ఆసుపత్రులపై దాడి చేస్తే, 6 గంటల్లోగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి: కేంద్రం ఆదేశాలు
ఆసుపత్రులు, వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆసుపత్రులు, వైద్య సిబ్బందిపై దాడులు చేస్తే, ఆరు గంటల్లోగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని స్పష్టమైన ఆదేశాలను యూనియన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) జారీ చేశారు.
ఆస్పత్రుల్లో హింసాత్మక ఘటనలు జరిగిన ఆరు గంటల్లోగా సంస్థాగత ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు (FIR) నమోదు చేయాలని ప్రభుత్వ ఆసుపత్రుల అధిపతులకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ శుక్రవారం మెమోరాండం జారీ చేసింది. ‘‘విధి నిర్వహణలో ఉన్న ఆరోగ్య కార్యకర్తపై ఏదైనా హింస జరిగితే, సంఘటన జరిగిన గరిష్టంగా 6 గంటల్లోపు సంస్థాగత ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి సంస్థ అధిపతి బాధ్యత వహిస్తారు’’ అని స్పష్టం చేసింది.
వైద్య సిబ్బందే బాధితులు
ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బందిపై హింస సర్వసాధారణంగా మారిందని యూనియన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) కు చెందిన అతుల్ గోయల్ సంతకం చేసిన ఈ మెమోరాండంలో పేర్కొన్నారు. ‘‘విధి నిర్వహణలో పలువురు ఆరోగ్య కార్యకర్తలు మానసికంగా, శారీరకంగా గాయాల పాలయ్యారు. చాలా మందిని బెదిరించారు లేదా మాటల దాడికి గురిచేశారు. ఈ హింసలో ఎక్కువ భాగం రోగులు లేదా రోగుల బంధుమిత్రులే చేశారు’’ అని పేర్కొన్నారు.
కోల్ కతా ఆసుపత్రిపై దాడి నేపథ్యం
కోల్ కతాలోని ఆర్జీ కర్ కాలేజ్ అండ్ హాస్పిటల్ పై బుధవారం రాత్రి జరిగిన దాడి నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 9న రాత్రి ఆసుపత్రి సెమినార్ గదిలో అత్యాచారం, హత్యకు గురైన 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ (Kolkata doctor rape and murder) కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైద్యులు ఆందోళనకు దిగారు. కోల్ కతాలోని ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ సెమినార్ హాల్ లో జూనియర్ డాక్టర్ హత్యాచారంపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు, ముఖ్యంగా వైద్య సిబ్బంది విధులను బహిష్కరించి, నిరసనల్లో పాల్గొంటున్నారు.