Where Is Bhole Baba : భోలే బాబా ఎక్కడున్నారు? ఎఫ్ఐఆర్‌లో లేని అతడి పేరు!
Hathras Stampede : ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో మంగళవారం విషాద సంఘటన చోటుచేసుకుంది. భోలే బాబా పిలిచిన మతపరమైన సమావేశంలో తొక్కిసలాట జరిగి వంద మందికిపైగా మరణించారు. అయితే ఇప్పుడు భోలే బాబా ఎక్కడున్నారు? ఎఫ్ఐఆర్‌లో అతడి పేరు ఎందుకు లేదు?
హత్రాస్ తొక్కిసలాట దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భోలే బాబా సత్సంగ్ కార్యక్రమానికి లక్షమందికి పైగా వెళ్లారు. ఇక్కడ జరిగిన తొక్కిసలాటలో కనీసం 116 మంది మరణించారు. హత్రాస్‌లోని ఫుల్‌వాయి గ్రామంలో సత్సంగ్ నిర్వహించారు. ఈ విషాదంలో చాలా మంది గాయపడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఎక్కువగా ఉన్నారు. దీంతో జూలై 4న ఆగ్రాలో జరగాల్సిన మరో సత్సంగ్ కార్యక్రమాన్ని నిషేధించారు.
అయితే అందరూ వచ్చింది భోలే బాబా కోసమే.. ఇప్పటి వరకూ ఆయన ఎక్కడున్నారు అనేది మాత్రం తెలియరావడం లేదు. ఉపన్యాసాలు ఇచ్చే బాబా మరణాల తరువాత కనిపించలేదు. మంగళవారం జరిగిన దుర్ఘటన అనంతరం బాబా ఇప్పుడు కనిపించకుండా పోయారు. అతను మెయిన్‌పురిలోని ఒక ఆశ్రమంలో తలదాచుకున్నాడని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. పోలీసులు ఈ ఉదయం ఆశ్రమం, రామ్ కుటీర్ ఛారిటబుల్ ట్రస్ట్‌పై దాడి చేశారు. భోలే బాబా అనుచరులు కూడా ఈ ఆశ్రమంలో ఉన్నారు.
తొక్కిసలాట ఘటనపై హత్రాస్ జిల్లా సికంద్రా రౌ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఇందులో భోలే బాబా పేరు లేదు. స్థానికుడైన బ్రజేష్ పాండే ఫిర్యాదు మేరకు మంగళవారం రాత్రి సెక్షన్ 105, 110, 126(2), 223, 238 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
నిర్వాహకులు, ఇతర తెలియని వారి పేర్లు కూడా ఉన్నాయి. గతంలో చూసినట్లుగా సత్సంగ్‌లో లక్షల్లో గుమిగూడే వారి సంఖ్యను నిర్వాహకులు దాచిపెట్టారని FIRలో పేర్కొన్నారు. హత్రాస్ జిల్లాలోని జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఫూల్రాయ్ గ్రామంలో సత్సంగం సందర్భంగా 80000 మంది కోసం అనుమతి కోరారు. కానీ ఊహించినదానికంటే ఎక్కువగా జనాలు వచ్చారు. అయితే భోలే బాబా కారణంగానే అంతమంది జనం వచ్చారు. అయితే ఎఫ్ఐఆర్‌లో మాత్రం అతడి పేరు లేదు.
భోలే బాబా సత్సంగ్ హత్రాస్ జిల్లా ఫుల్వాయి గ్రామంలోని హైవేకి ఆనుకుని ఉన్న ప్రదేశంలో జరుగుతోంది. అందుకోసం పెద్ద టెంట్ వేశారు. ఇది ఒకరోజు కార్యక్రమం కావడంతో ఉదయం నుంచే భక్తులు ఇక్కడికి చేరుకోవడం ప్రారంభించారు. తర్వాత భోలే బాబా దాదాపు మధ్యాహ్నం 12 గంటలకు వేదిక వద్దకు చేరుకున్నారు.
నిర్వాహకులు క్లెయిమ్ చేసినట్లుగా అంచనా వేసిన 80000 సంఖ్యకు కంటే ఎక్కువగా సుమారు 2.5 లక్షల మంది వచ్చారు. భోలే బాబా కాన్వాయ్ సత్సంగ్ తర్వాత బయటకు వెళ్లింది. ఈ సమయంలో తొక్కిసలాట జరిగింది.
టాపిక్