Hathras Stampede : హత్రాస్ తొక్కిసలాటకు అనేక కారణాలు.. మూసి ఉన్న టెంట్‌లో కార్యక్రమం నిర్వహించారా?
Hathras Stampede Deaths : హత్రాస్ తొక్కిసలాట గురించి అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ ఘటనకు వివిధ కారణాలను చెబుతున్నారు. అందుకే ఎక్కువ మంది మృతి చెందారని ఆరోపిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో మంగళవారం ఒక మతపరమైన కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో కనీసం 107 మంది మృతి చెందారు. ఇందులో ఎక్కువగా మహిళలే ఉన్నారు. భోలే బాబా అనే బోధకుడు సత్సంగ్( మత సమావేశం ) ఏర్పాటు చేసిన ప్రదేశంలో ఈ సంఘటన జరిగింది. 100 మందికి పైగా ప్రాణాలను పోవడానికి గల కారణాలపై అనేక విషయాలు బయటకు వస్తున్నాయి.
భోలే బాబా అనుచరుల మధ్య 'రాజ్' (ధూళి) సేకరించడం కోసం జరిగిన తోపులాటలో ఈ ఘటన జరిగిందని కొందరు చెబుతున్నారు. ఇది బాబా అందించే పౌడర్ లాంటిదని అంటున్నారు. వేదిక నుండి భోలే బాబా వాహనం వెళ్ళినప్పుడు తొక్కిసలాటకు కారణమని ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పారు. 'మంగళవారం గంటన్నరకు పైగా సత్సంగ్‌లో ప్రసంగించిన తర్వాత బాబా వెళ్లిపోయారు. అనుచరులు ధూళి కోసం పోటీ పడ్డారు, కానీ జారే నేల కారణంగా ఒకరిపై ఒకరు పడ్డారు, ఇది తొక్కిసలాటకు దారితీసింది.'అని ప్రత్యక్ష సాక్షి చెప్పుకొచ్చారు.
వేదిక వద్ద అనుమతించిన పరిమితిని మించి హాజరైన వారితో ఈ ఘటన జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఇదే భోలే బాబా సత్సంగ్ సమయంలో తొక్కిసలాటకు దారితీసిందని అంటున్నారు.
హత్రాస్ జిల్లా ప్రధాన కార్యాలయానికి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫుల్రాయ్ గ్రామంలో జరిగిన తొక్కిసలాటలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధికంగా ఉండటం వల్లే జరిగిందని అధికారులు తెలిపారు.
ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (అలీగఢ్ రేంజ్) శలభ్ మాథుర్ మాట్లాడుతూ.. కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని అంటున్నారు. అయితే ప్రాథమిక నివేదికల ప్రకారం మూసి ఉన్న టెంట్‌లో సమావేశం నిర్వహించినట్లు అధికారి తెలిపారు. భక్తులు ఉక్కిరిబిక్కిరి కావడం వల్లే తొక్కిసలాట జరిగిందని చెప్పుకొచ్చారు. అక్కడ ఉన్నవారు అటు ఇటు పరిగెత్తడంతో తొక్కిసలాటకు దారితీసింది.
మరో ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ.. అనుచరులు వేదిక నుండి బయటకు వెళ్లేందుకు సిద్ధమయ్యే సమయంలో భోలే బాబా కాన్వాయ్ వెళ్లినప్పుడు ఆగారని చెప్పారు. 'అనుచరులు వేదిక నుండి బయలుదేరడానికి అనుమతిచ్చారు. తర్వాత వేడి, తేమతో కూడిన వాతావరణంతో ఒత్తిడి అసౌకర్యానికి దారితీసింది. దీంతో తొక్కిసలాటకు దారితీసింది.' అని ప్రత్యక్ష సాక్షి చెప్పారు.
నిజానికి పెద్ద సంఖ్యలో సత్సంగ్‌కు జనాలు వచ్చారు. కార్యక్రమం ముగిసి విడిచి వెళ్ళే తొందరలో అంతా జరిగింది. బయటకు వెళ్లే మార్గం కనిపించకపోవడంతో అందరూ ఒకరిపై ఒకరు పడటంతో తొక్కిసలాట జరిగిందని అంటున్నారు. దారికి అడ్డుగా మోటార్‌సైకిళ్లు పార్క్ చేసి ఉండడం కనిపించిందని కొందరి ఆరోపణ. చాలా మంది స్పృహ తప్పి పడిపోయారు, మరికొందరు చనిపోయారు.. అని జ్యోతి అనే మహిళ తెలిపారు.
తొక్కిసలాట జరగడంతో వేదిక వద్ద ఉన్న కొందరు అటు ఇటు పరిగెత్తారు. సమీపంలోని వ్యవసాయ ప్రాంతానికి వెళ్లారు. అయితే ఇటీవల వర్షం కారణంగా అక్కడ మట్టి తడిగా ఉంది. ఫలితంగా కొందరు కింద పడిపోయారు. దాదాపు లక్ష మంది వరకు గుమిగూడటంతో ఈ కార్యక్రమానికి జనసమూహం భారీగా ఉంది. వారిని తీసుకొచ్చిన వాహనాలు, బస్సులు, బైక్‌లు, ఆటోలు జాతీయ రహదారిపై మూడు కిలోమీటర్ల విస్తీర్ణంలో పార్క్ చేశారు.