Rajkot Fire Accident : రాజ్ కోట్ లో ఘోర అగ్ని ప్రమాదం, గేమ్ జోన్ లో మంటలు చెలరేగి 22 మంది మృతి!-gujarat rajkot trp game zone fire accident at least 20 people died rescue operations going ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rajkot Fire Accident : రాజ్ కోట్ లో ఘోర అగ్ని ప్రమాదం, గేమ్ జోన్ లో మంటలు చెలరేగి 22 మంది మృతి!

Rajkot Fire Accident : రాజ్ కోట్ లో ఘోర అగ్ని ప్రమాదం, గేమ్ జోన్ లో మంటలు చెలరేగి 22 మంది మృతి!

Bandaru Satyaprasad HT Telugu
May 25, 2024 10:03 PM IST

Rajkot Fire Accident : గుజరాత్ రాజ్ కోట్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది, గేమ్ జోన్ మంటలు చెలరేగి 22 మంది మృతి చెందారు. ఈ ఘటనపై గుజరాత్ సీఎంతో పాటు ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

రాజ్ కోట్ లో ఘోర అగ్ని ప్రమాదం, గేమ్ జోన్ లో మంటలు చెలరేగి 20 మంది మృతి!
రాజ్ కోట్ లో ఘోర అగ్ని ప్రమాదం, గేమ్ జోన్ లో మంటలు చెలరేగి 20 మంది మృతి!

Rajkot Fire Accident : గుజరాత్ రాష్ట్రంలోని రాజ్ కోట్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. టీఆర్పీ గేమ్ జోన్ లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 22 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నారు. అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నాయి. ఇంకా మంటల్లో పలువురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారిని రక్షించేందుకు పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మృత్యుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ ఘటనపై గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

22 మంది మృతి!

రాజ్‌కోట్ అగ్ని ప్రమాదంపై స్థానిక పోలీస్ కమిషనర్ రాజు భార్గవ మీడియాతో మాట్లాడుతూ... "శనివారం మధ్యాహ్నం టీఆర్పీ గేమింగ్ జోన్‌లో మంటలు చెలరేగాయి. రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. మంటలు అదుపులోకి వచ్చాయి. వీలైనంత త్వరగా మృతదేహాలను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నాము. ప్రస్తుతానికి 22 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాము. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమ్మిత్తం ఆసుపత్రికి పంపాము. ఈ గేమింగ్ జోన్ యువరాజ్ సింగ్ సోలంకి అనే వ్యక్తికి చెందినది. అతడిపై నిర్లక్ష్యానికి పాల్పడినందుకు కేసు నమోదు చేస్తాం. రెస్క్యూ కార్యకలాపాలను పూర్తి చేసిన తర్వాత తదుపరి విచారణ జరుగుతుంది." అన్నారు. అగ్నిప్రమాదంపై రాజ్‌కోట్ కలెక్టర్ ప్రభావ్ జోషి మాట్లాడుతూ, "సాయంత్రం 4.30 గంటలకు ప్రమాదం గురించి కాల్ వచ్చింది... గేమింగ్ జోన్‌లోని తాత్కాలిక నిర్మాణం మంటలు చెలరేగి కూలిపోయింది. 2 గంటల క్రితం మంటలను నియంత్రించారు. శిథిలాలను తొలగిస్తున్నారు. సీఎంతో నిరంతరం టచ్‌లో ఉన్నాం" అన్నారు.

మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం

రాజ్ కోట్ అగ్ని ప్రమాదంపై గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.4 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిహారం అందజేస్తామని సీఎం తెలిపారు. ఈ ప్రమాదంపై దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రాజ్‌కోట్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన మనందరినీ బాధకు గురిచేసిందన్నారు. కొద్దిసేపటి క్రితం గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ తనతో టెలిఫోన్ సంభాషణలో బాధితులకు అన్ని విధాలా సహాయం అందించేందుకు జరుగుతున్న ప్రయత్నాల గురించి చెప్పారని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

"రాజ్ కోట్ గేమ్‌జోన్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాను. ఈ ప్రమాదానికి సంబంధించి ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో మాట్లాడి సమాచారం తెలుసుకున్నాను. ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం అంందిస్తుంది" అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. ఈ విషాద సమయంలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం