Sangareddy News : తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులలో సేవలు భేష్, యూనిసెఫ్ ప్రతినిధుల కితాబు-sangareddy unicef delegation visited government hospitals anganwadi centers ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Sangareddy News : తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులలో సేవలు భేష్, యూనిసెఫ్ ప్రతినిధుల కితాబు

Sangareddy News : తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులలో సేవలు భేష్, యూనిసెఫ్ ప్రతినిధుల కితాబు

HT Telugu Desk HT Telugu

Sangareddy News : 35 మంది యూనిసెఫ్ ప్రతినిధుల బృందం సంగారెడ్డి జిల్లాలో పర్యటించింది. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పిల్లలు, గర్భిణీలకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు.

యూనిసెఫ్ ప్రతినిధుల బృందం

Sangareddy News : తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రులలో అందిస్తున్న సేవలు బాగున్నాయని, ఆస్పత్రుల నిర్వాహణ, రోగుల పట్ల తీసుకుంటున్న శ్రద్ధ, అందిస్తున్న వైద్య చికిత్సలను యూనిసెఫ్ డెలిగేట్స్ అభినందించారు. మంగళవారం సుమారు 35 మంది యూనిసెఫ్ డెలిగేట్స్ బృందం సంగారెడ్డి జిల్లాలో పర్యటించి, వైద్య ఆరోగ్యశాఖ ద్వారా అందుతున్న వైద్య సేవలు, గర్భిణీలు పిల్లల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. సంగారెడ్డిలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, మాత శిశు ఆసుపత్రిని పరిశీలించారు. మాతా శిశు మరణాల రేటు తగ్గుదలకు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. పిల్లలకు, గర్భిణీలకు అందిస్తున్న పౌష్టికాహారం, నిర్ణీత సమయంలో ఇస్తున్న వ్యాక్సినేషన్లు, వైద్యులు వైద్య సిబ్బంది అందిస్తున్న సహకారాన్ని అడిగి తెలుసుకున్నారు. మతా శిశు ఆస్పత్రి నిర్వహణ, అందిస్తున్న సేవలపై యూనిసెఫ్ బృందం సంతృప్తిని వ్యక్తం చేశారు.

ప్రభుత్వ వైద్య సేవలపై పీపీటీ

అంతకుముందు కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో వైద్యులు, డీఎంహెచ్ఓ డాక్టర్ గాయత్రి దేవి, జీజీహెచ్ సూపరిండెంట్ డాక్టర్ అనిల్, వైద్యులతో యూనిసెఫ్ ప్రతినిధులు భేటీ అయ్యారు.. తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ బలోపేతం చేసి, ప్రభుత్వ ఆసుపత్రులలో అందిస్తున్న ఉచిత వైద్య సేవలను, హెల్త్ ఇండికేటర్స్ మేరకు తీసుకుంటున్న చర్యలు, పేదలకు నాణ్యమైన వైద్య సదుపాయాలను అందించడమే లక్ష్యంగా చేస్తున్న కార్యక్రమాలను యూనిసెఫ్ బృందానికి పీపీటీ ద్వారా వివరించారు. మాతా శిశు సంరక్షణకు తీసుకుంటున్న ఆయా చర్యలను వివరించారు. గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్, ప్రసవానంతరం కేసీఆర్ కిట్ అందిస్తున్నామని, అదేవిధంగా సాధారణ ప్రసవాలు చేసేలా వైద్య సిబ్బందిని ప్రోత్సహిస్తున్నామన్నారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. జిల్లాలో 86 శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్నాయని తెలిపారు. యూనిసెఫ్ సహకారంతో అందిస్తున్న సేవలను వివరించారు. 18 సంవత్సరాలు పైబడిన మహిళల కోసం ప్రత్యేక వ్యాధులను గుర్తించి చికిత్స అందించడానికి ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని ప్రతి మంగళవారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

అంగన్వాడీ కేంద్రాలు పరిశీలన

సంగారెడ్డి జిల్లాలో ఆసుపత్రుల వివరాలు అందిస్తున్న సేవలను డీఎంహెచ్ఓ యూనిసెఫ్ బృందానికి తెలియజేశారు. సంగారెడ్డి ఆసుపత్రికి లక్ష్యా ,ముస్కాన్ అవార్డులు వచ్చాయని, అదేవిధంగా ఈడీడీ క్యాలెండర్, కాల్ సెంటర్ ద్వారా గర్భిణీల యోగక్షేమాలు కనుక్కోవడంతోపాటు ఆయా తేదీలలో చేయాల్సిన చెకప్ లు, ఇవ్వాల్సిన ఇమ్యునైజేషన్ అందిస్తున్నామన్నారు. టిపా స్కాన్ ద్వారా అందుతున్న వైద్య సేవలు, తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ లో చేస్తున్న వివిధ పరీక్షల గురించి వారికి వివరించారు. పీడియాట్రిక్ విభాగంలో తక్కువ బరువుతో పుట్టిన బిడ్డలకు అందించిన సేవలు, తదితరాలపై సక్సెస్ స్టోరీలను యూనిసేఫ్ బృందానికి వివరించారు. అంతకుముందు యూనిసెఫ్ బృందం గోపులారం గ్రామంలో అంగన్వాడీ సెంటర్లను సందర్శించారు. అంగన్వాడీ సెంటర్లలో అందిస్తున్న పౌష్టికాహారం తదితరాలపై సంతృప్తిని వ్యక్తం చేశారు.