct 202403:02 AM IST
హరియాణాలో పోటాపోటీ..
ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం హరియాణాలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తోంది. బీజేపీ 18 స్థానాల్లో ముందంజలో ఉండగా, కాంగ్రెస్ 16 చోట్ల లీడింగ్‌లో ఉంది.
Tue, 08 Oct 202402:34 AM IST
ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలు..
హరియాణా, జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. రెండు చోట్ల 90 సీట్లు ఉండగా, మెజారిటీ మార్క్ 46.
Tue, 08 Oct 202402:14 AM IST
ఓట్ల లెక్కింపు ప్రక్రియ..
Assembly election results 2024 : ఇంకొద్ది సేపట్లో హరియాణా, జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. తొలుత బ్యాలెట్ పేపర్స్‌ని లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంలలో పోల్ అయిన ఓట్లను లెక్కిస్తారు.
Tue, 08 Oct 202401:54 AM IST
జమ్ముకశ్మీర్ ఎగ్జిట్ పోల్స్..
Jammu Kashmir Exit polls : ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ కంటే నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) -కాంగ్రెస్ కూటమికి అడ్వాంటేజ్ ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.
జమ్ము ప్రాంతంలోని 43 స్థానాలకు గాను బీజేపీకి 27-32 సీట్లు, ఎన్సీ-కాంగ్రెస్‌కి 11-15, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ)కి 0-2, ఇతరులకు 0-1 సీట్లు వస్తాయని సీ ఓటర్ అంచనా వేసింది.
కశ్మీర్లో ఎన్సీ-కాంగ్రెస్‌కి 29-33, బీజేపీకి 0-1, పీడీపీకి 6-10, ఇతరులకు 6-10 సీట్లు వస్తాయని అంచనా వేసింది. మొత్తం 90 స్థానాలకు గాను ఎన్సీ-కాంగ్రెస్ 40-48, బీజేపీ 27-32, పీడీపీ 6-12, ఇతరులు 6-11 సీట్లు గెలుచుకుంటారని తెలిపింది. జమ్ముకశ్మీర్‌లో ఒక పార్టీ లేదా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 46 సీట్లు అవసరం.
Tue, 08 Oct 202401:28 AM IST
హరియాణా సీఎం ఎవరు?
Haryana exit polls : హరియాణా ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజమైతే సీఎం పీఠం కోసం కాంగ్రెస్‌లోని భూపిందర్ సింగ్ హుడా ముందంజలో ఉన్నారు. ప్రస్తుత హరియాణా అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న హుడా 2005 నుంచి 2014 వరకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు.
Tue, 08 Oct 202401:05 AM IST
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు..
Jammu Kashmir election results : 2014 తర్వాత జమ్ముకశ్మీర్‌లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. సెప్టెంబర్ 18న జరిగిన తొలి విడతలో 24 స్థానాలకు, సెప్టెంబర్ 25న రెండో దశలో 26 స్థానాలకు పోలింగ్ జరిగింది.
మిగిలిన 40 స్థానాలకు అక్టోబర్ 1న మూడో విడత పోలింగ్ జరిగింది.
గత ఎన్నికలకు భిన్నంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన 65.52 శాతంతో పోలిస్తే కేంద్రపాలిత ప్రాంతంలో 63.45 శాతం పోలింగ్ నమోదైంది.
Tue, 08 Oct 202412:47 AM IST
కాంగ్రెస్‌దే హరియాణా?
పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ హరియాణాలో బీజేపీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకుంటుందని శనివారం విడుదలైన దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.
మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా నేతృత్వంలో జోరుగా ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ 90 మంది సభ్యుల సభలో 49-55 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. హరియాణాలో ఒక పార్టీ లేదా సంకీర్ణం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మెజారిటీ మార్కు 46.
ప్రభుత్వ వ్యతిరేకత, రైతుల ఆగ్రహావేశాలు, అంతర్గత కుమ్ములాటలు, నిరుద్యోగ సమస్యలను ఎదుర్కొన్న బీజేపీకి గరిష్టంగా 32 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి.
Tue, 08 Oct 202412:38 AM IST
బీజేపీకి కీలకం..!
2024 లోక్‌సభ ఎన్నికల అనంతరం జరగుతున్న తొలి ఎలక్షన్స్ కారణంగా హరియాణా, జమ్ముకశ్మీర్ ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. నాడు బీజేపీ ఆశించిన మేర రాణించలేకపోయింది. ఇప్పుడు కూడా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కమల దళానికి ప్రతికూలంగానే ఉన్నాయి. మరి ప్రజలు బీజేపీకి ఓటు వేశారా? లేదా? అన్నది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.
Tue, 08 Oct 202412:33 AM IST
జమ్ముకశ్మీర్ ఎన్నికల ఫలితాలు..
జమ్ముకశ్మీర్‌లోని మొత్తం 90 సీట్లకు మూడు దశల్లో పోలింగ్ జరిగింది. ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 46 స్థానాల్లో విజయం సాధించాలి. 2018 జూన్ తర్వాత తొలిసారిగా ఇక్కడ ఒక ప్రభుత్వ పాలన మొదలవ్వనుంది. కానీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఫలితంగా ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Tue, 08 Oct 202412:31 AM IST
హరియాణా ఎన్నికల ఫలితాలు 2024..
Haryana election results today : హరియాణాలో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభంకానుంది. దీనికోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. మొత్తం 90 సీట్ల అసెంబ్లీకి అక్టోబర్ 5న ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 46 స్థానాల్లో విజయం సాధించాలి. ఇక్కడ 10ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వంలో ఉంది. కానీ ఈసారి కాంగ్రెస్ భారీ విజయాన్ని అందుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ సూచించాయి.
Tue, 08 Oct 202412:28 AM IST
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు..
హరియాణాతో పాటు జమ్ముకశ్మీర్ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఇంకొన్ని గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభంకానుంది.