Haryana bus accident today : హరియాణాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నూహ్ ప్రాంతంలో ఓ టూరిస్ట్ బస్సుకు మంటలు అంటుకున్నాయి. శుక్రవారం అర్థరాత్రి 1:30 నిమిషాల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 24 మంది గాయపడ్డారు!
నూహ్ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో కనీసం 60 మంది ఉంటారని సమాచారం. వీరిలో చాలా మంది మతపరమైన యాత్రలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన స్థానిక పోలీసులు.. ఘటనాస్థలానికి పరుగులు తీశారు. సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులు, మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.
అర్థరాత్రి వేళ.. ఒక బ్రిడ్జ్ మీద బస్సు తగలబడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
“బస్సులో చాలా మంది నా బంధువులు ఉన్నారు. పంజాబ్ నుంచి మేమందరం 7,8 రోజుల పవిత్ర యాత్రకు వెళ్లి తిరిగొస్తున్నాము. నాకు కాలిన వాసన వచ్చింది. కంగారు పడ్డాను. అదే సమయంలో ఓ బైకర్.. బస్సును ఛేజ్ చేసుకుంటూ వచ్చాడు. బస్సు వెనక మంటలు చెలరేగినట్టు చెప్పాడు. వెంటనే బ్రేక్‌లు పడ్డాయి. ఆ మాటలు విన్న నేను.. బస్సు నుంచి దూకేశాను,” అని ఓ ప్రయాణికురాలు మీడియాకు వివరించారు.
Nuh bus accident death toll : బస్సుకు మంటలు అంటుకున్నట్టు. స్థానిక దుకాణంలో పని చేస్తున్న ఓ వ్యక్తి గమనించాడు. వెంటనే అక్కడికి పరుగులు తీశాడు. అద్దాలు పగలగొట్టి, దాదాపు 10మందిని రక్షించాడు. మంటలు వ్యాపించడంతో ఇతరులను కాపాడలేకపోయాడు.
అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేయడానికి 3 గంటల సమయం పట్టినట్టు, అప్పటికే బస్సు దగ్ధమైపోయినట్టు సమాచారం.
కాగా.. బస్సు ప్రమాదం ఎలా జరిగింది? మంటలు ఎలా అంటుకున్నాయి? వంటి వివరాలు తెలియరాలేదు.
ఈ పూర్తి వ్యవహారంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
దేశంలో రోడ్లు నెత్తురోడుతున్నాయి! ఏదో ఒక మూల రోజూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దిల్లీ- మీరట్ ఎక్స్‌ప్రెస్ వేపై ఆగి ఉన్న ఓ ట్రక్‌ని.. అతివేగంతో ఢీకొట్టింది ఒక బస్సు. ఈ ఘటనలో 14మంది గాయపడ్డారు.
పోలీసుల కథనం ప్రకారం.. ప్రమాదం జరిగిన సమయంలో సంబంధిత బస్సులో 26మంది ప్రయాణికులు ఉన్నారు. మసౌరి పోలీస్ స్టేషన్ పరిథిలోని హవా హవాయి అనే రెస్టారెంట్‌కి 3 కి.మీల దూరంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.
Delhi Merut expressway accident : ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులతో సహా మూడు అంబులెన్స్‌లు ఘటనాస్థలానికి చేరుకున్నాయి.
"బస్సులోని ఇద్దరు ప్రయాణికులు హజ్ యాత్రకు వెళుతున్నారు. వారిని దిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో దింపేందుకు మిగిలిన వారు బస్సులో ప్రయాణించారు. వీళ్లందరు బిజ్నూర్ వాసులు. ప్రమాదంలో 14మంది గాయపడ్డారు. చాలా మందికి ఫ్రాక్చర్స్ అయ్యాయి. పలువురికి తీవ్రంగా గాయలయ్యాయి," అని పోలీసులు వెల్లడించారు.
Accident on Delhi Merut expressway : అయితే.. ప్రమాదం జరిగినప్పటికీ.. ఈ ఇద్దరు హజ్ యాత్రికులు క్షేమంగా బయటపడినట్టు, వారిద్దరు దిల్లీ విమానాశ్రయానికి వెళ్లి శుక్రవారం ఉదయం విమానం ఎక్కినట్టు తెలుస్తోంది.
సంబంధిత కథనం